రివ్యూ: చెలియా
రేటింగ్: 2/5
బ్యానర్: మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: కార్తీ, అదితి రావు హైదరి, రుక్మిణి విజయ్‌కుమార్, ఆర్ జె బాలాజీ, ఢిల్లీ గణేష్, విపిన్ శర్మ, కెపిఎసి లలిత తదితరులు
మాటలు: కిరణ్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణం: ఎస్. రవివర్మన్
నిర్మాతలు: మణిరత్నం, శిరీష్
రచన, దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2017
మణిరత్నం ప్రేమకథలంటే సహజంగా వుంటాయి, ఆయన పాత్రలు సహజంగా మాట్లాడుకుంటాయి. ఇది సినిమా అనే భావన కలిగించకుండా నిజంగా ఒక ప్రేమజంట తాలూకు భావోద్వేగాలని, వారి ప్రయాణాన్నీ కిటికీ దగ్గర కూర్చుని చూస్తున్న భావన కలిగిస్తాయి. అందుకే ఆయన ప్రేమకథలు చరిత్రలో సజీవంగా నిలిచిపోయాయి. ఒక్కసారి చూసిన ప్రేక్షకుల మది ఫలకాలపై శాశ్వతంగా ముద్రించుకుపోయాయి. ఆమధ్య కాలంలో ప్రయోగాలకి పోయి కడలి, రావణ్‌లాంటి చిత్రాలతో నిరాశ కలిగించినా కానీ 'ఓకే బంగారం'తో నవీన యువత ప్రేమ భావాలని, వారి ఆలోచనల్ని, వారి కన్‌ఫ్యూజన్‌ని అద్భుతంగా చూపించి రొమాన్స్ జోనర్‌కి తాను కింగ్ అని ఇంకోసారి చాటుకున్నారు.
ఆయన రూపొందించిన ప్రేమకథ కనుక 'చెలియా' నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్లు వుంటాయి. కానీ ఈ చిత్రంలో మణిరత్నం ముద్రని వెతుక్కోవాల్సి వస్తుంది. 'నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను' అంటూ కోపంతో ప్రేమని తొలిసారిగా వ్యక్తపరిచే ప్రియుడిలో, ఏళ్ల తర్వాత మళ్లీ చెలియకి ఎదురు పడినప్పుడు ఆమె తనపై పెంచుకున్న ప్రేమ తాలూకు ఆనవాలు చూపించినపుడు అతని కళ్లల్లో కనిపించే తడిలో మణిరత్నం ముద్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతవరకు విసిగించిన ప్రేమకథతోను పతాక సన్నివేశంలో అలా ఒక్కసారి మనసు మెలిపెట్టి వదలడం బహుశా మణిరత్నం ఒక్కరికే సాధ్యపడుతుంది. ఇంత చక్కగా ప్రేమని రెండు సన్నివేశాల్లో ఆవిష్కరించిన ఆయనే మిగతా సినిమా అంతటా ఎందుకంతటి విసుగు, నస నింపారో అర్థం కాదు.
కార్గిల్ యుద్ధానికి వెళ్లిన హీరో పాకిస్తానీ సైన్యానికి చిక్కి యుద్ధ ఖైదీ అవుతాడు. ఆ సమయంలో తనకి రేపు అనేది వుందో లేదో తెలియక నిన్నటి స్మృతులని నెమరు వేసుకుంటాడు. చపల చిత్తం, క్షణికావేశం, పురుషాహంకారం వున్న ఒక ఇమ్‌పర్‌ఫెక్ట్ క్యారెక్టర్ హీరోది. అతనితో ఒక సౌమ్యురాలు, ఆత్మాభిమానం వున్న యువతి ప్రేమలో పడుతుంది. ఇద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్‌కి అతని క్యారెక్టర్ దారి తీస్తుంది. దూరాన్ని పెంచుతుంది. ఆమెకి, ప్రపంచానికి పూర్తిగా దూరమైనపుడు కానీ అతనికి జీవితం విలువ తెలిసిరాదు, అతనేం కోల్పోయాడో తెలుసుకోడు. సింపుల్‌గా చెప్పుకుంటే ఇదీ కథ.
అయితే ఈ కథని డైరెక్టుగా చెప్పకుండా, పాత్రల నేపథ్యం పూర్తిగా చూపించకుండా కన్‌ఫ్యూజింగ్ ధోరణికి పోవడం వల్ల, మాట్లాడుకునే మాటల్లో సైతం క్లారిటీ లోపించడం వల్ల ఎక్కడా ఆ పాత్రలతో కనక్ట్ ఏర్పడదు. వారు మాట్లాడుకునే దాంట్లో కానీ, వారి ప్రేమలో కానీ కదిలించే శక్తి వుండదు. 'అరెరె ఈ జంట విడిపోయిందే, ఎలాగైనా మళ్లీ కలవాలి' అనే భావన ప్రేక్షకుడిలో కలిగించని పక్షంలో ఇలాంటి ప్రేమకథ సక్సెస్ అవదు. దురదృష్టవశాత్తూ చెలియా విషయంలో అదే జరిగింది. సాంకేతిక విప్లవంతో మనుషుల స్వభావాల్లో మార్పులొచ్చి వుండొచ్చు కానీ బేసిక్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమీ మారవు. కానీ ఎమోషన్స్‌ని కూడా అడ్వాన్స్‌డ్‌గానే చూపించాలని, రొమాన్స్‌లోను మెచ్యూరిటీ లెవల్స్ చూపించాలని ట్రై చేస్తే ఇలాగే అవుతుంది.
