Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: బ్రహ్మోత్సవం

సినిమా రివ్యూ: బ్రహ్మోత్సవం

రివ్యూ: బ్రహ్మోత్సవం 
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: పివిపి సినిమా, మహేష్‌బాబు ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
తారాగణం: మహేష్‌, సమంత, కాజల్‌, సత్యరాజ్‌, ప్రణీత, జయసుధ, రావు రమేష్‌, రేవతి, జయప్రకాష్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, తులసి, సయాజీ షిండే, ముఖేష్‌ రిషి, కృష్ణ భగవాన్‌ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఆర్‌. రత్నవేలు
నిర్మాతలు: పర్ల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నే
రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
విడుదల తేదీ: మే 20, 2016

బ్రహ్మోత్సవం చూస్తున్నంత సేపు అసలు శ్రీకాంత్‌ అడ్డాల ఏం చెప్పి మహేష్‌ని ఒప్పించాడా అనే ప్రశ్న మదిని తొలిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే కథగా చెప్పుకోవడానికి ఇందులో రెండు లైన్లకి మించి ఏం లేదు. ఆ మాటకొస్తే ద్వితీయార్ధం మొదలైన చాలా సేపటికి కానీ అసలు ఈ సినిమా దేని గురించనేది అర్థం కాదు. నలుగురితో కలిసుండాలి అనుకునే పెద్దాయన, నాన్న నమ్మినదానినే పాటించే కొడుకు అంతరంగాలివి. మొదలైంది లగాయతు ఒక ఇంట్లోని జనమంతా కలిసి డాన్సులు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ సంబరాల్లో మునిగిపోవడమే తప్ప ఎంతకీ కథేంటో తెగదు. ఒక హీరోయిన్‌ ఇంట్రడ్యూస్‌ అయితే ఆ పరంగా అయినా ఆకట్టుకునే ట్రాక్‌ ఏదైనా నడుస్తుందని అనుకుంటే, ఆమె వల్ల మరో రెండు పాటలు ఎక్స్‌ట్రా భారం తప్ప ఏదీ ముందుకి కదలదు. 

ఇంటర్వెల్‌ సీన్‌కి ముందు సత్యరాజ్‌పై రావు రమేష్‌ బరస్ట్‌ అయి 'పొద్దున్న లేస్తే పాటలు, డాన్సులు...' అంటూ తన ఫ్రస్ట్రేషన్‌ గురించి చెబుతోంటే, అంతదాకా అదంతా చూసిన మన ఫీలింగ్స్‌నే అతను బయటపెడుతున్నట్టు అనిపిస్తుంది. అటుపై హీరో తన మూలాలు వెతుక్కుంటూ నార్త్‌ ఇండియాలోని పుణ్య క్షేత్రాలన్నిటికీ మరో హీరోయిన్‌తో కలిసి టూర్‌కి వెళతాడు. ఆకట్టుకునే సన్నివేశాల మాట అటుంచి, ఇక ఈ తంతు ఎంత త్వరగా ముగిసిపోతే అంత మేలు అన్న ఫీలింగ్‌ సీన్‌ సీన్‌కీ బలపడిపోతుంది. బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు తదితర విషయాలపై ఎవరు సుదీర్ఘంగా మాట్లాడుతున్నప్పటికీ, వారు సంభాషిస్తున్నది తెలుగులోనే అయినా ఆ భావమేంటో కూడా బోధ పడదు. బహుశా వారి ఎమోషన్లతో కనక్ట్‌ కాలేకపోవడం వల్ల, వారు మాట్లాడేది పూర్తిగా మదిని చేరకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అయి ఉండొచ్చు. 

ఏడు తరాల వారిని కలుపుకోవడానికి హీరో ఎంతో ప్రయాసపడి వందల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణించి వస్తే, చివరకు దానికి పే ఆఫ్‌ కూడా లేకుండా చేసారు. ఆ బంధువులంతా వచ్చి పెళ్లిలో వెనకెక్కడో కూర్చుని కేవలం మహేష్‌తో ముచ్చటిస్తారే తప్ప వారు మిగతా కుటుంబ సభ్యులని కలుసుకున్న ఆనందాలని హైలైట్‌ చేసిన సీన్‌ కూడా లేదు. ప్రథమార్ధంలో కాన్‌ఫ్లిక్ట్‌ అంతా రావు రమేష్‌తో ముడి పడి ఉందన్నట్టు చూపించి, ఆ పాత్రని మళ్లీ పతాక సన్నివేశంలో కానీ తెర మీదకి తీసుకురాకపోవడం చూస్తే అసలు ఈ సినిమాకి కథతో పాటు కథనం కూడా రాసుకోలేదా అనిపిస్తుంది. ఆరంభంలో వచ్చే సన్నివేశాలు పూర్తిగా కనెక్షనే లేకుండా ఒక దాని తర్వాత ఒకటిగా మెకానికల్‌గా వచ్చి పోతుంటాయి. ఆ తంతు అయోమయానికి గురి చేస్తూ ఉంటే కారణం లేకుండా డాన్సుల్లోకి సీన్లు కట్‌ అవడం, అధాటుగా పాటల్లోకి వెళ్లిపోవడం పూర్తిగా నీరసం తెప్పిస్తాయి. 

