cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మసాలా

సినిమా రివ్యూ: మసాలా

రివ్యూ: మసాలా
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి., స్రవంతి మూవీస్‌
తారాగణం: వెంకటేష్‌, రామ్‌, అంజలి, షాజాన్‌, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, కోవై సరళ, పోసాని కృష్ణమురళి తదితరులు
మాటలు: అనిల్‌ రావిపూడి
సంగీతం: తమన్‌
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: ఆండ్రూ
నిర్మాతలు: సురేష్‌బాబు, రవికిషోర్‌
కథనం, దర్శకత్వం: కె. విజయ భాస్కర్‌
విడుదల తేదీ: నవంబర్‌ 14, 2013

బాలీవుడ్‌లో సౌత్‌ మసాలా రూల్‌ చేస్తున్న ట్రెండ్‌లో వచ్చిన ‘బోల్‌బచ్చన్‌’ అక్కడ మంచి విజయాన్ని సాధించింది. అభిషేక్‌బచ్చన్‌కి తొలిసారి వంద కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించిపెట్టిన ఆ చిత్రాన్ని మసాలా సినిమాలకి పెట్టింది పేరయిన రోహిత్‌ శెట్టి డైరెక్ట్‌ చేశాడు. అజయ్‌ దేవ్‌గణ్‌, అభిషేక్‌బచ్చన్‌ చేసిన ఆ కామెడీ సినిమాని తెలుగులో వెంకటేష్‌, రామ్‌తో విజయభాస్కర్‌ డైరెక్షన్‌లో రీమేక్‌ చేశారు. ‘బుర్ర బీరువాలో పెట్టి నా సినిమాకి రండి’ అనేది రోహిత్‌ శెట్టి పాలసీ. ఈ ‘మసాలా’ ఎంజాయ్‌ చేయాలంటే ముందుగా బ్రెయిన్స్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి పెట్టుకోవాలి. తెర మీది పాత్రలకి బొత్తిగా బుర్ర లేదా అనే డౌట్‌ వస్తే ఇక ఇలాంటి ‘బుర్ర తక్కువ’ కామెడీలని (మైండ్‌లెస్‌ కామెడీ అంటున్నామండీ... స్వచ్ఛమైన తెలుగులో చెప్తే తిడుతున్నట్టుంది కదూ!) ఎంజాయ్‌ చేయడం కష్టం. 

కథేంటి?

ఉద్యోగం పోగొట్టుకుని, కోర్టు కేసులో ఉన్న ఇల్లుని కూడా పోగొట్టుకున్న రెహమాన్‌ (రామ్‌), తన అక్క సానియాని (అంజలి) తీసుకుని భీమరాజుపాలెంలోని ఓ ఆసామి అయిన బలరామ్‌ (వెంకటేష్‌) దగ్గరకి పనికోసం వస్తాడు. అయితే బలరామ్‌ని కలుసుకునే ముందే, ఒక సంఘటనలో మూసేసి ఉన్న గుడి తలుపులు తెరుస్తాడు రెహమాన్‌. అతను ముస్లిమ్‌ అని తెలిస్తే గొడవలు అయిపోతాయని రెహమాన్‌ స్నేహితుడు (అలీ) అతడిని ‘రామ్‌’గా బలరామ్‌కి పరిచయం చేస్తాడు. ఆ అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి వందల కొద్దీ అబద్ధాలు ఆడుతూ పోతాడు రామ్‌. అబద్ధం ఆడే వాళ్లని అస్సలు సహించని బలరామ్‌కి దొరక్కుండా రామ్‌, అతని బృందం ఎంతకాలం నిజం దాస్తుందనేదే ‘మసాలా’. 

కళాకారుల పనితీరు!

వెంకటేష్‌ కామెడీ టైమింగ్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది. నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాల్లో సున్నితమైన హాస్యంతో నవ్వులు పూయించిన వెంకటేష్‌ ‘మసాలా’లో లౌడ్‌ కామెడీ ట్రై చేశారు. కొన్ని సందర్భాల్లో ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్లినా కానీ, బట్లర్‌ ఇంగ్లీష్‌ మాట్లాడుతూ బాగానే నవ్వించారు. చూడ్డానికి గంభీరంగా ఉన్నా, కామెడీ పండిరచే పాత్రకి వెంకటేష్‌ అతికినట్టు సరిపోయారు. ఆయన ఇటీవల నటించిన చిత్రాల్లో ఇదే బెస్ట్‌ లుక్‌ అని కూడా చెప్పొచ్చు.

రామ్‌ ఫస్టాఫ్‌లో పాసివ్‌గా ఉన్నా కానీ ద్వితీయార్థంలో తాను కూడా కామెడీ మోడ్‌లోకి వస్తాడు. గే క్యారెక్టర్‌లో రామ్‌ బాడీ లాంగ్వేజ్‌, అతని నటన బాగానే ఉంది. ఇలాంటి పాత్రలు పోషించడానికి హీరోలు కాస్త జంకుతారు కానీ రామ్‌ ధైర్యంగానే ఈ క్యారెక్టర్‌ చేసి తన వరకు ఈ సినిమాకి చేయగలిగింది చేశాడు. 

