రివ్యూ: జక్కన్న
రేటింగ్: 2/5
బ్యానర్: ఆర్‌పిఏ క్రియేషన్స్
తారాగణం: సునీల్, మన్నర చోప్రా, కబీర్ దుహన్ సింగ్, సత్యప్రకాష్, పృధ్వీ, సప్తగిరి, కారుమంచి రఘు, సత్య, నాగినీడు, చిత్రం శ్రీను, పోసాని కృష్ణమురళి తదితరులు
మాటలు: భవాని ప్రసాద్
సంగీతం: దినేష్
కూర్పు: ఎం.ఆర్. వర్మ
ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్
నిర్మాత: ఆర్. సుదర్శన్ రెడ్డి
కథ, కథనం, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
విడుదల తేదీ: జులై 29, 2016
సగటు హీరో పాత్ర చేయలేదని, ఇందులో కామెడీనే చేసానని సునీల్ పదే పదే చెప్పుకొచ్చాడు. కానీ 'జక్కన్న'తో కూడా సునీల్ 'హీరో' అవుదామనే చూసాడు. బిల్డప్ షాట్స్, భారీ యాక్షన్ సీన్స్, రొమాన్స్, ఫారిన్ సాంగ్స్… ఏదీ మిస్ అవకుండా చూసుకున్నాడు. కామెడీ చేయడానికి, చేస్తున్నానని అనుకోవడానికి చాలా తేడా ఉంది. అంత పెద్ద కమెడియన్ అయిన సునీల్‌కి ఈ చిన్న డిఫరెన్స్ తెలీకపోవడం శోచనీయం. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా హీరో బిహేవ్ చేస్తుంటే చూడ్డానికి పద్ధతిగా ఉంటుంది. డిజైనర్ డ్రస్సులేసుకుని, 'నువ్వు నాకు నచ్చావ్'లో తనే చేసిన 'బంతి' క్యారెక్టర్ మాడ్యులేషన్‌లో మాట్లాడుతుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది.
ఎనభై, తొంభై దశకాల్లో చిరంజీవి తరహా మాస్ ఎంటర్‌టైనర్స్ చేద్దామని సునీల్ ట్రై చేస్తున్నాడనేది క్లియర్‌గా కనిపిస్తోంది. సునీల్ 'చిరంజీవి'లా ఫీలవ్వవచ్చా, లేదా అన్నది పక్కన పెడితే అసలు ఆ టైమ్‌లో చిరంజీవి ఎలాంటి పాత్రలు వేసారో, ఆ పాత్రల్లో ఏ విధంగా ఇమిడిపోయారో మాత్రం సునీల్ గ్రహించడం లేదు. పాత్రకి తగ్గ ఆహార్యం, వాచకం అనేది తప్పనిసరి. షేడ్స్ పెట్టుకుని, డిజైనర్ బట్టలేసుకుని హీరోలా కనిపించాలని గట్టిగా తపన పడుతూ, తననుంచి కామెడీ ఆశిస్తున్నారు కాబట్టి డైలాగుల్ని మాత్రం తన మార్కు యాసలో చెబుతోంటే సింక్రనైజేషన్ కుదరక వినోదం అటుంచి విరక్తి వచ్చేస్తోంది.
సునీల్ ముందుగా ఆత్మ పరిశీలన చేసుకుని తనేం కావాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి. అదే కావాలనుకుంటే జనం చూస్తారా, చూడరా అన్నది వదిలేసి తనకి నచ్చింది చేసుకుంటూ పోవాలి. నచ్చితే చూస్తారు, లేదా తిరస్కరిస్తారు. అంతే కానీ తనకేమో ఒకలా కనిపించాలని ఉంటుంది, జనాలకి తనని ఇంకోలా చూడాలని ఉంటుంది కనుక అవి రెండూ కలిపి చేసేద్దామనుకుంటే కుదరదు. సునీల్ ఈమధ్య చేస్తోన్న చిత్రాల్లో కామెడీ ఉండడం లేదనే విమర్శని సీరియస్‌గా తీసుకుని ఇందులో కామెడీ దట్టించారు. అయితే అందులో నవ్వించే పాళ్లు తక్కువ, నవ్వుల పాలయ్యే సీన్లు ఎక్కువ అయిపోవడంతో 'జక్కన్న' ప్రేక్షకులని యమ యాతన పెట్టాడు.
