Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: బెంగాల్‌ టైగర్‌

సినిమా రివ్యూ: బెంగాల్‌ టైగర్‌

రివ్యూ: బెంగాల్‌ టైగర్‌
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
తారాగణం: రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్‌ ఇరానీ, రావు రమేష్‌, పృధ్వీ, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే, షకలక శంకర్‌, ప్రభ తదితరులు
సంగీతం: భీమ్స్‌
కూర్పు: గౌతరరాజు
ఛాయాగ్రహణం: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
నిర్మాత: కె.కె. రాధామోహన్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సంపత్‌ నంది
విడుదల తేదీ: డిసెంబరు 10, 2015

టైటిల్‌ దగ్గర్నుంచి ట్రైలర్‌ వరకు ఈ చిత్రం ఎలా ఉండబోతుందనేది సంపత్‌ నంది క్రిస్టల్‌ క్లియర్‌ పిక్చర్‌ ఇచ్చాడు. పూర్తి స్థాయి మసాలా చిత్రంగా కమర్షియల్‌ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలనీ జోడించి 'బెంగాల్‌ టైగర్‌'ని తీర్చిదిద్దాడు. సంపత్‌ తీసిన 'రచ్చ' సినిమా మాదిరిగానే ఇది కూడా రొటీన్‌ రివెంజ్‌ కాన్సెప్ట్‌తో రాసుకున్న స్క్రిప్టే. అయితే మాస్‌కి నచ్చే అంశాలని జోడించడంలో సంపత్‌ మరోసారి సక్సెస్‌ అయ్యాడు. రొటీన్‌ స్క్రిప్ట్‌ని కూడా ఎంటర్‌టైనింగ్‌ ట్రీట్‌మెంట్‌తో, హీరో క్యారెక్టర్‌ పరంగా కాసింత వైవిధ్యాన్ని జోడించి, కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, సెంటిమెంట్‌, రివెంజ్‌ ఇలా అన్నీ సమపాళ్లలో వేసుకుంటూ ఫార్ములాని ఫాలో అయిపోయాడు. 

సినిమాలో ఎంతోకొంత కొత్తదనం ఉండాలని కోరుకునే జనం ఇప్పుడిది చూసినా, అప్పుడు రచ్చ చూసినా కానీ 'ఇదో సినిమానా?' అనేస్తారు. కానీ సగటు మాస్‌ ప్రేక్షకులు ఇలా మీటర్‌ ఫాలో అయిన సినిమాల్లో మేటర్‌ తక్కువైనా కానీ పాస్‌ చేసేస్తారు. సంపత్‌ నంది తీరు చూస్తే ఓల్డ్‌ స్కూల్‌ కమర్షియల్‌ ఫార్ములా, మాస్‌ పల్స్‌పై బాగా పట్టున్నట్టు అనిపిస్తాడు. 'రచ్చ' సినిమాని విమర్శకుల్లో చాలా మంది చీల్చి చెండాడారు. కానీ అది బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ కలెక్షన్లు రాబట్టుకుని హిట్టయింది. ఈసారి కూడా సంపత్‌ అదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. ఈసారి కాస్త కామెడీ డోస్‌ పెంచాడు కానీ ఎమోషనల్‌ ఇంపాక్ట్‌ మాత్రం అంతగా చూపించలేకపోయాడు. ఈమధ్య కాలంలో కమర్షియల్‌ సినిమా అనగానే సెకండాఫ్‌లో హీరో విలన్‌ ఇంటికో, విలన్‌ హీరో ఇంటికో, లేదా ఇద్దరూ కలిసి ఇంకెవరో ఇంటికో వెళ్లిపోయి అక్కడే కాలక్షేపం చేయడమే ఫార్ములా అయిపోయింది. 

సంపత్‌ నంది ఆ ఫార్మేట్‌ జోలికి పోకుండా సిసలైన కమర్షియల్‌ మసాలానే దట్టించి 'బెంగాల్‌ టైగర్‌'ని తెరకెక్కించాడు. ఫేమస్‌ కాకపోతే విలువ లేదని తెలుసుకున్న హీరో అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఛీఫ్‌ మినిష్టర్‌ కూతుర్నే ప్రేమిస్తున్నానంటూ సెన్సేషన్‌ సృష్టిస్తాడు. ఇతను చేసేదాంట్లో బొత్తిగా సెన్స్‌ లేదనిపించినప్పుడే వెనకాల ఏదో కథ ఉందనేది తెలిసిపోతుంది. అనుకున్నట్టుగానే హీరో తండ్రికి జరిగిన అన్యాయం, దాని పర్యవసానంగా ప్రతీకారం తెర మీదకి వస్తాయి. ఈ సగటు కథని రంజింప చేసేందుకు రవితేజ ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్‌ని రాసుకుని, థర్టీ ఇయర్స్‌ పృధ్వీ రూపంలో ఒక అల్టిమేట్‌ సెటైరికల్‌ క్యారెక్టర్‌ని కూడా తగిలించాడు సంపత్‌ నంది. రాజకీయ నాయకుల కుటుంబాల్లో కూడా హీరో కావాలనే కోరిక చాలా మందిలో ఉంటుందనేది మనం చూస్తూనే ఉన్నాం. దానినే కామెడీగా మలిచి ఆ క్యారెక్టర్‌పై కొన్ని బ్రహ్మాండమైన కామెడీ సీన్లు కూడా రాసుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్‌లో చెప్పుకోతగ్గ విషయం లేకపోయినా కానీ కామెడీ సీన్లు, రవితేజ హంగామాతో సాగిపోతుంది. ఇంటర్వెల్‌కి వచ్చే ట్విస్టు కూడా బాగా పండింది. 

సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి అదే టెంపోని మెయింటైన్‌ చేయలేకపోయాడు. ఎప్పుడైతే కామన్‌ మేన్‌ వర్సెస్‌ సీఎం అయిందో ఇక అక్కడ లాజికల్‌గా ముందుకి సాగలేని లాక్‌ పడిపోతుంది. కనీసం పృధ్వీ క్యారెక్టర్‌తో సెకండ్‌ హాఫ్‌కి కూడా కామెడీతో సపోర్ట్‌ ఇచ్చి ఉండాల్సింది. అవకాశం ఉన్నా కానీ ఆ ట్రాక్‌ని వాడుకోలేదు. బ్రహ్మానందాన్ని ఇంట్రడ్యూస్‌ చేసినా కానీ ఈమధ్య కాలంలో అన్ని సినిమాల మాదిరిగానే ఇందులో కూడా ఆయన ఎలాంటి వేల్యూ యాడ్‌ చేయలేకపోయాడు. సిఎం, కామన్‌ మేన్‌ ఇద్దరూ ఛాలెంజ్‌ చేసుకుని ఇరవై నాలుగ్గంటల టైమ్‌ లిమిట్‌ పెట్టుకున్నప్పుడు ఆ ప్లే చాలా రసవత్తరంగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఆ రోజుని చాలా చప్పగా కానిచ్చేసి దర్శకుడు ఎస్కేపిస్ట్‌ రూట్‌ ఎంచుకున్నాడు. ఇద్దరు తెలివైన వాళ్లు అంటూ ఇద్దరికీ బిల్డప్‌ ఇచ్చి ఇద్దరూ క్లాష్‌ అయినప్పుడు తెలివితేటలకి చోటు లేకుండా చేసాడు. 

అలాగే ఒక ముఖ్యమంత్రి కూతురు తనకి ముఖ పరిచయం కూడా లేని హీరోని ఇట్టే ప్రేమించేస్తున్నా అనడం డైరెక్టర్‌ కన్వీనియన్స్‌కి తగ్గట్టు కథని రాసుకుంటూ పోవడమే తప్ప ఇంకేం కాదు. అన్ని సినిమాల్లోను అదే పులిహోరనా అంటూ కంప్లయింట్లు మామూలే కానీ చేయి తిరిగిన వంటగాడు అయితే పులిహోర కూడా హ్యాపీగా తినేసేలా తయారు చేస్తాడు మరి. మాస్‌ ప్రేక్షకులకి రుచికురమైన పులిహోరనే వండి పెట్టాడు సంపత్‌ నంది. రవితేజ ఎందుకని తగ్గాడో కానీ తన ఎనర్జీకి, ఫిజిక్‌కి మ్యాచ్‌ అవడం లేదు కనుక పూర్వ రూపానికి వచ్చే ప్రయత్నాల్లో ఉండడం ఉత్తమం. బికినీతో సహా వేసేసిన రాశి ఖన్నా ఈ చిత్రంలో గ్లామర్‌ పరంగా తమన్నాతో పోటీ పడింది. ఇద్దరూ పోటాపోటీగా అందాల విందు చేయడం గ్లామర్‌ ప్రియులకి పండగ భోజనమే. బోమన్‌ ఇరానీ లాంటి ఆర్టిస్ట్‌తో చాలా మామూలు క్యారెక్టర్‌ చేయించడం బాలేదు. అతనికి తగ్గట్టుగా పాత్రకి మెరుగులు దిద్ది ఉండాల్సింది. రావు రమేష్‌తో రాయలసీమ యాస మాట్లాడించారు. అది బలవంతంగా తెచ్చి పెట్టుకున్నట్టు తెలిసిపోతూనే ఉంటుంది. ఆయనకి కోట మాదిరిగా మాండలికాలపై పట్టున్నట్టు లేదు. పృధ్వీకి బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ కంటే ఈ ఫ్యూచర్‌ స్టార్‌ క్యారెక్టర్‌ ఇంకా పేరు తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. 

పాటలేమంత బాలేవు కానీ ఫ్లోలో వెళ్లిపోయాయి. ఇక హీరోయిన్ల అండ ఉండనే ఉంది. సంపత్‌ డైలాగులు కూడా కొన్ని సందర్భాల్లో బాగా పేలాయి. ముందే చెప్పుకున్నట్టు ఇది ఫక్తు మాస్‌ చిత్రం. ఆ విధంగా ప్రిపేర్‌ అయి వెళ్లిపోతే ఫస్ట్‌హాఫ్‌లో కావాల్సినంత వినోదం ఉంటుంది. ఇక తక్కిన మసాలాలన్నీ బోనస్‌గా పనికొస్తాయి. వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులు మాత్రం బెంగాల్‌ టైగర్‌కి ఫలహారమైపోయామని ఫీలవ్వాల్సి వస్తుంది. 

బోటమ్‌ లైన్‌: బెంగాల్‌ 'పులి'హోర!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?