Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఆగడు

సినిమా రివ్యూ: ఆగడు

రివ్యూ: ఆగడు
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
తారాగణం: మహేష్‌, తమన్నా, రాజేంద్రప్రసాద్‌, నాజర్‌, సోనూ సూద్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, ఎమ్మెస్‌ నారాయణ, పోసాని కృష్ణమురళి, రఘుబాబు తదితరులు
సంగీతం: థమన్‌
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
నృత్యాలు: ప్రేమ్‌ రక్షిత్‌
పోరాటాలు: విజయ్‌
కళ: ఎ.ఎస్‌. ప్రకాష్‌
ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీనాథ్‌ ఆచంట, అనిల్‌ సుంకర
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శ్రీను వైట్ల
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 19, 2014

‘దూకుడు’ ఇచ్చిన కాంబినేషన్‌ నుంచి ‘ఆగడు’ వస్తుందంటేనే హైప్‌ స్కై లెవల్‌లో ఉంది. ఇక టీజర్‌కో పంచ్‌ డైలాగ్‌ విసురుతూ.. ప్రతి పోస్టర్‌తోను ఫాన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ.. రిలీజ్‌కి రెడీ అయ్యేనాటికి ‘ఆగడు’పై అంచనాలు అంబరాన్ని దాటిపోయాయి. ఇంత హైప్‌తో వచ్చే సినిమాతో థియేటర్ల వరకు జనాన్ని రాబట్టడంలో విశేషం ఏమీ ఉండదు. వచ్చిన వారిలో ఎక్కువమందిని శాటిస్‌ఫై చేసి పంపించడమే అసలైన ట్రిక్కు. 

కథేంటి?

పుడింగుల్లాంటి విలన్లకి కూడా మొగుడిలాంటి పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ శంకర్‌ (మహేష్‌). కొత్తగా ట్రాన్స్‌ఫరై వచ్చిన ఊరిలో దామోదర్‌ (సోనూసూద్‌) అనే వాడు చాలా అక్రమాలు చేస్తున్నాడని తెలుసుకుని... ముందుగా వాడి తోకలన్నీ కత్తిరించేసి... తర్వాత అసలు వాడిని టార్గెట్‌ చేస్తాడు. దామోదర్‌ కారణంగా తన కుటుంబానికి కూడా నష్టం జరిగిందని తెలియడంతో అతనికి బుద్ధి రావడానికి శంకర్‌ ఒక స్కెచ్‌ వేస్తాడు. 

కళాకారుల పనితీరు:

మహేష్‌బాబుని ఈ చిత్రంలో నూటికి నూరు శాతం వాడుకున్నానని శ్రీను వైట్ల చెబుతూ వచ్చాడు. అతను ఆ మాట ఎందుకన్నాడనేది ఈ చిత్రంలో మహేష్‌ కనిపించే ప్రతి ఫ్రేమ్‌లోను తెలుస్తుంది. వివిధ మాండలికాల్లో మాట్లాడ్డం దగ్గర్నుంచి, అన్ని క్యారెక్టర్లపై పంచ్‌లు విసరడం దగ్గర్నుంచి, తన హిట్‌ సినిమాల కథల్ని పిట్ట కథల్లా అనర్గళంగా చెప్పేసి రౌడీలని బోల్తా కొట్టించడం దగ్గర్నుంచి, తీన్‌మార్‌ డాన్సులు చేయడం దగ్గర్నుంచి, సినిమావాళ్లపై.. సినిమాలపై సెటైర్లు వేయడం దగ్గర్నుంచి... తను చేయనిదంటూ లేదిందులో. ఫాన్స్‌కైతే ఐ ఫీస్ట్‌ అనుకునే లెవల్లో మహేష్‌ చెలరేగిపోయాడు. 

తమన్నాకి పెద్దగా సీన్‌ ఇవ్వలేదు. హీరోయిన్‌తో కంటే కమెడియన్స్‌, విలన్స్‌తోనే హీరోకి ఎక్కువ కెమిస్ట్రీ ఉంటుంది. ఆమె నటించడానికేమీ లేదు... మేకప్‌ అయితే అస్సలు బాలేదు. శృతిహాసన్‌ ఒకే ఒక్క సాంగ్‌ చేసిన హీరోయిన్‌ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. రాజేంద్రప్రసాద్‌ చేయాల్సిన క్యారెక్టర్‌ నాజర్‌కి, నాజర్‌దేమో రాజేంద్రప్రసాద్‌కి ఇచ్చి కొత్తగా ట్రై చేసినట్టున్నారు. కానీ ఎవరికి సూట్‌ అయ్యే క్యారెక్టర్లు వారికి ఇచ్చేసి ఉంటే ఇద్దరి పర్‌ఫార్మెన్స్‌ మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. సోనూ సూద్‌ని కార్టూన్‌ విలన్‌ని చేసారు. హీరో రేంజ్‌ పెరగడానికి అంతే పవర్‌ఫుల్‌ విలన్‌ ఉండాలనేది ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కాదు. బ్రహ్మానందం తనకి అలవాటైన బకరా పాత్ర చేసాడు. శ్రీను వైట్ల తీర్చిదిద్దిన గత పాత్రలతో పోలిస్తే ఇది తేలిపోతుంది కానీ అక్కడికీ బ్రహ్మానందం తన అనుభవంతో అప్పుడప్పుడూ నవ్వించగలిగాడు. ఎమ్మెస్‌ నారాయణ క్యారెక్టరైజేషన్‌ ఫన్నీగా ఉంది. వెన్నెల కిషోర్‌, పోసాని తదితరులు సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

