cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: డిస్కో రాజా

సినిమా రివ్యూ: డిస్కో రాజా

సమీక్ష: డిస్కో రాజా
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: రవితేజ, బాబీ సింహా, సునీల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్‌, వెన్నెల కిషోర్‌, గిరిబాబు, నరేష్‌, సత్య, అన్నపూర్ణ తదితరులు
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: శ్రవణ్‌ కటికనేని
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాత: రజని తాళ్ళూరి
కథ, కథనం, దర్శకత్వం: విఐ ఆనంద్‌
విడుదల తేదీ: జనవరి 24, 2020

'ప్లే' నొక్కగానే 'రీవైండ్‌' చేసుకుని 'డిస్కోరాజా' స్టోరీ తెలుసుకోవాలనే కుతూహలం కలిగినా కానీ, రీవైండ్‌ చేసిన కాసేపటికే త్వరగా ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చేసేసి 'స్టాప్‌' బటన్‌ నొక్కేయాలనేంత విసిగిస్తూ, గందరగోళానికి గురి చేస్తూ సాగుతుందీ చిత్రం.

విఐ ఆనంద్‌కి వచ్చిన 'ఆలోచన' కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా చేసేయాలనేంతగా రవితేజ ఇంప్రెస్‌ అయ్యాడంటే ఆ ఐడియాలో నిజంగానే అంత విషయం వుంది. కానీ ఆ ఐడియాని ఒక కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కొత్తదనం కిల్‌ అయిపోయి, రొటీన్‌ రవితేజిజమ్‌తో నిండిపోయింది.

ముప్పయ్‌ అయిదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ తిరిగి బతికి వస్తే ఎలాగుంటుంది? అనే ఐడియాలో ఒక ప్రామిసింగ్‌ సినిమా వుంది. కానీ ఆ ఐడియాని ఏ విధంగా మలచాలనే విషయంలో దర్శకుడికి కన్‌ఫ్యూజన్‌ ఎదురయింది. ఆ పాత్రని సగటు రవితేజ మార్కు ఎంటర్‌టైనర్‌గా మార్చాలనే తపన అవసరం లేని డిస్కో యాంగిల్‌ని జోడించేట్టు చేసింది. ఆరంభంలో ఆసక్తి కలిగించిన ఐడియానే తర్వాత ఆవిరైపోయి రెగ్యులర్‌ మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పడి మూస సినిమాగా మిగిలిపోయింది.

చాప్టర్ల వారీగా డిస్కో రాజా కథని చెప్పడానికి చేసిన ప్రయత్నంలో కొత్తదనం కోసం పడిన తపన కనిపించింది కానీ ఆ చాప్టర్లలో ఒక్క ఇంట్రెస్టింగ్‌ పేజీ అయినా లేకపోవడంతో అసలు ఈ కథని రీవైండ్‌ చేయకుండా, ముప్పయ్‌ అయిదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన పాత్ర ఇప్పటి టెక్నాలజీ వగైరా విశేషాలకి ఎలా రియాక్ట్‌ అయిందనే అంశాలపై ఫోకస్‌తో 'ప్లే' కొట్టేసి వుండాల్సింది అనిపిస్తుంది.

కేవలం గెటప్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ కాకుండా డిస్కో రాజా తాలూకు ఎనభైల కాలం నాటి కథలో ఎలాంటి ఆకర్షణీయమైన అంశం వుండదు. హీరో, విలన్‌ మధ్య బలమైన కాన్‌ఫ్లిక్ట్‌ వుండదు. చాలా సింపుల్‌గా విలన్‌ జైలు పాలు అయిపోవడంతో డిస్కో రాజా లైఫ్‌లోని లవ్‌ చాప్టర్‌ చూపిస్తారు. మూగమ్మాయితో నడిపే ప్రేమాయణం చాలా సాదాసీదాగా అనిపిస్తుందే తప్ప ఎటువంటి ఆసక్తి కలిగించదు. తదుపరి ఏమి జరుగుతుందనేది అంతా తెలిసిపోతూ వున్న కథలో వచ్చే చివరి మలుపు కూడా కొత్తగా అనిపించదు. కాకపోతే ఆ ట్విస్టు ఇచ్చే క్యారెక్టర్‌ పోషించిన నటుడు కాస్త సర్‌ప్రైజ్‌ చేయవచ్చు. కానీ ఆ ట్విస్ట్‌ కూడా ఏదో చిన్న సర్‌ప్రైజ్‌ వుండాలంటూ చేసిన లాస్ట్‌ మినిట్‌ అడ్జస్ట్‌మెంట్‌లా వుంటుందే తప్ప అది పండడానికి కావాల్సిన ఎస్టాబ్లిష్‌మెంట్‌ వుండదు.

రవితేజ తన శాయశక్తులా కృషి చేసి ఈ డిస్కో రాజా పాత్రని ప్రత్యేకంగా నిలబెట్టే ప్రయత్నం చేసాడు కానీ ఆ వాక్‌మేన్‌లో మ్యూజిక్‌ వినడం మినహా ఆ పాత్రలో ఎలాంటి ప్రత్యేకతలు కనిపించవు. బాబీ సింహా మంచి నటుడయినా కానీ అతడి టాలెంట్‌ని పూర్తిగా వినియోగించుకోలేదు. సునీల్‌ హీరో వేషాలు కట్టిపెట్టాక కాస్త గుర్తుంచుకునే పాత్ర ఇందులో చేసాడు. పాయల్‌ రాజ్‌పుత్‌ నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ మిగతా హీరోయిన్లతో పోలిస్తే తనకి దక్కిన క్యారెక్టర్‌ నయం. నభా నటేష్‌ది చాలా లిమిటెడ్‌ స్క్రీన్‌ టైమ్‌ వున్న క్యారెక్టర్‌. రఘుబాబు ముప్పయ్యేళ్ల తర్వాత గిరిబాబు అవడం నైస్‌ టచ్‌. వెన్నెల కిషోర్‌ కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్‌ అయింది. నరేష్‌ క్యారెక్టర్‌ ఏదో వుంటుందనేలా మొదలై తర్వాత తుస్సుమంటుంది.

