Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: క్రేజీ అంకుల్స్

మూవీ రివ్యూ: క్రేజీ అంకుల్స్

టైటిల్: క్రేజీ అంకుల్స్
రేటింగ్: 1/5
తారాగణం: బండ్ల గణేష్, ప్రవీణ్, శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి శంకర్, పోసాని, హేమ, భార్గవి తదితరులు
సంగీతం: రఘు కుంచె, భోలె
రచన: డార్లింగ్ స్వామి
నిర్మాత: కిరణ్ కె తలశిల
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
విడుదల తేదీ: 19 ఆగష్ట్ 2021

శ్రీముఖి ప్రధాన పాత్రలో రాజా రవీంద్ర, మనో, భరణి శంకర్ టైటిల్ పాత్రల్లో వచ్చిన "క్రేజీ అంకుల్స్" ఈ రోజు విడుదలయ్యింది. మిడిలేజ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టుగా ఉన్న ఈ సినిమా తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.

కమెడియన్ ప్రవీణ్ నిర్మాత బండ్ల గణేష్ దగ్గరకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ కాబోయే కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. ఆ కథ పేరే "క్రేజీ అంకుల్స్". ఇక కథ వినండి. 

రాజు (రాజ అరవీంద్ర), రెడ్డి (మనో), రావు (భరణి శంకర్) ముగ్గురూ ఒకే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఉండే స్నేహితులు. వీరిలో రాజుది రియలెస్టేట్ బిజినెస్, రెడ్డి నగల వ్యాపారి, రావు ఫైనాన్షియర్. 50 ఏళ్ల వయసులో ఉండే ఈ ముగ్గురికీ స్వీటి (శ్రీముఖి) అంటే క్రేజ్. ఆమె ఒక అందమైన పాపులర్ సింగర్.

ఆమె ఒక యోగా స్కూల్లో చేరితే ఈ ముగ్గురూ కూడా అక్కడే ఆమె బ్యాచులోనే చేరతారు. యోగాలో ఆమె పక్కనే చేరి ఫ్లర్టింగ్ చేస్తారు. మొత్తానికి ఆమె పీయేని పట్టుకుని రాజు 50 వ జన్మదినానికి ఆమె పాటల ప్రోగ్రాం కి ఒప్పిస్తారు. ఆమె పాడుతుంది. అయితే డబ్బు పారేస్తే ఏ సెలెబ్రిటీ అయినా పక్కలోకొస్తుందనే ఆలోచనతో ఈ ముగ్గురూ ఒకరికి తెలియకుండా ఒకరు పీయే సాయంతోనే ఆమెతో ఒక రాత్రి గడుపుతారు.

తర్వాత ఆమె వీరిలో ఒకరి వల్ల తనకి కడుపొచ్చిందంటూ నేరుగా అదే కాంప్లెక్సులో ఒక ఫ్లాటులో అద్దెకు దిగుతుంది. ముగ్గుర్నీ బ్లాక్ మెయిల్ చేస్తూ సేవలు చేయించుకుంటుంది. చివరికి కోట్ల రూపాయల డబ్బు కూడా గుంజుకుంటుంది.

ఈ ముగ్గురూ ఆల్మోస్ట్ రెడ్ హ్యాండెడ్ గా తమ భార్యలకు దొరకడం..ఏదో చేసి తప్పించుకోవడం లాంటి ప్రహసనాలతో కథ కొలిక్కొస్తుంది.  ఇంతకీ స్వీటీ అలా ఎందుకు చేసింది? ఆమెకి ఎవరి వల్ల కడుపొచ్చింది? చివరకి ఈ ముగ్గురు ప్రబుద్ధుల కథ ఎలా ముగిసిందనేది పాయింట్.

అంతా అయ్యాక డబ్బుతో దేన్నైనా కొనొచ్చు గానీ ఆడదాన్ని కొనలేం...అనేది సందేశం.

ఈ కథంతా విని, చివర్లో చెప్పిన చప్పని ట్విస్టుని కూడా బాగుందంటూ చప్పరించి బండ్ల గణేష్ ఈ బ్లాక్ బస్టర్ కథని సినిమాగా తీయడానికి ఒప్పుకుంటాడు.

అదీ కథ. దీంట్లో ఇతర టెక్నికల్ విలువలు వగైరాలని సమీక్షించుకోవడం అనవసరం. అసలు కథ, కథనమే చెత్తకంపు కొడుతుంటే దాని మీద ఏ సెంటు జల్లితే ఏవరిక్కావాలి?

దీనిని డి -గ్రేడ్ సినిమా అంటే "డి" అనే అక్షరం ఏడుస్తుంది. పోనీ "చెత్త" అందామంటే చెత్తకైనా రీసైకిల్ వేల్యూ ఉంది కదా అనిపిస్తుంది. అసహనాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా అర్థం కాని సినిమా ఇది. 

ఎవరి నటన గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.  ఎస్పీబీ తర్వాత అంతటి సీనియరిటీ ఉన్న గాయకుడు మనో. ఇలాంటి సినిమాలు ఆయన ఇమేజ్ ని కాస్త దిగజారుస్తాయే తప్ప ఏ రకంగానూ ఉపయోగపడవు. ఆయనకిది స్థాయి తక్కువ సినిమా.

శ్రీముఖికి కూడా కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడదిది. పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా స్కోప్ లేదు. మనసుకి హత్తుకునే పాత్ర కూడా కాదు.కోపధారి మనిషి అని యూట్యూబులో తెగ వైరల్ అయిన ఒకాయన ఉన్నారు. ఈ సినిమా చూస్తుంటే ప్రేక్షకులకి ఆయన పూనొచ్చు.

చూస్తున్నంత సేపూ మనసులో ఇలా అనిపిస్తుంది..."అసలెందుకు తీస్తారో తెలీదండి ఇలాంటి సినిమాలు. ఎవరండీ తీసింది. ఏం చేస్తారండి వీళ్లు. బతకాలనే ఓర్పు, ఉత్సాహం సర్వ నాశనమైపోతాయి. సినిమా అన్నాక సెన్సు, కామన్ సెన్సు ఉంటాయి కదండి. వాటిని వాడరా? అంటేనేమో అందరికీ కోపమొస్తుంది. అందరూ హర్టైపోతారు.."

ఇంటర్వల్ వరకు ఇదే ఫీలింగ్.కుదిరితే పారిపోవచ్చు. కానీ సమీక్షకులుగా ఉద్యోగాలు చేసేవారికి తప్పదు కనుక "తగలపెట్టండి సర్ ప్రొజెక్టర్ గారూ!" అంటూ ఏడుస్తూ సెకండాఫ్ కూడా చూడాలి.

కథ క్లైమాక్స్ కి వచ్చే సరికి, "నాకు ఇంటరెస్ట్ పోయింది. ఇక నేను సినిమాలు చూడను. నేను చూస్తే ఎంత చూడకపోతే ఎంత. ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తే నా వల్ల కాదు" అని మనసులోనే అరుచుకుంటూ మొహం చిట్లించి కోపంగా ఎగ్జిట్ డోర్ వైపుకి వెళ్లిపోవాలనిపిస్తుంది.

బాటం లైన్: చిరాకు అంకుల్స్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?