ఒక్క సినిమాకి మూడు చిత్రాలకి సరిపడా సంభాషణలు రాసేసారు. దీని వల్ల డైలాగులు బాగున్నా కానీ వాటిని రిజిష్టర్‌ చేసే టైమ్‌ లేకుండా పోయింది. చాలా డైలాగులు వాయువేగంతో అలా వెళ్లిపోతాయి. మహేష్‌తో అనర్గళంగా మాట్లాడించడం వల్ల అతను పలికే మాటల్లో సగానికి పైగా రిజిష్టర్‌ కావు. ఆజా సరోజ.., టైటిల్‌ సాంగ్‌ సంగీత పరంగా బాగుంటే... ఐటెమ్‌ సాంగ్‌ విజువల్‌గా ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం విషయంలో థమన్‌ మరోసారి ఫెయిలయ్యాడు. కొన్ని సీన్స్‌కి మాత్రమే కాన్సన్‌ట్రేట్‌ చేసి, మిగతా వాటికి ఏదో మమ అనిపించేస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పరంగా కేర్‌ తీసుకుని ఉండాల్సింది. ఓ ఇరవై నిముషాల నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాతలు భారీగానే ఖర్చుపెట్టారు. 

డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఈ చిత్రంతో తన పాత బాణీని మార్చి కొత్త పంథాలో చేసానని చెప్పాడు. అయితే ద్వితీయార్థంలో మళ్లీ తన స్టయిల్‌లోనే ప్లే అంతా నడిపించాడు. ఇప్పటికే ఈ ఫార్మాట్‌ని శ్రీను వైట్లతో పాటు చాలా మంది దర్శకులు వాడేయడంతో దానికి ఆకర్షణ కొరవడింది. సన్నివేశాల పరంగా అయినా కొత్తగా ఉన్నట్టయితే రక్తి కట్టేదేమో కానీ ఆ కొత్తదనం కూడా లోపించడంతో ఫ్లాట్‌గా తయారైంది. శ్రీను వైట్ల రెగ్యులర్‌గా చేసే ప్యారడీలు, టీవీ ప్రోగ్రామ్స్‌పై సెటైర్లు ఇందులోను ఉన్నాయి కానీ... అవి పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడానికి తగిన విధంగా సెటప్‌ లేకపోవడంతో హైలైట్‌ అవ్వాల్సిన సీన్లు కూడా సాదాసీదాగా అనిపించాయి.

హైలైట్స్‌:

  • మహేష్‌ 

డ్రాబ్యాక్స్‌:

  • బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
  • ఫ్లాట్‌ స్క్రీన్‌ప్లే

విశ్లేషణ:

ఆరంభ సన్నివేశాలు చూస్తే ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ అనిపిస్తుంది. టన్నులకొద్దీ హీరోయిజమ్‌ ఉంటుందని, పది నిముషాలకో హీరో ఎలివేషన్‌ సీన్‌తో ఫాన్స్‌కి పూనకాలు తెప్పించేస్తుందనే ఇంప్రెషన్‌ తెస్తుంది. అన్నట్టు ట్రెయిలర్లలో చూపించిన డైలాగుల్లో తొంభై శాతం హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌లోనే ఉండేసరికి... ఇంకా ముందు ముందు ఎంత విందు భోజనం ఉండబోతుందో అనే భావన కలుగుతుంది. అఫ్‌కోర్స్‌.. శ్రీను వైట్ల సినిమాల్లో ట్రేడ్‌ మార్క్‌ కామెడీ ఉంటుందనేది ఎక్స్‌పెక్ట్‌ చేయగలిగినా కానీ ఈ సినిమా వరకు హీరోయిజమ్‌ పరవళ్లు తొక్కుతుందని, మాస్‌ మసాలా నషాళానికి అంటుతుందని అనిపిస్తుంది. బ్యాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన హీరో... ఫస్ట్‌ సాంగ్‌ వేసుకోగానే చల్లబడిపోతాడు. భూకంపనుడు.. విధ్వంసకుడు అంటూ పరిచయమయిన కథానాయకుడు అటుపై ప్రకంపనాలేమీ సృష్టించకుండా సరదాగా జోకులేస్తూ.. రౌడీలని కూడా కామెడీగా డీల్‌ చేస్తుంటాడు. 