సాంకేతికంగా ఉన్నతంగా రూపొందిన ఈ చిత్రానికి ఆ రెట్రో లుక్‌ రావడంలో సంగీత దర్శకుడు తమన్‌, ఛాయాగ్రాహకుడు కార్తీక్‌తో పాటు ప్రొడక్షన్‌ డిజైన్‌ టీమ్‌ రోల్‌ చాలా వుంది. ముఖ్యంగా టైటిల్‌లోని డిస్కో ఎలిమెంట్‌ని సీరియస్‌గా తీసుకుని చక్కని నేపథ్య సంగీతంతో పాటు ఎనభైల కాలం నాటి ఇళయరాజా సంగీతాన్ని తలపించే పాటలతో తమన్‌ ఈ చిత్రానికి లైఫ్‌లైన్‌ అయ్యాడు. లఢాక్‌లో తొలి సన్నివేశం దగ్గర్నుంచి ప్రతి సీన్‌లో తన సినిమాటోగ్రఫీతో కార్తీక్‌ ఆకట్టుకుంటాడు. స్టయిలింగ్‌ మిస్‌ఫైర్‌ అయినా కానీ ప్రొడక్షన్‌ డిజైన్‌ బాగా కుదిరింది. సంభాషణల్లో పస లేదు. ఎడిటింగ్‌లో స్పీడ్‌ లేదు. నిర్మాతలు మాత్రం ఈ చిత్రంపై భారీగా ఖర్చు పెట్టారు.

షాట్‌ మేకింగ్‌తో, స్టయిలిష్‌ టేకింగ్‌తో విఐ ఆనంద్‌ మేకర్‌గా ఇంప్రెస్‌ చేసినా కానీ ఆకట్టుకునేలా ఈ కథని నడిపించడంలో అటు రైటర్‌గా, ఇటు డైరెక్టర్‌గా విఫలమయ్యాడు. ఈ కథని ఎలా డీల్‌ చేస్తే మాగ్జిమం ఇంపాక్ట్‌ వుంటుందనే విషయాన్ని అంచనా వేయలేకపోయాడు. చాలా మంది దర్శకుల మాదిరిగానే ఈ కథని రవితేజ స్టయిల్లో చెప్పాలనే అటెంప్ట్‌లో ఒక హాఫ్‌ బేక్డ్‌ ప్రోడక్ట్‌గా దీనిని మలిచాడు.

సైన్స్‌ ఫిక్షన్‌, పీరియడ్‌ బ్యాక్‌డ్రాప్‌, గ్యాంగ్‌స్టర్‌ సెటప్‌, మ్యూజికల్‌ టచ్‌, కామెడీ, యాక్షన్‌, మిస్టరీ ఇలా చాలా ఎలిమెంట్స్‌ని మిక్స్‌ చేసేయాలని చూడడం వల్ల దేనికి ఇంపార్టెన్స్‌ ఇవ్వాలనే దానిపై కన్‌ఫ్యూజన్‌ నెలకొంది. ఆ గందరగోళం చాలా సందర్భాల్లో హైలైట్‌ అవుతూ ఈ డిస్కోరాజా క్యాసెట్‌కి స్టాప్‌ బటన్‌ ఎక్కడుందో తెలిస్తే నొక్కేయాలన్నంత విసుగు వచ్చేస్తుంది. ప్రథమార్ధంలో విషయం లేకపోయినా కానీ మిస్టరీ ఎలిమెంట్‌ ఇంట్రెస్ట్‌ని హోల్డ్‌ చేసి పెడుతుంది. ఇంటర్వెల్‌కి స్టోరీ ఇంట్రెస్టింగ్‌ టర్న్‌ తీసుకుంటుంది. కానీ ఒక్కసారి గతంలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఏమి చేయాలనే గందరగోళం మొత్తం మూడ్‌ చెడగొట్టేస్తుంది. చివర్లో ట్విస్టులతో తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం జరిగినా కానీ అదేమంత అనూహ్యమైనది కాకపోవడంతో దానికి చచ్చిపోయిన ఇంట్రెస్ట్‌ని తిరిగి బతికించేంత శక్తి లేకపోయింది.

ఐడియా అనేది ఎంత ఎక్సయిటింగ్‌గా అనిపించినా కానీ అది లార్వా స్టేజ్‌నుంచి బటర్‌ ఫ్లయ్‌గా రూపాంతరం చెంది రెక్కలిప్పుకుని ఎగిరినపుడే దాని అందం తెలిసేది. ఓ ఐడియా క్యాటర్‌పిల్లర్‌ దశలోనే ఆగిపోతే అది ఆకుల్ని తినేసినట్టు ఇది కరన్సీని హరించేస్తుంది. ఒక సక్సెస్‌తో మళ్లీ మునుపటి వైభవాన్ని రీప్లే చేయాలని ఆశ పడిన రవితేజకి మరో హాఫ్‌ బేక్డ్‌ ఐడియా అడ్డంపడి కొన్నాళ్లకుండా ముందుకెళ్లనివ్వకుండా ఆపేసిన 'పాజ్‌'ని కంటిన్యూ చేసినట్టయింది.

బాటమ్‌ లైన్‌: మిక్సీ రాజా!

గణేష్‌ రావూరి

 


×