అంజలికి పెద్దగా నటించే స్కోప్‌ దక్కలేదు. ఆమె ముఖంలో ఎందుకో ఛార్మ్‌ తగ్గిపోతోంది. తమిళ డబ్బింగ్‌ సినిమాల్లో ఆమెలో కనిపించిన ఆ మృదుత్వం ఇప్పుడు మాయమై బాగా ముదురుగా కనిపిస్తోంది. షాజాన్‌ పదాంసీ ‘ఆరెంజ్‌’లో బాగుంది కానీ ఇప్పుడు మరీ పీలగా అయిపోయి ఆకట్టుకోలేకపోయింది. దానికి తోడు నటన కూడా సున్నా కావడం వల్ల షాజాన్‌ పూర్తిగా తేలిపోయింది. 

కోవై సరళ, జయప్రకాష్‌రెడ్డి కామెడీ సీన్లు మాస్‌ ఆడియన్స్‌కి నచ్చవచ్చు. అలీ, ఎమ్మెస్‌ నారాయణ కూడా సిట్యువేషనల్‌ కామెడీ పండిరచడానికి అప్పుడప్పుడూ ఉపయోగపడ్డారు. పోసాని కృష్ణమురళి క్యారెక్టర్‌లో స్టఫ్‌ లేదు. అతని విలనీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

వెంకటేష్‌కి రాసిన ఇంగ్లీష్‌ డైలాగ్స్‌లో కొన్ని నవ్విస్తాయి. చాలా వరకు హిందీ సినిమాలోని డైలాగుల్నే తర్జుమా చేశారు. తమన్‌ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. పాటలన్నీ ఇంటర్వెల్‌ బ్రేక్స్‌లా పని చేశాయి. నేపథ్య సంగీతం కూడా చాలా లౌడ్‌గా అనిపిస్తుంది. ఒక్కో సందర్భంలో డైలాగ్స్‌ వినిపించనంతగా తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ డామినేట్‌ చేసింది. హిందీలో అతుకుల బొంతలా ఉండే సినిమాని యథాతథంగా ఫాలో అయిపోవడం వల్ల ఎడిటింగ్‌ బాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాటల చిత్రీకరణలో కెమెరా పనితనం బాగుంది. రామ్‌ లక్ష్మణ్‌ హిందీ సినిమాని యథాతథంగా ఫాలో అయిపోయి అవే ఫైట్లు ఇక్కడా తీశారు. రోహిత్‌ శెట్టికి అలా మనుషుల్ని, సుమోల్ని, ఇతర వాహనాల్ని ఎగరేయడం సరదా. అతని సరదాకి తగ్గట్టు తీసుకున్న ఫైట్లని కూడా కాపీ కొట్టేయడం ఏమిటో అర్థం కాదు. 

త్రివిక్రమ్‌ సహచర్యంలో పని చేసినప్పుడు అద్భుతమైన కామెడీలు అందించిన విజయభాస్కర్‌ ఇప్పుడు పూర్తిగా తన తెలివితేటలు వాడడం మానేసినట్టున్నాడు. ఎంత రీమేక్‌ అయినా కానీ మక్కీకి మక్కీ తీయాల్సిన పని లేదు. ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ ప్రింట్‌ గుద్దేయడానికి ప్రత్యేకించి ఒక డైరెక్టర్‌ అవసరం లేదు. డివిడి పెట్టుకుని ఎవరైనా సరే కెమెరామెన్‌కి, ఇతర సాంకేతిక నిపుణులకి ఏమి చేయాలో చెప్తే చాలు. 

హైలైట్స్‌:

  •     వెంకటేష్‌ ‘ఇంగ్లీష్‌’ కామెడీ
  •     వెంకటేష్‌-రామ్‌ కాంబినేషన్‌
  •     కొన్ని కామెడీ సన్నివేశాలు

డ్రాబ్యాక్స్‌:

  •     మ్యూజిక్‌
  •     స్క్రీన్‌ప్లే
  •     క్లైమాక్స్‌

విశ్లేషణ: 

కన్‌ఫ్యూజన్‌ కామెడీ ప్రధానంగా గతంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఒక పాత్ర ఐడెంటిటీ దాచి పెట్టడం కోసం మరో క్యారెక్టర్‌ని సృష్టించడం, దానిని బేస్‌ చేసుకుని కామెడీ చేయడం కొత్త ఐడియా ఏమీ కాదు. ఇద్దరు పేరున్న హీరోలు అలాంటి కామెడీ సినిమాల్లో నటించడం ఇంతకుముందు జరగలేదు. ఆ విధంగా ‘మసాలా’ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇద్దరు హీరోలున్న సినిమా కాబట్టి తప్పకుండా ఆకర్షణ ఉంటుంది కనుక ‘మసాలా’కి కాంబినేషన్‌ పరంగా కలిసి వస్తుంది. 

