సినిమా రివ్యూ: బసంతి

రివ్యూ: బసంతి రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: స్టార్ట్‌ కెమెరా పిక్చర్స్‌ తారాగణం: రాజా గౌతమ్‌, అలీషా బేగ్‌, సయాజీ షిండే, తనికెళ్ళ భరణి, రణధీర్‌ తదితరులు మాటలు: శ్రీకాంత్‌ విస్సా సంగీతం: మణిశర్మ కూర్పు:…

రివ్యూ: బసంతి
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: స్టార్ట్‌ కెమెరా పిక్చర్స్‌
తారాగణం: రాజా గౌతమ్‌, అలీషా బేగ్‌, సయాజీ షిండే, తనికెళ్ళ భరణి, రణధీర్‌ తదితరులు
మాటలు: శ్రీకాంత్‌ విస్సా
సంగీతం: మణిశర్మ
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: అనిల్‌ బండారి, పి.కె. వర్మ
కథ, కథనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య దంతులూరి
విడుదల తేదీ: ఫిబ్రవరి 28, 2014

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్‌ ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించాడు కానీ హీరోగా సక్సెస్‌ రాలేదు. ఈసారి ‘బాణం’లాంటి ప్రశంసాత్మక చిత్రం తీసిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో ‘బసంతి’ చేసాడు. బ్రహ్మానందం తన తనయుడి కోసం ఈ చిత్రానికి తనవంతుగా చాలా ప్రమోషన్‌ చేశారు. స్టార్‌ హీరోలంతా ఈ చిత్రం పబ్లిసిటీకి తమవంతు సహకారం అందించారు. మరి ఈసారైనా బ్రహ్మీకి పుత్రోత్సాహం దక్కుతుందా? బసంతితో రాజా గౌతమ్‌కి హీరోగా తొలి విజయం అందుతుందా? 

కథేంటి?

అర్జున్‌ (గౌతమ్‌) ఒక కాలేజ్‌ స్టూడెంట్‌. రోషిణిని (అలీషా) చూడగానే ప్రేమిస్తాడు. కాలేజ్‌ ఫేర్‌వెల్‌ పార్టీ కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా అర్జున్‌ చదువుతున్న బసంతి కాలేజ్‌ని ఉగ్రవాదులు చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకుంటారు. వారి అదుపులో ఉన్న ఎనభై మంది విద్యార్థులని వదలాలంటే పోలీసుల అదుపులో ఉన్న తీవ్రవాదిని విడుదల చేయాలంటారు. ఈ క్రమంలో అర్జున్‌ ప్రాణ స్నేహితుడు అబ్బాస్‌ని (రణధీర్‌) చంపేస్తారు. దాంతో అర్జున్‌ వారికి ఎదురు తిరుగుతాడు. ఉగ్రవాదుల్ని అతను ఎలా తుద ముట్టించాడనేది మిగతా కథ. 

కళాకారుల పనితీరు!

రాజా గౌతమ్‌ మొదటి రెండు సినిమాల కంటే నటుడిగా ఇంప్రూవ్‌ అయ్యాడు. కానీ ఇంకా బెటర్‌మెంట్‌కి చాలా స్కోప్‌ ఉంది. కొన్ని సందర్భాల్లో అసలు ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా క్యాజువల్‌గా డైలాగ్స్‌ అప్పజెప్పేసాడు. స్నేహితుడు చనిపోయిన తర్వాత బ్రేక్‌ అయ్యే సీన్‌లో బాగా నటించాడు. అలీషా బేగ్‌ నటన ఏమాత్రం మెప్పించలేదు. దానికి తోడు ఆమెకి రాసిన సంభాషణలు కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి. తనికెళ్ళ భరణి, సయాజీ షిండే సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లో సినిమాకి వెయిట్‌ తీసుకొచ్చారు. రణధీర్‌ ఓకే అనిపిస్తాడు. ఉగ్రవాది ఘాజీగా నటించిన వ్యక్తి పాత్రకి అనుగుణంగా ఉన్నాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:

మణిశర్మ మ్యూజిక్‌ ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలిచింది. ఎమోషన్‌ పండాల్సిన సీన్స్‌ చాలా ఆర్డినరీగా తెరకెక్కినా కానీ ఆ లోటుని మణిశర్మ చాలా వరకు పూరించాడు. సాంగ్స్‌ ఫర్వాలేదనిపిస్తాయి. ‘తిరుగుబాటిది’ పాటకి సమయం, సందర్భం లేకుండా అలా వచ్చిపోతుంది. లిరిక్స్‌లో ఉన్న ఫోర్స్‌కి అతీతంగా కొరియోగ్రఫీ కూడా బ్యాడ్‌ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తక్కువ వనరులతోనే క్వాలిటీ తీసుకొచ్చారు. గోల్కొండ ఫోర్ట్‌లో తీసిన పాట చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌ అంతా ఒకే లొకేషన్‌లో తీసినా కానీ ఆ ఫీల్‌ రానివ్వలేదు. ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంది. టెక్నికల్‌గా ఈ చిత్రం బాగుంది. 

