Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: శివమ్‌

సినిమా రివ్యూ: శివమ్‌

రివ్యూ: శివమ్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: శ్రీ స్రవంతి మూవీస్‌
తారాగణం: రామ్‌, రాశి ఖన్నా, బ్రహ్మానందం, వినీత్‌ కుమార్‌, అభిమన్యు సింగ్‌, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మనో, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, సప్తగిరి, సురేఖావాణి తదితరులు
మాటలు: కిషోర్‌ తిరుమల
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌కూర్పు: 'కేరింత' మధు
ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌
నిర్మాత: 'స్రవంతి' రవికిషోర్‌
కథ, కథనం, దర్శకత్వం: శ్రీనివాస్‌ రెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్‌ 2, 2015

ట్రెయిలర్స్‌ చూస్తేనే ఇదీ ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అనే సంగతి స్పష్టమైంది. 'శివమ్‌'పై కొత్తగా ఉంటుందనే ప్రత్యేక అంచనాలు కానీ, అద్భుతాలు ఉంటాయని ఆశించి కానీ వెళ్లరెవరూ. సినిమా మొదలైన ఒక ఇరవై నిమిషాల వరకు ఈ చిత్రం ఎలాగుంటుందనే నమ్మకంతో వెళ్లి ఉంటారో అలాగే వినోదాత్మకంగా పరుగులు పెట్టే కథనంతో సాగిపోతుంటుంది. మరో 'ఫన్‌ ఎంటర్‌టైనర్‌' అనే కాన్ఫిడెన్స్‌తో సెటిల్‌ అయ్యేలోగానే 'శివమ్‌' పక్కదారి పడుతుంది. అవసరం లేని సన్నివేశాలని సాగదీస్తూ వినోదం కోసం విఫలయత్నం చేస్తూ.. కంట్రోల్‌ తప్పిందనే సంగతి క్లియర్‌ అయిపోతుంది. ఒక్కసారి హీరోయిన్ని (రాశి ఖన్నా) చూడగానే హీరో (రామ్‌) రైల్లోంచి దూకాడో లేదో.. శివమ్‌ 'ట్రాక్‌' తప్పేస్తుంది. ఆమెని ప్రేమించే వ్యవహారం... దానికోసం ప్రయత్నించే వైనం అనాసక్తంగా మొదలై, కథనం ముందుకి సాగని అవరోధంగా మారి, చివరకు అసహనాన్ని కలిగించి.. ఆపై దాన్ని పెంచుతూ, పాస్‌ కావడానికి కష్టమైన పరీక్షని పెడుతుంది. 

ద్వితీయార్ధంలో అయినా పరిస్థితి మళ్లీ కొత్త దర్శకుడి 'అదుపు'లోకి వస్తుందని ఆశిస్తే.. అలాంటి ఆశలేం పెట్టుకోనక్కర్లేదంటూ సెకండ్‌ హాఫ్‌ మొదలు కావడమే కంగాళీ వ్యవహారంగా తయారవుతుంది. హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడ్డ విలన్‌ (అభిమన్యుసింగ్‌), తన కొడుకుని కొట్టిన హీరోని ఎలాగైనా చంపాలని చూస్తున్న ఇంకో విలన్‌ (వినీత్‌ కుమార్‌).. అసలు కార్యం వదిలేసి కమెడియన్లని చుట్టూ వేసుకుని చేసేదంతా 'కామెడీ' అని దర్శకుడు అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ... ప్రేక్షకులకి మాత్రం అనిపించదు. అదే కామెడీ అనుకుని సీన్ల కొద్దీ టైమ్‌ వేస్ట్‌ చేయడం వల్ల 'అసలు కథ' క్లయిమాక్స్‌కి కానీ వెలుగు చూడదు. సదరు హీరోకి ప్రేమికుల్ని కలిపే మహత్తర ఆశయం ఉండడానికి వెనక ఓ బలమైన కారణముంటుంది. అది బలంగా ఉందా, బాగుందా అనేది పక్కనపెడితే.. ఆ కథేంటనేది తెలిసే సరికే మనం బలహీనమైపోతాం. నచ్చిందా, నొప్పించిందా, హింసించిందా... అన్నది వదిలేస్తే మొత్తానికి సినిమా అయిపోతోంది అనగా హీరో గతం రింగులు తిరిగే సరికి బుర్ర గింగిరాలు తిరిగిపోతుంది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అప్పుడే ఉదయించినట్టు, ఎంతోకాలం నుంచి వెతుకుతున్న అవకాశం ఇప్పుడే దొరికినట్టు, మొత్తం తన టాలెంట్‌ అంతా ఇదే సినిమాలో చూపించేద్దామన్నట్టు సినిమాని అనంతంగా సాగదీసిన శ్రీనివాస్‌ రెడ్డి ఇక ఆపకపోతే బాగోదన్నట్టు 'దూల తీరిపోద్ది' అంటూ శుభం కార్డు వేశాడు. ఆ ట్యాగ్‌ చూసి 'వాట్‌ ఏన్‌ ఐరనీ' అనుకోవడం తప్ప ఏం చేయలేం. 

