cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

'రాధే' రివ్యూ

'రాధే' రివ్యూ

చిత్రం: రాధే
రేటింగ్: 1.5/5
నటీనటులు: సల్మాన్ ఖాన్, దిశా పటాని, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్, భరత్, నర్రా శ్రీనివాస్, సుధాన్షు పాండే, గోవింద్ నామదేవ్, రణదీప్ హూడా తదితరులు.
సంగీతం: సాజిద్-వాజిద్, దేవీశ్రీప్రసాద్, హిమేష్ రెషమియా
కెమెరా: అయనాంక బోస్
ఎడిటర్: రితేష్ సోని
నిర్మాతలు: సల్మాన్ ఖాన్, సొహైల్ ఖాన్
దర్శకత్వం: ప్రభుదేవా
విడుదల తేదీ: మే 13, 2021
స్ట్రీమింగ్: జీ5, జీప్లెక్స్

ప్రేక్షకుడి మైండ్ సెట్ ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. సినిమా హాల్లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య కూర్చుని హై వాల్యూం లో చూస్తున్నప్పుడు హీరో గారి పంచ్ డయలాగ్స్ కి విజిలెయ్యాలినిపిస్తుంది...విజిలెయ్యడం రాకపోయినా విజిల్స్ వేస్తున్నవాళ్లని చూసి హీరో కొట్టిన పంచ్ డయలాగ్ లో చాలా డెప్త్ ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్ ని వాడకుండా మ్యాజిక్ ని ఎంజాయ్ చేసే వాతావరణాన్ని తెర మీద సినిమా కంటే హల్లో చుట్టూ ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ కలిపిస్తారు.

కానీ ఓటీటీలో చూస్తున్నప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకుడు ఏకాంతంగానో, మహా అయితే కుటుంబ సభ్యులతోనో ఉంటాడు. విజిల్స్ కొట్టే ఫ్యాన్స్, హై వాల్యూం సౌండ్ ఉండవు. అలాంటి వాతావరణంలో మ్యాజిక్ కంటే లాజిక్ ఎక్కువ పని చేస్తుంది. హీరో కొట్టే పంచ్ డయలాగ్ కూడా పేలవంగానో, కృతకంగానో వినిపిస్తుంది.

"నేనొక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను"- ఇది ఒక సినిమాలో మహేష్ బాబు డయలాగ్.

యాజిటీజ్ గా "ఏక్ బార్ జో మైనే కమిట్ మెంట్ కర్ ది, ఉస్కె బాద్ తో మై అప్నే ఆప్ కో భి నహీ సుంతా" అంటూ సల్మాన్ ఖాన్ చెప్పిన డయాలగ్ కి ఎటువంటి ఫీలింగు రాదు. కారణం మనం చూసేది ఓటీటీలో.

ఉపోద్ఘాతం నుంచి అసలు విషయనికొస్తే..

నగరంలో డ్రగ్స్ బారిన పడి హై స్కూల్ విద్యార్థులు చనిపోతూ ఉంటారు. కొందరు మానసికంగా కృంగిపోతుంటారు. ఈ ర్యాకెట్ వెనుకున్న సూత్రధారుల్ని పట్టుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. రాణా (రణదీప్ హూడా) అనే అతి కౄరమైన క్రిమినల్ ఈ డ్రగ్స్ దందా కి కింగ్ పిన్. సాధారణ పోలీసుల వల్ల సాధ్యం కావట్లేదని ఒక స్పెషల్ పోలీస్ కి వ్యవహారం అప్పజెప్తారు. అతనే రాధే (సల్మాన్ ఖాన్).

ఆ తర్వాత కథేమిటని అడగక్కర్లేదు. ఈ టైప్ కథ ఇక్కడి నుంచి ఎలా వెళ్తుందో ఆరో క్లాసు పిల్లాడు కూడా చెప్పేస్తాడు.