దర్శకుడు చైతన్య దంతులూరి తన టెక్నికల్‌ టీమ్‌ నుంచి మంచి అవుట్‌పుట్‌ రాబట్టుకున్నాడు. సినిమాని మంచి క్వాలిటీతో తెరకెక్కించాడు. షాట్‌ మేకింగ్‌ అతని ప్రతిభని తెలియజేస్తుంది. అయితే స్క్రిప్ట్‌ పరంగా తగినంత వర్క్‌ జరిగినట్టు అనిపించదు. సినిమాలో చాలా వరకు డిస్‌కనెక్టెడ్‌గా, క్యాజువల్‌ అప్రోచ్‌తో వెళ్లిపోతుంది. ఫస్ట్‌ హాఫ్‌లో లవ్‌ ట్రాక్‌ ఏమంత స్పెషల్‌గా లేదు. సెకండ్‌ హాఫ్‌లోని ఆ ఎక్స్‌ట్రార్డినరీ సిట్యువేషన్‌ని డీల్‌ చేసిన విధానం ఆకట్టుకోదు. దర్శకుడిగా రాణించినా కానీ రచయితగా కాంప్రమైజ్‌ అయిపోయినట్టు, అన్యమనస్కంగా కథ, కథనాలు రాసేసుకుని చిత్రీకరణకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. హాఫ్‌ బేక్డ్‌ స్క్రిప్ట్‌తో హాఫ్‌ హార్టెడ్‌ ఎటెంప్ట్‌ అన్నమాట.  

హైలైట్స్‌:

  • బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
  • సినిమాటోగ్రఫీ

డ్రాబ్యాక్స్‌:

  • స్క్రీన్‌ప్లే
  • క్లైమాక్స్‌

విశ్లేషణ:

ఒక ఎక్స్‌ట్రార్డనరీ సిట్యువేషన్‌లో ఒక ఆర్డినరీ మనిషి ఉంటే ఎలా రియాక్ట్‌ అయ్యాడు… ఏ విధంగా రివోల్ట్‌ అయ్యాడు అనేది చైతన్య దంతులూరి తీసుకున్న థీమ్‌. అయితే అలాంటి ఒక ఎక్స్‌ట్రార్డనరీ సిట్యువేషన్‌కి చాలా ఆర్డినరీ సొల్యూషన్‌ ఇచ్చాడు ఫైనల్‌గా. టెర్రరిజం… ఇది దాదాపుగా భారతీయులందరికీ తెలిసిన అంశం. దీని గురించి మహా నగరాల్లో ఉన్నవాళ్లు అందరికీ ఒక అవగాహన ఉంది. ఉగ్రవాదులు తెగబడి ఊళ్ల మీద పడ్డప్పుడు జరిగే బీభత్సం గురించి, పుట్టించే భయోత్పాతం గురించి వార్తలు ఫాలో అయ్యే వాళ్లందరికీ ఒక ఐడియా అయితే ఉంది. ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన ఈ ఉగ్రవాదాన్ని నిజ జీవితంలో అయితే ఎంత మంది అధికారులు, ఎన్ని ప్రత్యేక శాఖలు అయినా ట్యాకిల్‌ చేయలేవు. అది అంత ఈజీ కాదు కూడా! కానీ ఇదే టెర్రరిస్టుల్ని సినిమాల్లోకి తెచ్చేసరికి చాలా ఈజీగా బోల్తా కొట్టించేస్తుంటారు. ‘బసంతి’ సినిమాలో అయితే మరీ వాస్తవానికి అతీతంగా ఒక కాలేజ్‌ స్టూడెంట్‌ చాలా సింపుల్‌గా, అత్యాధునిక ఆయుధాలు ధరించి ఉన్న ఉగ్రవాదుల్ని అవలీలగా మట్టి కరిపించేస్తాడు. 

సినిమాటిక్‌ ముగింపులు ఇచ్చేదానికి ఇలాంటి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఇలాంటివి తీయదలచినప్పుడు రియాలిటీకి ఎంత క్లోజ్‌గా ఉంటే అంత మేలు. పోనీ క్లయిమాక్స్‌ని పక్కన పెట్టినా మిగతా సినిమాలోను ఎమోషన్స్‌ పండలేదు. ఒక్క స్నేహితుడి మరణం మినహా ‘బసంతి’లో టచ్‌ చేసే మూమెంట్‌ లేదు. సినిమా అంతటా క్యాజువల్‌నెస్‌ డామినేట్‌ చేసింది. ఆ క్యాజువల్‌నెస్‌ కాలేజ్‌ సీన్స్‌ వరకు ఓకే. కానీ టెర్రరిస్ట్‌లు, ఎన్‌ఎస్‌జి కమాండోలు ఇన్‌వాల్వ్‌ అయిన సీన్స్‌లోను ఉండడం మాత్రం కరెక్ట్‌ కాదు. ఈ చిత్రంలో టెర్రరిస్ట్‌ లీడర్‌గా నటించిన క్యారెక్టర్‌ ఓ సందర్భంలో రూబిక్‌ క్యూబ్‌ సాల్వ్‌ చేస్తాడు.. (చాలా తెలివైనవాడు అని పోస్ట్‌ చేయడం ఆ షాట్‌ వెనుక ఆంతర్యం). అలాగే అతనో కెమికల్‌ ఇంజినీర్‌ అని, బాంబులు తయారు చేయడంలో ఎక్స్‌పర్ట్‌ అనీ చెబుతారు. అయితే అంత తెలివైనవాడు ఒక కాలేజ్‌ స్టూడెంట్‌ తననుంచి తప్పించుకుని పోతే… ఆ సమస్యని సాల్వ్‌ చేసే విధానం జోక్‌లా అనిపిస్తుంది. 