'ఎనర్జిటిక్‌ స్టార్‌' అనే పేరుకి న్యాయం చేసేలా రామ్‌ తన వరకు ఎక్కడా ఎనర్జీ లెవల్స్‌ డ్రాప్‌ అవకుండా నటించాడు. కథనం నీరసంగా సాగుతున్నా, సినిమానే నిస్సారంగా మారినా అతని ఎనర్జీనే కొంతవరకు మనల్నీ కొంత సమయం 'నిలబెడుతుంది'. 'లైటర్‌ ఫైట్‌'లో రామ్‌ చూపించిన ఆటిట్యూడ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ టూ గుడ్‌ అనిపిస్తాయి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే.. దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ సీన్‌ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. సూపర్‌స్టార్స్‌లో ఎవరికి ఈ సీన్‌ పడినా కానీ థియేటర్లలో రచ్చ పీక్స్‌లో ఉంటుంది. ఆ సీన్‌ తర్వాతే కొత్త దర్శకుడిపై కాన్ఫిడెన్స్‌ పెరిగి, శివమ్‌పై ఎక్స్‌పెక్టేషన్లూ రైజ్‌ అవుతాయి. కానీ ఇమ్మీడియట్‌గా అతని పట్టు తప్పుతుంది, సినిమా పట్టాలు తప్పుతుంది. ఇకపోతే రాశి ఖన్నా చాలా సీన్స్‌లో క్లూలెస్‌గా కనిపించింది. కేవలం క్యూట్‌ ఫేస్‌తో ఆకట్టుకోవాలనే ప్రయత్నమే తప్ప నటిద్దామనే ఎటెంప్ట్‌ ఎక్కడా కనిపించదు. వినీత్‌ కుమార్‌ని ఎందుకని పెడుతుంటారో కానీ మరోసారి తన ఓవరాక్షన్‌తో ఇబ్బంది పెట్టాడు. అభిమన్యుసింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌లెస్‌ విలనీ కూడా సినిమాకి ఏ విధంగాను అక్కరకు రాలేదు. బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి లాంటి సీజనల్‌ కమెడియన్లకి సరైన క్యారెక్టర్స్‌ ఇవ్వలేదు. ఫిష్‌ వెంకట్‌, ప్రభాస్‌ శ్రీను ఒకింత ఫర్వాలేదు. 

దేవిశ్రీప్రసాద్‌ పాటలన్నీ తను ఇంతకుముందు చేసిన బాణీలనే గుర్తు చేస్తాయి. నేపథ్య సంగీతం కూడా అంతగా మెప్పించదు. రసూల్‌ సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంటుంది. టెక్నికల్‌గా కెమెరా వర్క్‌ ఒక్కటే ప్లస్‌ అనిపిస్తుంది. ఖర్చు పరంగా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఒక బ్యాంకబుల్‌ హీరో, కాంప్రమైజ్‌ కాని ప్రొడ్యూసర్‌, బిగ్‌ నేమ్‌ టెక్నీషియన్స్‌, అద్దిరిపోయే ప్యాడింగ్‌... కొత్త దర్శకుడికి ఇంతకంటే కావాల్సిందంటూ ఏదీ ఉండదు. ఇలాంటి అవకాశం కోసమే ఎంతోమంది యువ దర్శకులు ఎదురు చూస్తుంటారు. శ్రీనివాస్‌రెడ్డికి అంతటి సువర్ణావకాశం దక్కినా కానీ అతను దానిని వినియోగించుకోలేక పోయాడు. కమర్షియల్‌గా పే చేసే సినిమా చేద్దామని అనుకున్నాడే తప్ప దర్శకుడిగా తన ముద్ర వేయడానికి ట్రై చేయలేదు. ఏం చేసి అయినా నవ్వించాలనే ప్రయత్నంలో భాగంగా ఏం తీస్తున్నాడో కూడా తెలీని అయోమయంలో పడేశాడు. 

ఈమధ్య కాలంలో వచ్చిన 'చెప్పుకోతగ్గ' సినిమాల్లో ఈ స్థాయిలో విసిగించిన చిత్రమేదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రథమార్ధం భారంగా నెట్టగలిగినా కానీ ద్వితీయార్ధాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. రామ్‌ ఒళ్లు దాచుకోకుండా కష్టపడినా కానీ, ఇంత నీరసమైన కథ, కథనాల్ని కాపాడ్డానికి అతనొక్కడి ఎనర్జీ సరిపోదు. 

బోటమ్‌ లైన్‌: సహనానికి పబ్లిక్‌ ఎగ్జామ్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?