అయితే ఇంత మంచి కాంబినేషన్‌ని పూర్తిగా వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హిందీ సినిమాని చూసి యాజిటీజ్‌గా కాపీ కొట్టడానికి మినహా విజయభాస్కర్‌ తన వంతుగా దీనికి మెరుగులు దిద్దే శ్రమ పడలేదు. ‘బోల్‌ బచ్చన్‌’ పర్‌ఫెక్ట్‌ ఫిలిం అయితే దానిని మక్కీకి మక్కీ కాపీ కొట్టినా అర్థముంది కానీ, అందులోనే చాలా లొసుగులు ఉన్నప్పుడు తిరిగి అవే తప్పుల్ని రిపీట్‌ చేయడం బాగోలేదు. ఉదాహరణకి అజయ్‌దేవ్‌గణ్‌కి నిజం తెలిసిన తర్వాత జరిగే తంతు అంతా ఆ సినిమాలో పిచ్చిపిచ్చిగా ఉంటుంది. ఇందులో కూడా దానిని అలాగే ఫాలో అయిపోయారు కానీ ఇంకాస్త బెటర్‌గా ఏమి చేయవచ్చుననేది అస్సలు ఆలోచించినట్టు లేరు. 

ఒక్క పాటలు తప్పించి మిగతా భాగమంతా కూడా ‘బోల్‌బచ్చన్‌’కి జిరాక్స్‌ కాపీ ఈ ‘మసాలా’. ఇంతోటి దానికి ‘స్క్రీన్‌ప్లే’ తనదేనని వేసుకునే హక్కు తనకెలా వచ్చిందో విజయభాస్కరే వివరణ ఇచ్చుకోవాలి. ‘బోల్‌బచ్చన్‌’ చూడకపోతే కనుక ఆ కన్‌ఫ్యూజన్‌ కామెడీతో వచ్చే సీన్లు ఎక్కువ ఎంజాయ్‌ చేయడానికి అవకాశముంది. ‘అమ్మ’ పాత్రని లింక్‌ చేస్తూ జరిగే సీన్స్‌ అన్నీ పండాయి. ఆ సీన్స్‌లో వెంకటేష్‌ పర్‌ఫార్మెన్స్‌, జయప్రకాష్‌రెడ్డి రియాక్షన్స్‌ నవ్విస్తాయి. బోల్‌బచ్చన్‌లో అజయ్‌దేవ్‌గణ్‌`అసిన్‌ ట్రాక్‌ని అండర్‌ డెవలప్డ్‌గా వదిలేశారు. ఇక్కడ వెంకటేష్‌-అంజలి ట్రాక్‌ని కూడా అలాగే అర్థం లేకుండా నడిపించారు. 

తెలుగు ప్రేక్షకులకి ఉండే సెన్సాఫ్‌ హ్యూమర్‌ బహుశా ఏ ఇతర భాషల ప్రేక్షకులకీ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన సినిమాల్లో ఉండే హై క్వాలిటీ కామెడీని మ్యాచ్‌ చేసే కామెడీ సీన్స్‌ ఇతర భాషల్లో చాలా అరుదుగా వస్తుంటాయి. మన బెస్ట్‌ కామెడీ సీన్స్‌ని కూడా రీమేక్స్‌లో చెడగొట్టిన సందర్భాలు, వాటిని కూడా అక్కడి వారు ఎంజాయ్‌ చేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అయితే విజయభాస్కర్‌ తెలుగు ప్రేక్షకుల హాస్యాభిరుచికి తగ్గ క్వాలిటీ కామెడీని రూపొందించడంలో ఫెయిలయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్‌కి ఏమాత్రం మార్పు చేర్పులు చేయనని మొండికేయడం వల్ల ‘బోల్‌బచ్చన్‌’కి కూడా ఇన్‌ఫీరియర్‌గా అనిపిస్తుందీ మసాలా. 

కాస్త కామెడీ ఉంటే కాలక్షేపం అయిపోతుందనుకునే వారు ‘మసాలా’తో సంతృప్తి పొందవచ్చు. క్వాలిటీ కామెడీ కోరుకునే వారు డిజప్పాయింట్‌ అయితే అంతో ఇంతో వెంకటేష్‌ శాటిస్‌ఫై చేస్తాడు. కంటెంట్‌ పరంగా స్ట్రిక్ట్‌లీ యావరేజ్‌ సినిమా అయిన మసాలా కమర్షియల్‌గా ఏ రేంజ్‌కి చేరుతుందనేది చూడాలిక. 

బోటమ్‌ లైన్‌:    ఘాటు తగ్గిన బాలీవుడ్‌ ‘మసాలా’!

-  గణేష్‌ రావూరి

ganeshravuri@greatandhra.com

twitter.com/ganeshravuri

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×