cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఓకే బంగారం

సినిమా రివ్యూ: ఓకే బంగారం

రివ్యూ: ఓకే బంగారం
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాష్‌ రాజ్‌, లీలా సామ్‌సన్‌ తదితరులు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
మాటలు: కిరణ్‌
సంగీతం: ఏ.ఆర్‌. రహమాన్‌
కూర్పు: ఏ. శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరామ్‌
నిర్మాతలు: రాజు, మణిరత్నం
కథ, కథనం, దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: ఏప్రిల్‌ 17, 2015

ప్రేమకథలు తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన మణిరత్నం చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఒక లవ్‌స్టోరీ తీసారు. ఈతరం ప్రేక్షకులకి కనెక్ట్‌ అయ్యేలా లవ్‌స్టోరీ తీయడమంటే వారి ఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు, భావోద్వేగాలకి తగ్గట్టు అప్‌డేట్‌ అవ్వాలి. మణిరత్నం ఈ విషయంలో ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉంటారనే దానికి ఈ చిత్రం ఒక చక్కని ఉదాహరణ. కేవలం సినిమాని తెరకెక్కించే విషయంలో టెక్నాలజీ పరంగానే కాదు... ఈ జనరేషన్‌ని స్టడీ చేయడంలో కూడా తాను అప్‌ టు డేట్‌గానే ఉన్నానని ఆయన ఇంకోసారి నిరూపించుకున్నారు. 

ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం అన్వేషిస్తూ, వివిధ జోనర్‌ సినిమాలని రూపొందించే అలవాటున్న మణిరత్నం ప్రత్యేకించి ప్రేమకథలని డీల్‌ చేయడంలో ఎక్స్‌పర్ట్‌. ఆయన తీసిన ప్రేమకథలు కానీ... ఆయన చేసిన ఇతర జోనర్‌ సినిమాల్లోని ప్రేమ సన్నివేశాలు కానీ ఎప్పుడూ ఫెయిలవలేదు. నేచురల్‌ ఎమోషన్స్‌ క్యాప్చర్‌ చేయడంలో తనకున్న నేర్పుని ఆయన ఈ చిత్రానికి ప్రధాన ఆయుధంగా మలచుకున్నారు. ఎందుకంటే ‘ఓకే బంగారం’లో చెప్పుకోడానికి పెద్దగా కథంటూ లేదు. పెళ్లి తమ జీవితానికి ప్రతిబంధకం అవుతుందని భావించే ఇద్దరు యువతీ యువకులు (ఆదిత్య, తార - దుల్కర్‌, నిత్య) ప్రేమలో పడతారు. పెళ్లి, పిల్లలు వంటివి అస్సలొద్దు... కలిసున్నంత కాలం కలిసి ఉందాం, తర్వాత ఎవరి కెరీర్‌ కోసం వాళ్లం విదేశాలకి వెళ్లిపోదాం అనేసుకుంటారు. ‘సహజీవనం’ చేస్తూ గడిపేస్తున్న ఈ ఇద్దరికీ అసలు ప్రేమంటే ఏంటనేది ఎలా తెలుస్తుంది? పెళ్లి తప్పనిసరి అని ఎందుకు అనిపిస్తుంది? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. 

ఇద్దరి పరిచయం ఎంత సింపుల్‌గా జరిగిపోతుందో, వారు ప్రేమలో పడడం, సహజీవనం చేద్దామనే పెద్ద నిర్ణయం తీసుకోవడం లాంటివన్నీ పెద్ద సీన్‌ చేయకుండా అంతే సింపుల్‌గా చూపించారు. మణిరత్నంలోని గొప్ప దర్శకుడు ఈ సినిమాలో అణువణువునా కనిపిస్తారు. ప్రేమకథ ఏదైనా వర్కవుట్‌ కావడానికి ప్రధానంగా కావాల్సింది హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదరడం. అది కుదరనప్పుడు ఏ సన్నివేశాన్ని రక్తి కట్టించడం కుదరదు. ఈ చిత్రానికి హీరో హీరోయిన్లుగా దుల్కర్‌, నిత్యని ఎంచుకోవడంలోనే మణిరత్నం సగం సక్సెస్‌ అయిపోయారు. ఇద్దరూ ఎంత మంచి నటులంటే బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా కెమెరాని వాళ్ల ముఖాలపై జూమ్‌ చేసి ఉంచి... వాళ్ల ఫీలింగ్స్‌, ఎమోషన్స్‌ క్యాప్చర్‌ చేస్తే చాలు... అందమైన సినిమా తయారైపోయేంత ఎక్స్‌ప్రెసివ్‌ అండ్‌ ఇంప్రెసివ్‌ అన్నమాట. వాళ్లిద్దరూ కథే లేని, అప్పుడప్పుడూ ఎటూ కదలని ఈ చిత్రాన్ని ఒక్కటై నడిపించేసారు. వారిద్దరి కెమిస్ట్రీ, పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి అతి పెద్ద ఎస్సెట్‌. దానిని అద్భుతంగా తన కెమెరాలో బంధించిన పి.సి. శ్రీరామ్‌ దర్శకుడికి కుడిభుజమైతే, తన సంగీతంతో ఈ ప్రేమకథకి ప్రాణం పోసిన ఏ.ఆర్‌. రహమాన్‌ ఈ చిత్రానికి సోల్‌ అయిపోయాడు. 