కామెడీ ఉన్నా కానీ అదీ నీరసంగా సాగిపోతున్న సమయంలో ‘తమ్ముడూ తుప్పల్లోకెళ్లొద్దు’ అంటూ అల్టిమేట్‌ టైమింగ్‌తో మహేష్‌ వేసే టైమ్‌లీ పంచ్‌లే ఉత్సాహాన్ని తట్టి లేపుతుంటాయి. మెయిన్‌ విలన్‌ ఇంటర్వెల్‌ వరకు ఇనాక్టివ్‌ మోడ్‌లో ఉండడంతో అంతవరకు ఇక హీరోని ఎలివేట్‌ చేసే సీన్‌ లేకుండా పోయింది. మరీ డల్‌గా ఉందనిపించకుండా చేయడానికి మహేష్‌ నూటికి నూటేభై శాతం ఎఫర్ట్స్‌ పెట్టాడు. సుదీర్ఘంగా సాగే ‘మీలో ఎవరు పోటుగాడు’ ఎపిసోడ్‌లో కూడా చెప్పుకోతగ్గ పంచ్‌ లేదు. ఆ సీన్‌ చివర్లో మహేష్‌ తీన్‌మార్‌ వేస్తేనే కానీ కిక్‌ రాలేదు. ఫ్లాట్‌గా సాగిపోయినా కానీ అప్పుడప్పుడూ వచ్చే ఫన్‌ మొమెంట్స్‌తో ఫస్టాఫ్‌ ఓ మాదిరిగా సాగిపోయింది. 

సెకండ్‌ హాఫ్‌లో ఎప్పుడైతే రివెంజ్‌ యాంగిల్‌ రివీల్‌ అవుతుందో... అక్కడ్నుంచి అయినా ‘ఆగడు’ అనుకుంటే... సరాసరి ‘దూకుడు’ మోడ్‌లోకి దూకాడు. ఎనర్జీ తెస్తాడని అనుకున్న బ్రహ్మానందం కూడా వంద సార్లు వినేసిన జోకులు చెబుతూ నవ్వించడానికి చూస్తున్న కమెడియన్‌లా బేలగా తేలిపోయాడు. ఇంటర్వెల్‌ వరకు సెకండ్‌ హాఫ్‌లో జోష్‌ ఉంటుందనే హోప్‌ అయినా ఉంటుంది. ఎప్పుడైతే ఆగడు కాస్తా దూకుడు రంగు, రుచి, వాసనల్ని ఆకళింపు చేసుకుందో... తదుపరి తతంగంపై ఆసక్తి సన్నగిల్లిపోతుంది. శ్రీను వైట్ల తన సెన్సాఫ్‌ హ్యూమర్‌కి పదును పెట్టి ఎంతగా ప్రయత్నించినా కానీ ఫకాల్న నవ్వే సన్నివేశం ఒక్కటీ పడలేదు. ఒక్కసారి కిందకి పడ్డ గ్రాఫ్‌ మళ్లీ పైకి లేవలేదు. మసాలా సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి కానీ ఏ ఎమోషన్‌ పండలేదు. హాఫ్‌ బేక్డ్‌ స్క్రిప్ట్‌, ఫ్లాట్‌ స్క్రీన్‌ప్లే వల్ల ఫలానా ఎమోషన్‌ కానీ, ఎలిమెంట్‌ కానీ హైలైట్‌ అనిపించే స్థాయిలో లేదు. 

రొటీన్‌ రివెంజ్‌ డ్రామాలు, కమర్షియల్‌ సిత్రాలు అయినా ఒకింత ఓకే కానీ... ఇలాంటి ఫార్మాట్‌లో ఉన్న సినిమా నెలకొకటి చొప్పున వచ్చి పడుతోందిప్పుడు. కాబట్టి ఈ ‘బీటెన్‌ టు డెత్‌’ ట్రీట్‌మెంట్‌తో మహేష్‌ ఒక్కడూ ఈ చిత్రాన్ని ఎంత దూరం లాగుతాడనేది చూడాలి. మహేష్‌ని చూడ్డానికి సినిమాకెళ్లే వారికి కనులపంట అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెరపై అంతా తానొక్కడై నడిపించిన మహేషే బాక్సాఫీస్‌ వద్ద కూడా దీనికి షీల్డ్‌ కావాలి, షోల్డర్‌ చేయాలి.

బోటమ్‌ లైన్‌: ఆగడు - స్ట్రిక్ట్‌లీ ఫర్‌ మహేష్‌ ఫాన్స్‌!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Click Here For Aagadu Public Talk

Watch Sreenu Vaitla Exclusive Interview

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?