తనకి సాయం చేసిన వారి జీవితాలతో వ్యవసాయం చేసేస్తాను అంటూ తనకి హెల్ప్ చేసిన వారికి అంతకు పదింతలు చేసేవరకు ఊరుకోడు జక్కన్న (సునీల్). ఈ పాయింట్‌తోనే అల్లుకున్న కథలో కామెడీ పండించడానికి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కుంగ్‌ఫూ స్కూల్ అంటూ సప్తగిరితో చేయించిన కామెడీ ఏమాత్రం పేలలేదు. సునీల్, మన్నర మధ్య లవ్ ట్రాక్ టార్చర్‌కి నిర్వచనంలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత సగం సినిమా అయిపోయిందని ఆనందించాలో, ఇంకో సగం ఉందని భయపడాలో అర్థం కానంతగా ప్రథమార్ధం అసహనానికి అర్థం చెబుతుంది. ముందుగా 'రక్ష' అనే హారర్ సినిమా తీసిన ఈ దర్శకుడు దాంతో కూడా ఈ స్థాయిలో భయపెట్టలేదు.
Watch Jakkanna Movie Public Talk
అయితే సెకండాఫ్ కాస్త బెటర్‌గానే ఉంది. కొన్ని కామెడీ సీన్లు, డైలాగులు పండాయి. అయితే ఆ కాసిని నవ్వుల కోసం మిగతా 'రంపపుకోత' భరించడం మాత్రం చాలా మంది వల్ల అవదు. కామెడీతో ఈ కథని డీల్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆకట్టుకుని ఉండేది. కానీ సునీల్ అవకాశం దొరికినప్పుడల్లా ఫారిన్‌లో డ్యూయెట్, ఒక పెద్ద ఫైట్ వేసుకుంటూ తన సరదా తీర్చుకుంటూ దీనిని కమర్షియల్ మసాలాగా మార్చేసాడు. తను హీరోగా నటించిన సినిమాల్లో హిట్టయిన వాటిని చూసయినా సునీల్ తనకి ఎలాంటి తరహా పాత్రలు, సినిమాలు బాగుంటాయనేది గ్రహించకపోవడం విడ్డూరమే అనుకోవాలి.
మన్నర చోప్రాకి నటన రాదు, గ్లామర్ లేదు. కబీర్ సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఇప్పటికే చాలా సినిమాలు చేసేసాడు. సత్యప్రకాష్, నాగినీడు గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. సప్తగిరి సెకండాఫ్‌లో చేసిన 'భలే భలే మగాడివోయ్' స్పూఫ్ మాస్‌ని ఆకట్టుకోవచ్చు. పృధ్వీ అదే పనిగా బాలయ్యని ఇమిటేట్ చేస్తూ తన టాలెంట్‌ని, టైమింగ్‌ని వృధా చేసుకుంటున్నాడు. పాటలు తప్పనిసరి అనుకున్నప్పుడు వినడానికి బాగుండేలా కేర్ తీసుకుంటే ప్రేక్షకులకి సాయం చేసినట్టుంటుంది. ప్రాసతో ప్రాణాలు తోడేయడం అంటే ఏంటో డైలాగ్ రైటర్ చేసి చూపించాడు. నిర్మాణ పరంగా క్వాలిటీ మిస్ కాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.
రొటీన్ సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలుండగా, ఇలాంటి సినిమాలు చేస్తున్నారని స్టార్ హీరోలనే ప్రేక్షకులు తిరస్కరిస్తుండగా, ఈ టైపు కథలు చేయకూడదని పెద్ద హీరోలే కొత్తదనం కోసం చూస్తుండగా… ఇవే సినిమాలతో 'హీరో'గా రేంజ్ పెంచుకుందామని, కమర్షియల్ హీరోగా సెటిల్ అయిపోదామని సునీల్ ఎలా నమ్ముతున్నాడో కానీ, తనకి సూటయ్యే కథలు ఎంచుకుని, ఈ హంగుల మీద మోజు తగ్గించుకుంటే, నిఖార్సయిన కామెడీ హిట్ కొట్టే టాలెంటు, మార్కెట్టు సునీల్‌కి పుష్కలంగా ఉంది.
బోటమ్ లైన్: మామూలు 'చెక్కుడు' కాదన్నా!
– గణేష్ రావూరి