హీరో గారి గ్రాండ్ ఎంట్రీ- ఎంట్రీ తోనే ఒక యాక్షన్ ఎపిసోడ్- ఆ వెంటనే హీరోయిన్ ఎంట్రీ- వెనువెంటనే హీరో గారితో ఆమెకి రొమాన్స్ - మధ్యలో పాటలు- డ్రగ్స్ దందాగాళ్ళతో ఫైట్స్- చివరికి గ్రాండ్ ఫైట్ లో మెయిన్ విలన్ చావు తో రోలింగ్ టైటిల్స్.

టూకీగా చెప్పాలంటే "రాధే" కథ ఇంతే. ఎన్ని సార్లు రోట్లో దంచి కొట్టిన కథో ఇది..ఈ ఫార్ములాతో ఎన్ని సినిమాలు వచ్చాయో పాపం వెండి తెర కూడా లెక్కేసి చెప్పలేదు.

ఈ పాతచింతకాయ కథకి కొరియా నుంచి ఫైట్ మాస్టర్ ని మాత్రం దింపారు. హెవీ స్టంట్స్ ఎంత బాగా తీసినా, గ్రాఫిక్స్ ఏ రేంజులో వాడినా ప్రధాన కథలో కట్టి పారేసే విషయం లేనప్పుడు ఉపయోగం ఏముంటుంది.

ఓటీటీ యుగంలో ప్రేక్షకుల అవుట్ లుక్ మారింది. రొట్టకొట్టుడు సినిమాలు కాకుండా కొత్తగా అనిపించే వెరైటీ సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. భాషాబేధం లేకుండా ఎక్కడ మంచి సినిమా ఉన్నా ఒక్క క్లిక్కులో చూసేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయమేంటంటే, ఆన్లైన్లో టికెట్ కొని చూసే ఏర్పాటుతో రిలీజైన అతి భారీ బడ్జెట్ సినిమా ఇది. పోయినేడు ఆర్జీవీ ఈ పద్ధతిలో కొన్ని లో-బద్జెట్ సినిమాలు తీసి టికెట్ పెట్టి చూపించారు. అదే పద్ధతిని ఇంత హై బడ్జెట్ సినిమా ఫాలో అయిందంటే రిస్కే అని చెప్పాలి. కానీ గత్యంతరం లేదు కనుక ఈ పంథా తొక్కారు.

ఇందులో తెలుగు వాళ్ళు చెప్పుకోదగ్గ విషయమేంటంటే "అత్తారింటికి దారేది" ఫేం నర్రా శ్రీనివాస్ కి సల్మాన్ ఖాన్ తోటి, హీరోయిన్ దిషా పటానితోటి నటించే అవకాశం కలిగింది. రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు.

అలాగే మేఘా ఆకాష్ కూడా సల్మాన్ పక్కన ఒక పోలీస్ ఉద్యోగినిగా కనిపించింది. అలాగే "ప్రేమిస్తే" భరత్ కూడా కొన్ని ఫ్రేంస్ లో కనిపించాడు.

యాక్షన్ హీరోగా సల్మాన్ లుక్, ఫైట్స్ బాగున్నాయి. సీటీమార్ పాటా కూదా బాగుంది. అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేమీ లెని సినిమా ఇది. హీరోయిన్ ట్రాక్ కథకి అవసరమే లేదు. హీరోయిన్ అన్నయ్యగా నటించిన జాకీ ష్రాఫ్ కూడా అంతే. ప్రభుదేవా దర్శకత్వ ప్రతిభ 15 ఏళ్లు వెనకబడిందేమో అనిపిస్తుంది ఈ చిత్రం చూస్తే.

చాలా పేలవమైన రచన, ఫార్ములా సీన్స్, పాత సినిమాల వాసన కొట్టే కథా గమన..వెరసి "రాధే" పెద్ద "బాధే" అనిపిస్తుంది.

బాటం లైన్: బాధే

గడ్డం పెంచగానే మాస్ లీడర్ అయిపోవు లోకేష్

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×