Advertisement

Advertisement


Home > Movies - Reviews

Pindam Review: మూవీ రివ్యూ: పిండం

Pindam Review: మూవీ రివ్యూ: పిండం

చిత్రం: పిండం
రేటింగ్: 2.5/5
తారాగణం:
శ్రీరాం, కుషి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, లీష సూరంపూడి, చైత్ర పెద్ది తదితరులు
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
కెమెరా: సతీష్ మనోహరన్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్ డిజైన్: పద్మ ప్రియ. పి
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
దర్శకుడు: సాయికిరణ్ దైదా 
విడుదల: 15 డిసెంబర్ 2023

ఈ మధ్యన హారర్ సినిమాలకి ప్రేక్షకాదరణ దక్కుతోంది. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా ఈ జానర్ చిత్రాలు చూడడానికి యువ ప్రేక్షకులు ఇష్టం చూపుతున్నారు. ఆ మధ్యన "మసూద", ఈ మధ్యన "మా ఊరి పొలిమేర", "మంగళవారం" చిత్రాలకి ఆడియన్స్ అటెన్షన్ లభించడమే దీనిని నిదర్శనం. ఇప్పుడు అదే కోవలో ఈ "పిండం" వచ్చింది. 

ఈ చిత్రం అసలు కథ అన్నమ్మ (ఈశ్వరీ రావు) అనే ఒక తాంత్రిక నిపుణురాలు 1990 లో తనకు జరిగిన ఒక అనుభవం గురించి లోకనాథ్ (శ్రీనివాస్ అవసరాల) అనే ఒక పరిశోధకుడికి చెప్పడంతో మొదలవుతుంది. 1990లో సుక్లపేట్ అనే ఒక మారుమూల ప్రాంతం. అక్కడొక పాత ఇల్లు. దానిని ఒక క్రైస్తవ కుటుంబం కొంటుంది. ఆ కొన్న వ్యక్తి ఆంటోనీ (శ్రీరాం) తన భార్య (కుషి), తల్లి మరియు ఇద్దరు ఆడపిల్లలతో ఉంటాడు.

ఇంట్లోకి చేరిన తొలి రోజు నుంచే కొన్ని వింత అనుభవాలు, భయాలు ఆ కుటుంబసభ్యులని చుట్టు ముడతాయి. ఆ ఇంటిని కొన్ని ప్రేతాత్మలు ఆవరించుకుని ఉంటాయి. ఏవిటా ఆత్మలు? దీంట్లో అన్నమ్మ పాత్ర ఏమిటి? చివరికి ఏమౌతుంది? ఇదే కథ. 

ఇలాంటి హాంటెడ్ హౌసెస్ కథలు చాలా వచ్చాయి. పలు భాషల్లో కోకొల్లలుగా చూస్తూనే ఉన్నాం. అయినా అధికశాతం హారర్ చిత్రాల్లో ప్రధానంగా ఉండేది ఈ ఎలిమెంటే. ఆర్జీవీ తీసిన "భూత్", "వాస్తు శాస్త్ర" లాంటి సినిమాలు, పలుభాషల్లో తీయబడిన "చంద్రముఖి" ఈ జానర్లో ఉండనే ఉన్నాయి. అయినప్పటికీ కథాంశం, కథా గమనం, హారర్ పాళ్లుని బట్టి కొన్ని సినిమాలు భయానకరసాన్ని పిండుతాయి. ఆ కోవలో ఉన్న చిత్రమే ఈ "పిండం". 

ఈ చిత్రానికి ప్రధానమైన ఆయువుపట్టు కృష్ణ సౌరభ్ సూరంపల్లి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఆద్యంతం భయపెట్టింది. సడెన్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా గగుర్పాటు కలిగిస్తాయి. పాటల ద్వారా పెద్ద ఎఫెక్ట్ లేకపోయినా నేపథ్య సంగీతం మాత్రం సినిమాని నిలబెట్టింది. 

ఆ తర్వాత కెమెరా వర్క్. ఎలాంటి లైటింగులో సెటప్ చేస్తే హారర్ ని పండించవచ్చో తెలిసిన కెమెరామన్ దొరకడం దర్శకుడికి కలిసొచ్చిన విషయం. ఈ ఇద్దరూ టెక్నీషియన్స్ కథకి వెన్నెముక అయితే అన్నమ్మ పాత్రకి ఈశ్వరీ రావు పర్ఫెక్ట్ చాయిస్ అనిపిస్తుంది. ఆమె వాయిస్ కూడా తాంత్రికురాలి పాత్రకి సరిపోయింది. 

ప్రధానంగా బాలనటి చైత్రని మెచ్చుకోవాలి. మూగ నటన మాత్రమే కాకుండా భయాన్ని, అమాయకత్వాన్ని, ప్రేతాత్మ ఆవహించినప్పుడు అందించాల్సిన అభినయం కానీ తగుపాళ్లల్లో ఇచ్చింది. మరొక బాలనటి లీష కూడా ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్ గా నటించి మెప్పించింది. 

హీరో శ్రీరాం, భార్యగా నటించిన కుషి తమ పాత్రలకు న్యాయం చేసారు. సర్ప్రైజ్ పాత్రలో రవివర్మ సరిగ్గా సరిపోయాడు. 

మంచి విషయాలు ఎన్ని చెప్పుకున్నా ఇందులో మైనస్సులు లేకపోలేదు. కథ బాగానే ఉన్నా కథనం అక్కడక్కడే నడుస్తున్నట్టు ముందుకు వెళ్లనట్టు అనిపిస్తుంటుంది. కొన్ని సీన్స్ మరీ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఆ సీన్స్ గురించి ఇక్కడ చెబితే సస్పెన్స్ పాయింట్స్ లీక్ చెసినట్టు అవుతుంది కనుక చెప్పడం లేదు. 

కొన్ని సీన్స్ లో ఆర్టిస్ట్స్ రియాక్షన్, రెస్పాన్స్, ఎక్స్ప్రెషన్ నాన్ సింక్ లో ఉన్నట్టు అనిపిస్తాయి. కొన్ని మరీ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. నానా మతాలని తీసుకొచ్చి ఒక చోట పెట్టాలన్న ఆలోచన కూడా అవసరం లేదనిపిస్తుంది.  అలాగా ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరీ హింసాత్మకంగా, హృదయవిదారకంగా ఉంది. 

ఇలాంటి కొన్ని చిన్న చిన్న విమర్శనాత్మక అంశాలు మినహాయిస్తే ఇది శ్రద్ధగా తీసిన హారర్ చిత్రమే. తొలిప్రయత్నమే అయినా దర్శకుడు తన ప్రతిభని చూపించాడనే చెప్పాలి. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్లని పెద్దగా నిరాశపరచదు. రొటీన్ టెంప్లేట్ లోనే తీసిన చూస్తున్నప్పుడు బోర్ కొట్టదు. ఉన్న పరిధిలో ఎక్కడా రాజీ పడకుండా తీసిన ఈ "పిండం" కంటెంట్ పరంగా గట్టి పిండమే.

బాటం లైన్: గట్టి పిండం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?