సినిమా రివ్యూ: డైనమైట్‌

రివ్యూ: డైనమైట్‌ రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తారాగణం: విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రవీణ్‌, హర్ష తదితరులు సంగీతం: అచ్చు కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌…

రివ్యూ: డైనమైట్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
తారాగణం: విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రవీణ్‌, హర్ష తదితరులు
సంగీతం: అచ్చు
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
పోరాటాలు: విజయన్‌
ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల
నిర్మాత: విష్ణు మంచు
కథనం,దర్శకత్వం: దేవా కట్టా
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 4, 2015

 

పర భాషలో విజయవంతమైన ప్రతి కథ మళ్లీ ఇక్కడ అదే ఫలితాన్ని పొందుతుందనే గ్యారెంటీ లేదు. రీమేక్‌లు చేసేటపుడు ఆ చిత్రం విజయం సాధించడానికి కారణాలేంటనేది కూడా విశ్లేషించుకోవాలి. ఒక హిట్‌ సినిమాని రీమేక్‌ చేసేటపుడు దానికి మార్పులు చేయడం తగదనేది సినీ పరిశ్రమలో థంబ్‌ రూల్‌. కేవలం నేటివిటీ పరమైన మార్పులు మినహా ఎక్కువగా కథని, దానిని తీసిన విధానాన్ని మార్చడానికి ఎవరూ సాహసించరు. శంకర్‌లాంటి దర్శకుడు 'త్రీ ఇడియట్స్‌' రీమేక్‌ చేసినపుడు ఆ పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌కి కట్టుబడి యథాతథంగా తీసేశాడు తప్ప తన బ్రాండ్‌ వేయాలని చూడలేదు. 'దబంగ్‌'లాంటి బ్లాక్‌బస్టర్‌ని బ్లయిండ్‌గా రీమేక్‌ చేసేయకుండా హరీష్‌ శంకర్‌ ఆ కథలో చాలా మార్పులు చేసి విజయం సాధించాడు. పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌ అయితే దానిని డిస్టర్బ్‌ చేయకపోవడం ఒక పద్ధతైతే, ఎంతటి విజయం సాధించిన చిత్రమైనా పర్‌ఫెక్ట్‌గా లేదనిపిస్తే దానికి తగిన మార్పులు చేసుకోవడం కొందరి శైలి.

ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చేసిన మార్పులు సదరు సినిమాని బెటర్‌గా మార్చాలి కానీ దానికున్న బలాల్ని తగ్గించకూడదు. అలా చేయలేనపుడు ఫెయిత్‌ఫుల్‌ రీమేక్‌ చేసుకోవడమే ఉత్తమం కానీ దానికి కొత్త హంగులు అద్దడం అనవసరం. ఒక పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌ వర్సెస్‌ ఒక సగటు యువకుడి మధ్య సంఘర్షణ 'అరిమనంబి'ని ఎక్సయిటింగ్‌గా మార్చింది. పవర్‌ని చేతిలో ఉంచుకున్న రాజకీయ నాయకుడు తను చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవడం కోసం అడ్డు తగిలిన సామాన్యుల్ని చంపేస్తుంటే దానికి అడ్డు తగులుతాడు కథానాయకుడు. కాకపోతే అంతటి పవర్‌ఫుల్‌ నాయకుడిని ఎదుర్కొనే దీరోధాత్త లక్షణాలు లేని అతి సామాన్యుడు కావడంతో అతనిపై సింపతీ కలుగుతుంది. అతని విజయంలో ప్రేక్షకులకి సంతృప్తి దక్కుతుంది. ఈ చిన్న లాజిక్‌ని మిస్‌ అయి.. 'డైనమైట్‌'లో హీరోని చాలా బలవంతుడిలా చూపించారు. విపరీతంగా కండలు పెంచి, ఎంత మంది వచ్చినా ఎదిరించే సత్తా వున్న కథానాయకుడికి మినిస్టర్‌ ఒక లెక్క కాదు. 

అంతిమంగా అతడిని విలన్‌ ఏమీ చేయలేడనే సంగతి అర్థమైనపుడు ఇక ఎక్సయిట్‌మెంట్‌కి తావు లేదు. విచిత్రమేంటంటే యాక్షన్‌ రూట్‌ ఎంచుకున్నాక కూడా అరిమనంబిలోని మైండ్‌ గేమ్స్‌ని యాజిటీజ్‌గా ఫాలో అయ్యారు. ప్లాట్‌ ఒక్కటీ మాత్రమే తీసుకుని పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమాగా అయినా మలచి ఉండాల్సింది లేదా మార్పుల్లేకుండా ఒరిజినల్‌ని ఫాలో అయి ఉండాల్సింది. రెండిటినీ మిక్స్‌ చేయడంతో డైనమైట్‌ పేలకుండా తుస్సుమనేసింది. ఎమోషన్స్‌తో అలరించే దేవా కట్టా ఈ చిత్రానికి తనదైన టచ్‌ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. మరో ఇబ్బందికర అంశం ఏమిటంటే… రీమేక్‌ పేరు చెప్పి జెడి చక్రవర్తి సీన్లని యథాతథంగా తమిళం నుంచి అనువదించేశారు. అంతే కాదు ఒక ఐటెమ్‌ సాంగ్‌ని కూడా తమిళం నుంచి కట్‌, పేస్ట్‌ చేసేశారు. 

విష్ణు యాక్షన్‌ హీరోగా మెప్పించాడు. ఫైట్‌ సీన్స్‌ అన్నీ బాగా వచ్చాయి. డాన్సుల్లోను విష్ణు రాణించాడు. తనవరకు ఈ చిత్రానికి చేయగలిగింది చేశాడు. కాకపోతే తన పాత్ర చిత్రణ విషయంలో దర్శకుడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అసలు కథ గాడి తప్పింది. ప్రణీత తన పరిధుల్లో బాగానే చేసింది. జె.డి. చక్రవర్తికి ఎందుకు ఎక్కువ ఆఫర్లు రావో అర్థం కాదు. తను చేసిన ప్రతి సినిమాతోను మెప్పించినా కానీ చక్రవర్తికి అవకాశాలు రాకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. ఫైట్‌ సీన్స్‌ బాగా తీసారు. ఇవి తప్పిస్తే సాంకేతికంగా కూడా డైనమైట్‌ మెప్పించలేకపోయింది. 

సినిమాలో సస్పెన్స్‌ ఎలిమెంట్‌ ఎటెన్షన్‌ని రాబట్టుకున్నా, కొన్ని సీన్స్‌ థ్రిల్‌ చేసినా కానీ ఆద్యంతం ఉత్కంఠ రేపాల్సిన చిత్రం బలహీనమైన కథనం వల్ల, కథకి సూట్‌ కాని మార్పు చేర్పుల వల్ల ఎక్కడికక్కడ తేలిపోతూ వచ్చింది. రొటీన్‌ ఎంటర్‌టైనర్లకి భిన్నంగా ఉందనే ప్లస్‌ పాయింట్‌ తప్పిస్తే ఇందులో మెచ్చుకోతగ్గ అంశాలేం లేకుండా పోయాయి. ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి తగిన సరంజామా ఉండి కూడా డైనమైట్‌ పేలలేకపోయింది. 

బోటమ్‌ లైన్‌: పేలని 'డైనమైట్‌'!