రొటీన్‌కి భిన్నంగా ఆలోచించడం, కొత్త ప్రయత్నాలు చేయడం ఎప్పుడూ హర్షణీయమే. మొనాటనీతో మసి పడుతోన్న మన సినిమాలకి అలాంటి ఆలోచనలున్న దర్శకులు, అటువంటి ప్రయత్నాలు అవసరం కూడా. కాకపోతే పాత దారిలో వెళ్లినపుడు కొన్ని గతుకులున్నా కానీ గమ్యం అయితే చేరిపోవచ్చు. కానీ కొత్త దారి కనుగొనాలని చూసినపుడు జస్ట్‌ ఇటు నడవాలనే కోరిక ఉంటే చాలదు. గమ్యం చేర్చే నేర్పు కూడా ఉండాలి. కొత్తగా నడిచాడు కదా అని అప్రీషియేట్‌ చేయాలా… దిక్కు తోచకుండా మిగిలాడని నిందించాలా? గుడ్‌ ఎటెంప్ట్‌కి, గుర్తుండిపోయే సినిమాకి మధ్య ఒక గోడ ఉంటుంది. దానిని దాటడానికి ఆర్డినరీ ఎఫర్ట్స్‌, హాఫ్‌ బేక్డ్‌ స్క్రిప్ట్స్‌ సరిపోవు. ఇంకేదో ఎక్స్‌ట్రా ఉండాలి. బసంతిలో అది పూర్తిగా మిస్‌ అయింది. 

టెర్రరిస్ట్స్‌ని ట్యాకిల్‌ చేసిన తీరుని ఓకే అని వదిలేసినా కానీ, కనీసం లీడ్‌ క్యారెక్టర్స్‌ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయినప్పుడు ‘అయ్యో వీరెలా బయటపడతారో?’ అనే ఆందోళన అయినా కలగాలి. కనీసం క్యారెక్టర్స్‌తో అలాంటి కనెక్షన్‌ అయినా ఏర్పరచాలి. ముఖ్యంగా అలాంటి దారుణం తెర మీద జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనమే ఉన్నామనే ఫీలింగ్‌ తెచ్చేయాలి. అంతా ఏదో డ్రామాలా సాగిపోతూ ఉంటే, క్యారెక్టర్స్‌ అన్నీ ఎవరో ఆదేశాలిచ్చి ఆడిస్తున్న కార్డ్‌బోర్డ్స్‌లా కనిపిస్తుంటే ఇక ఆ చిత్రంతో ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ కాదు కదా… ఏం జరిగినా పెద్దగా కేర్‌ చేసే ఛాన్స్‌ ఉండదు. 

‘బాణం’ చిత్రాన్ని చాలా బాగా హ్యాండిల్‌ చేసిన చైతన్య దంతులూరి ఈసారి రచయితగా ఫెయిల్‌ అవడంతో అతడిలోని దర్శకుడు కూడా హ్యాండికేప్డ్‌గా మిగిలాడు. ‘బసంతి’పై మనసు పెట్టి ఉంటే, దీనిని వీలయినంత వాస్తవికంగా, హత్తుకునే పాత్రలతో తీర్చిదిద్ది ఉంటే రిజల్ట్‌ మరోలా ఉండేది. ముందే చెప్పినట్టు ఎక్స్‌ట్రార్డినరీ సిట్యువేషన్‌కి ఆర్డినరీ సొల్యూషన్‌ ఇచ్చేసి ఈ చిత్రాన్ని కూడా ఆర్డినరీగా మిగిల్చేసారు. ఎండ్‌ ప్రోడక్ట్‌తో సంబంధం లేకుండా గుడ్‌ ఎటెంప్ట్‌ చేసారనిపిస్తే చాలనుకుంటే తప్ప బసంతిని అప్రీషియేట్‌ చేయలేరెవరూ. 

బోటమ్‌ లైన్‌: బసంతి: ప్రయత్నం మంచిదే. కానీ ఫలితం దక్కలే!

-జి.కె.