వీరి నేపథ్యం చెప్పడానికా అన్నట్టు హీరో ఫ్యామిలీతో ఒక సీన్, హీరోయిన్ ఫ్యామిలీతో మరో సీన్ వుంటాయి. ఆ రెండు సీన్లు చూస్తుంటే అసలు వారేమి మాట్లాడుతున్నారో, ఎందుకలా రియాక్ట్ అవుతున్నారో కూడా అర్థం కాదు. వెనక ఏం జరిగిందనేది చెప్పం, ఈతరం ప్రేక్షకులు కనుక ఏం జరిగి వుంటుందనేది మీరే ఊహించుకోండన్న తీరున కొన్ని సన్నివేశాలని తీర్చిదిద్దారు. సంభాషణలు కూడా బుకిష్‌గా వున్నాయి. ఆ గ్రాంథిక తెలుగుని అర్థం చేసుకోవడం ఇప్పటి ఇంగ్లీష్ మీడియం పిల్లల వల్లవుతుందని అనుకోను. ఇద్దరి మనోభావాలు వ్యక్తం చేసుకుంటోన్న సందర్భంలో వారేం మాట్లాడుకుంటున్నారనేది అర్థమైతేనే కదా ఎవరైనా కనక్ట్ కాగలిగేది. తమిళంలో ఎలా ఉందో కానీ తెలుగుకి అనువదించినపుడు ఇక్కడి వారి సహజ భాషకి దగ్గరగా అనువాదం వుండేట్టు జాగ్రత్త పడాలి. హీరో తన్మయత్వంతో కవిత్వం చెబుతుంటే అది ఆంధ్రమా, అరవమా అని అర్థం కానపుడు ఆ కవిత వల్ల ఏంటి ఉపయోగం?
హీరో క్యారెక్టర్ మూడ్ స్వింగ్స్‌ని, అతనిలోని ఇమ్‌పర్‌ఫర్‌ఫెక్షన్స్‌ని చూపిస్తూ, అతను కరక్ట్ కాదని తెలిసినప్పటికీ అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన అమ్మాయి ఎమోషన్స్‌ని హైలైట్ చేస్తూ ఒక చక్కని ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దే స్కోప్ ఉన్న కథే. కానీ దానిని కన్‌ఫ్యూజింగ్‌గా మార్చేసి, అవసరం లేని హై ఫై లక్షణాలు ఆపాదించి సగటు ప్రేక్షకుడికి అసలు కనక్ట్ కాకుండా చేసేసారు. హీరోని పాకిస్తాన్‌లో బంధించినపుడు అతను మళ్లీ తిరిగొచ్చి హీరోయిన్‌ని కలుసుకోవాలని ఆరాటపడేట్టు చేయాలి కానీ, అతను అక్కడ బందీగానే వుంటే ఈమె హ్యాపీగా వుంటుందనిపించేట్టు చేస్తే ఇక ఆ ప్రేమకథ ఏ విధంగా మనసులు గెలుస్తుంది? కనీసం ఆమె కోసం అతను ఆరాట పడుతూ, తన తప్పు తెలుసుకుని దగ్గరవ్వాలని చూస్తోన్న సమయంలో అనుకోకుండా వెళ్లి బందీ అయిపోతే, అప్పుడైనా వారి కలయిక కోసం మనం ఆరాటపడే ఆస్కారముంటుంది. పాకిస్తాన్‌లో యుద్ధ ఖైదీగా వున్న హీరో అక్కడ్నుంచి తప్పించుకుని వచ్చేది అయినా ఉత్కంఠభరితంగా ఉన్నట్టయితే అంతో ఇంతో పైసా వసూల్ అనిపించేదేమో. కనీసం ఆ పార్ట్ మీద కూడా మణిరత్నం ప్రత్యేక దృష్టి పెట్టలేదు.
కథ, కథనాల పరంగా 'చెలియా' పూర్తిగా ఫెయిలైంది. కానీ విజువల్‌గా మాత్రం కళ్లు చెదిరే దృశ్యాలతో ఇంత క్వాలిటీ మణిరత్నం వల్లే అవుతుందనిపించేలా చేస్తుంది. మంచుతో కప్పేసిన కారు అద్దాలని వైపర్‌తో క్లీన్ చేసే షాట్ 'వారెవా' అనిపించక మానదు. సినిమాటోగ్రఫీకి పాఠ్యగ్రంధంలా పనికొచ్చే విధంగా రవివర్మన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం కథలో భాగమై సాగుతుంది. ఫ్రేమింగ్స్‌లో, నటీనటుల నుంచి తనకి కావాల్సిన అవుట్‌పుట్ రాబట్టుకోవడంలో మణిరత్నం గ్రేట్‌నెస్ ప్రస్ఫుటమవుతుంది. కార్తీకి నటుడిగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. చక్కని అభినయంతో అతను, అదితి ఇద్దరూ ఆకట్టుకున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదరడం 'చెలియా'ని చివరంటా భరించేట్టు చేసింది.
విసిగించే కథ, కథనాలు, అర్థం కాని సంభాషణలు, స్పష్టత లేని సన్నివేశాలు థియేటర్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపిస్తూ వుంటే, కళ్లు చెదిరే లొకేషన్లు, విజువల్స్, సినిమాటోగ్రఫీ తెరపై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అయితే అల్టిమేట్‌గా విజువల్స్ చూడ్డానికి కాదుగా థియేటర్లకి వెళ్లేది. కథ, కథనం నిరాశ పరిచినపుడు విజువల్‌గా ఎంత ఉన్నతంగా వున్నా, టెక్నికల్‌గా ఎంత ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కినా సంతృప్తి ఎలా వస్తుంది?
బాటమ్ లైన్: విసిగించే చెలి!
– గణేష్ రావూరి