రివ్యూ: భలే భలే మగాడివోయ్
రేటింగ్: 3.25/5
బ్యానర్: జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్
తారాగణం: నాని, లావణ్య త్రిపాఠి, మురళి శర్మ, అజయ్, ప్రవీణ్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, నరేష్, సితార, స్వప్న మాధురి తదితరులు
సంగీతం: గోపీ సుందర్
కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
ఛాయాగ్రహణం: నిజర్ షఫీ
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాస్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: సెప్టెంబర్ 4, 2015
కొన్ని కథలు కొంతమంది కోసమే పుడతాయి. ఆ కథలు ఆ నటుల్ని వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. 'భలే భలే మగాడివోయ్' కథ నాని కోసమే పుట్టిందా, ఈ పాత్ర చేయడానికే తాను నటుడయ్యాడా అన్నట్టుగా 'పర్‌ఫెక్ట్ మ్యాచ్' కుదిరింది. మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. ఒక చిన్న క్యారెక్టరైజేషన్ లేదా కాన్‌ఫ్లిక్ట్‌ని పట్టుకుని జనాన్ని ఆకర్షించే కథనం రాసుకోగల సమర్థుడు. అందుకే అతనికి ఇంతవరకు దర్శకుడిగా ఫెయిల్యూర్ లేదు. ఐడెంటిటీ కోసమనో, సేఫ్ లాంఛ్ కోసమనో మొదట్లో వల్గర్ కామెడీని ఆసరా చేసుకున్నాడు కానీ ఆ మచ్చలన్నీ చెరిపేసుకునే క్లీన్ సినిమాతో ముందుకొచ్చాడు.
'భలే భలే మగాడివోయ్' ఆద్యంతం హాయిగొలిపే సన్నివేశాలతో ఎక్కడా విసిగించకుండా సాఫీగా, సరదాగా సాగిపోతుంది. మతిమరపు వున్న వ్యక్తి ప్రేమలో పడితే ఎన్ని తిప్పలు పడతాడు అనే పాయింట్‌ని తీసుకుని మారుతి దాని చుట్టూ చక్కని కథ అల్లాడు. కథ అనడం కంటే… సదరు మతిమరపు వ్యక్తికి ఎదురయ్యే సమస్యలు, వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే విధానాలు వగైరా సిట్యువేషన్స్ బాగా సెట్ చేశాడు. కొన్ని సందర్భాల్లో మారుతి చూసిన చాకచక్యం చూసి మెచ్చుకోకుండా వుండలేం. ఉదాహరణకి ఒక సన్నివేశంలో సినిమాకి వస్తానని హీరోయిన్‌తో చెప్పి హీరో ఆ సంగతే మర్చిపోతాడు. ఫ్రెండ్స్‌తో క్యారమ్స్ ఆడుకుంటూ వుంటాడు… ఆమె థియేటర్‌నుంచి సరాసరి తను ఆడుతున్న చోటికి వచ్చేసరికి, 'శంకర్‌దాదా ఎంబిబిఎస్'లో వృద్ధుడితో చిరంజీవి క్యారమ్స్ ఆడించే సీన్ ప్యారడీ చేసి ఇన్‌స్టంట్‌గా, ఇంటిల్లిజెంట్‌గా ఫన్ సృష్టించిన తీరుకి ముచ్చట పడతాం. అలాంటి స్పాంటేనిటీ సీన్స్‌లో లేదా డైలాగ్స్‌లో అడుగడుగునా కనిపిస్తూనే వుంటుంది.
హీరో లోపం ఏంటన్నది హీరోయిన్ తండ్రికి తెలియడం, హీరోయిన్‌కి తెలియకపోవడం అనే అంశాల చుట్టూ ఈ కథని నడిపించేశాడు. ప్రథమార్థం ఫుల్ కామెడీతో సరదా సరదాగా సాగిపోతూ ద్వితీయార్థంపై అంచనాలు పెంచేస్తుంది. ఆ అంచనాలకి తగ్గ రీతిలో లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో కూడా విసిగించని వినోదం ఈ మగాడిని సేఫ్‌గా పతాక దృశ్యాలకి చేర్చేస్తుంది. కమర్షియల్ క్లయిమాక్స్ కోసమని కొన్ని కాంప్రమైజ్‌లు పడ్డారు కానీ హీరోయిన్ని అజయ్‌కిచ్చి పంపేయడం, ఆమెని తీసుకురమ్మని నానికి పురమాయించడం లాంటివి అంత వరకు చూసిన సినిమాతో సింక్‌లో లేవు.