'మీ ఇంట్లో వాళ్లందరినీ ఒక్కసారి పలకరిస్తేనే అలసిపోతాను. ఇక వీళ్ళతో జీవితాంతం ఎలా ఉండను' అనే కాజల్‌ డైలాగ్‌తో ఇన్‌స్టంట్‌గా కనక్ట్‌ అవుతాం. అలాగే 'మీతో వుంటే టైమే తెలీదనుకున్నా, అసలేమీ తెలీడం లేదు' అని వెన్నెల కిషోర్‌ అన్నా వెంటనే నవ్వుతాం. మెయిన్‌ క్యారెక్టర్ల ఎమోషన్స్‌తో కాక పక్కన వారి ఫ్రస్ట్రేషన్స్‌తో రిలేట్‌ అవుతున్నామంటేనే సినిమాలో పూడ్చలేనన్ని లోపాలున్నాయని అర్థం. అందుకే మహేష్‌ తన ఛార్మింగ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఎంతగా ఆకట్టుకున్నా, రత్నవేలు అద్భుతమైన కెమెరా పనితనంతో అందమైన విజువల్స్‌ చూపిస్తున్నా, అంత మంది హీరోయిన్లున్నా, తెర నిండా తెలిసిన ఆర్టిస్టులున్నా, ఎన్నెన్నో లొకేషన్లున్నా, ఇంటర్వెల్‌, క్లయిమాక్స్‌ సీన్స్‌ మెప్పించినా 'బ్రహ్మోత్సవం'లోని మిగతా లోటులు పూడ్చలేకపోయాయి, లోపాలు కప్పిపుచ్చలేకపోయాయి. 

రొటీన్‌ కమర్షియల్‌ సినిమాల్లో కథలు లేకపోయినా హీరోయిజమ్‌కి సంబంధించిన సీన్లుంటాయి, కనీసం ఫాన్స్‌ని అలరించే డైలాగ్స్‌ ఉంటాయి. కానీ ఇలా ఎమోషన్స్‌ మీద బేస్‌ అయి తీసిన సినిమాకి కదిలించే సన్నివేశాలు లేకపోయినా, వినోదాన్ని అందించే సంభాషణలు లేకపోయినా థియేటర్లో చివరి వరకు ఏమని కూర్చోవాలి, ఎందుకని కూర్చోవాలి? 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమలని, అనుబంధాలని సహజంగా ఆవిష్కరించిన శ్రీకాంత్‌ అడ్డాల ఈసారి ఆ సహజత్వాన్ని తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాడు. యాంత్రికంగా అనిపిస్తోన్న పాత్రల నడుమ సాగేదంతా నాటకాన్ని తలపిస్తుందే తప్ప ఎక్కడా గుండెని స్పృశించదు. కనీసం హీరోయిన్లతో సీన్స్‌ అయినా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయా అంటే అదీ లేదు. కాజల్‌ తన ఆధునిక భావాలతో అర్థం కాని థియరీలు చెప్పిపోతే, సమంత అంతకంటే అర్థం లేని ఇంట్రడక్షన్‌తో మతి పోగొడుతుంది. 

ఆమె పరిచయమయ్యే సీన్లో తనతో బస్‌లో ప్రయాణం చేసిన ప్రయాణీకులు అందరినీ తను వెళుతున్న ఇంటికి తోలుకుని వచ్చేస్తుంది. వారందరికీ వసతి, భోజన సదుపాయాలు చూసుకుంటుంది. కామెడీగా తీసినా నవ్వడానికి ఇబ్బంది పడే ఈ సీన్‌ని హీరోయిన్‌పై హీరోకి ఒక అద్భుతమైన ఇంప్రెషన్‌ వేసేందుకు పెట్టారంటే ఏమనుకోవాలి? తెర నిండా పాత్రలు ఉన్నప్పటికీ ఒకటీ అరా తప్ప వేటికీ సరైన పాత్రచిత్రణ లేదు. నటీనటవర్గం పరంగా మహేష్‌ తర్వాత స్కోర్‌ చేసేది రావు రమేష్‌. అతనికి మరోసారి మరో గుర్తుండిపోయే పాత్రనిచ్చాడు శ్రీకాంత్‌ అడ్డాల. రావు గోపాల్రావు యానిమేషన్‌ క్యారెక్టర్‌ ఐడియా బాగుంది కానీ మంచి డైలాగులు పడకపోవడం వల్ల అదీ తేలిపోయింది. 

పాటలు చూడ్డానికి బాగున్నా కానీ ఫస్ట్‌హాఫ్‌లో ఒక దాని తర్వాత ఒకటిగా ఎన్నో పాటలు వచ్చి పోవడంతో విసుగొస్తుంది. పైపెచ్చు చాలా పాటలు అసందర్భంగా వచ్చి పడతాయి. 'బాలా త్రిపురమణి' పాటలోని సిగ్నేచర్‌ స్టెప్‌ సిల్లీగా అనిపిస్తుంది. నిడివి తగ్గించడానికి సీన్లు తొలగించారో ఏమో కానీ చాలా సందర్భాల్లో సీన్స్‌కి మధ్య లింక్‌ తెగిపోయింది. ఫ్యామిలీస్‌ని, లేడీస్‌ని ఆకట్టుకోవడానికి తగ్గ సహజమైన భావోద్వేగాలు కానీ, అలరించే సన్నివేశాలు కానీ లేని ఈ చిత్రంలో ముప్పావు శాతం సహనానికి ఏదో విధమైన పరీక్ష పెడుతుంది. బాక్సాఫీస్‌ పరంగా మహేష్‌ స్టార్‌డమ్‌, క్రౌడ్‌ పుల్లింగ్‌ ఎబిలిటీ మీదే బ్రహ్మోత్సవం భవిష్యత్తు ఆధారపడుతుంది. 

బోటమ్‌ లైన్‌: ఉత్సవం కాదు నీరసం!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?