మారుతి ద్వితీయార్థంపై మరింత శ్రద్ధ పెట్టి వుంటే ఆ శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌లపై నడిపించిన సన్నివేశాలతో మరింత వినోదం పండి వుండేదనిపించింది. అయితే పైసా వసూల్ అయిపోయిన సినిమాలో చిన్నపాటి లోపాలని పట్టించుకోనవసరం లేదు. ముందే చెప్పినట్టు ఈ క్యారెక్టర్ నాని కోసమే పుట్టిందా అన్నట్టుగా అతనీ పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేశాడు. తన మీద తనకి అపారమైన నమ్మకంతో పాటు ఇంపెక్కబుల్ కామెడీ టైమింగ్ వుంటే తప్ప ఈ పాత్రని ఒక్క రాంగ్ నోట్ కూడా లేకుండా పండించడం కష్టం. స్క్రిప్టుతోనే సగం విజయం సాధించిన ఈ చిత్రాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లాడు నాని. ఈ సినిమా చూస్తున్నంతసేపు నిజంగానే మతిమరపు వున్న యువకుడే అనిపిస్తాడు కానీ నటిస్తున్నాడని ఏ క్షణంలోను అనిపించదు. అంత పర్‌ఫెక్షన్ అతి తక్కువ మంది ఆర్టిస్టుల వల్లే అవుతుంది.
లావణ్య త్రిపాఠికి సగటు హీరోయిన్ ఫీచర్స్ లేవు కానీ పక్కింటి అమ్మాయి పాత్రలకి బాగా సెట్ అవుతుంది. కాకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌ని చూడగానే అటు హీరో, ఇటు విలన్ పీకల్లోతు ప్రేమలో పడిపోతారు. బహుశా అంతటి అందగత్తెని హీరోయిన్‌గా పెట్టుకుని వుండాల్సిందేమో. అయితే తన నటనతో లావణ్య మెప్పించగలిగింది. రావు రమేష్ లేదా ప్రకాష్‌రాజ్‌లు చేసే పాత్రలో మురళీ శర్మని తీసుకోవడం మంచి ఆలోచన. దీంతో ఆ పాత్రతో పాటు దానిపై అల్లిన సన్నివేశాలన్నీ రొటీన్ ఫీలింగ్ రాకుండా ఆకట్టుకున్నాయి. వెన్నెల కిషోర్ బాగానే చేశాడు. హీరో స్నేహితుడిగా ప్రవీణ్ ఆకట్టుకున్నాడు. హీరో తండ్రిగా నరేష్ నవ్వించాడు. శ్రీనివాసరెడ్డి ఫర్వాలేదు. స్వప్న మాధురి, సితార, సత్యకృష్ణ తదితరులు తమకిచ్చిన పాత్రలకి న్యాయం చేసారు.
మారుతి దర్శకుడిగా ఈ చిత్రాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేశాడో సంభాషణల రచయితగాను ఆకట్టుకున్నాడు. 'మీకు మంత్లీ సాలరీ ఇస్తారా లేదా క్లాస్‌కింత అని ఇస్తారా'లాంటి స్పాంటేనియస్ డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. పాటలు ఫర్వాలేదు. నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఛాయాగ్రహణంకి వంక పెట్టలేం. నిర్మాతలు రాజీ పడకుండా క్వాలిటీ సినిమా తీసారు.
ఒక్క చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్టు… ఒక్క చిన్న ఐడియా సూపర్ సక్సెస్‌ని ఖాయం చేస్తుందని ఇలాంటి చిత్రాలు నిరూపిస్తాయి. మెమరీ లాస్ కాన్సెప్ట్‌తో పలు చిత్రాలొచ్చాయి కానీ దానిని కామెడీగా డీల్ చేస్తూ ఒక మంచి వినోదాత్మక ప్రేమకథ తెరకెక్కించవచ్చని వచ్చిన ఆలోచనని మారుతి ఆచరణలో పెట్టాడు. సదరు సమస్యతో వినోదాన్ని పండించడానికి ఎంత అవకాశముందో అంతా శోధించాడు. తన క్యారెక్టర్‌ని ఎదురుగా పెట్టుకుని… అది డ్రైవ్ చేసిన డైరెక్షన్‌లో వెళ్లిపోయాడు. డైరెక్టర్‌గాను సక్సెస్ అయిపోయాడు. డైరెక్టర్‌గా మారుతికి రెస్పెక్ట్‌ని పెంచి, అతని స్టాటస్‌ని మార్చే చిత్రమిది. అందుకు మారుతి తనని తాను మెచ్చుకోవాలి… ఈ క్యారెక్టర్‌ని సృష్టించినందుకు. అలాగే నానికి థాంక్స్ చెప్పుకోవాలి… ఆ పాత్రకి ప్రాణం పోసినందుకు. ట్రెయిలర్స్ చూసి బాగుంటుందనే నమ్మకంతో థియేటర్లలోకి వెళ్లినపుడు చాలా సినిమాలు నిరాశ పరుస్తుంటాయి. అంచనాలకి తగ్గట్టుగా తెరకెక్కి ఏ నమ్మకంతో అయితే వచ్చారో దానిని వమ్ము చేయకుండా పంపే సినిమాలు అపుడపుడూ పలకరిస్తుంటాయి. అలాంటి కోవకి చెందిన భలే చిత్రమిది.
బోటమ్ లైన్: భలే భలే వినోదమోయ్!
– గణేష్ రావూరి