అన్ని క్రాఫ్టులు గొప్ప అవుట్‌పుట్‌నిస్తే, అందరూ సూపర్‌ సింక్‌లో ఉంటే రిజల్ట్‌ ఎంత సూపర్బ్‌గా ఉంటుందనే దానికి ‘ఓకే బంగారం’ వండర్‌ఫుల్‌ ఎగ్జాంపుల్‌. ప్రేక్షకుడిని ఆకర్షించడానికి విదేశీ హంగులు, రంగులు ఉండాలని కోట్లకి కోట్లు కరిగించేస్తున్న వారికి ఇందులోని ‘మాయేదో చెయ్యవా’ సాంగ్‌ చూపించాలి. ఒక పాత లాడ్జి రూమ్‌లో ఒక అద్భుతమైన సాంగ్‌ని కనువిందుగా చూపించవచ్చని చేసి చూపించారు. 

ఈ చిత్రానికి సంబంధించి మరో గొప్ప అంశం ఏమిటంటే... ఎమోషన్స్‌ ఉన్నా కానీ అవెక్కడా డామినేట్‌ చేయవు. ఒకరంటే ఒకరికి విడిపోలేనంత ప్రేమ ఉన్నా కానీ ఎక్కడా దానిని బలంగా ఎక్స్‌ప్రెస్‌ చేసుకోరు. రెండు రోజులు ఆది కనిపించకుండా పోతే తార అల్లాడిపోతుంది. తనని తార తల్లి రెండు రోజులు అరెస్ట్‌ చేయిస్తే, అది తనకి తెలిస్తే బాధ పడుతుందని ఆ సంగతిని అతను దాచేస్తాడు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందనేది వారి చేతల్లో మనకి తెలుస్తూనే ఉంటుంది. అయితే దానిని వారంతట వారు తెలుసుకోవడానికి మణిరత్నం మరో ప్రేమజంట (గణపతి, భవాని - ప్రకాష్‌రాజ్‌, లీలా సామ్‌సన్‌) సాయం తీసుకున్నాడు. అల్‌జైమర్స్‌తో బాధ పడుతూ అప్పుడప్పుడూ తనెవరో కూడా మర్చిపోయే భార్య కోసం తపించే భర్తలో ప్రేమ ఎప్పటికీ ఫేడ్‌ అయిపోదని, అది జీవితకాలం అలాగే ఉంటుందనే సంగతిని ఇద్దరూ రియలైజ్‌ అవుతారు. అయితే ఆ రియలైజేషన్‌ పార్ట్‌లో కూడా ఎక్కడా మెలోడ్రామాకి స్కోప్‌ ఇవ్వలేదు. కనిపించకుండా పోయిన భవానిని వెతుక్కోవడంలోనే తమ గుండెల్లో అణిచిపెట్టేసిన ప్రేమని కనుక్కోవడమనేది దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. 

మాటల్లోనో, మరో విధంగానో ఎక్స్‌ప్రెస్‌ చేసేస్తే సినిమా విజువల్‌ మీడియం ఎందుకవుతుంది? మణిరత్నం గొప్పతనం గురించి ఇప్పటి ప్రేక్షకులకి తెలియడానికి, మిగిలిన దర్శకుల కంటే ఆయన దేంట్లో మేటి అని అర్థం కావడానికి క్లయిమాక్స్‌ నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కాలం ప్రేమలంటే ఒకర్నొకరు చీట్‌ చేసుకోవడం, ఎలా వదిలించుకోవాలా అని ఆత్ర పడడం, ఎప్పటికప్పుడు మనసు మార్చుకుని కొత్త కొత్త పరిచయాల కోసం వెంపర్లాడడం అన్నట్టే చూపిస్తున్నారు కొందరు. ఆలోచనల పరంగా మోడ్రన్‌గా ఉన్నా నిజమైన ప్రేమలో ఎప్పుడూ ఎమోషన్స్‌ ఉంటాయి. కెరీర్‌ యాంబిషన్స్‌ వల్ల లవ్‌ ఒక్కోసారి ప్రాధాన్యతల పరంగా కాస్త వెనుక ఉండవచ్చు కానీ... నిజంగా ప్రేమిస్తే మాత్రం అది ఎప్పటికీ నిలిచి ఉంటుందనే సంగతిని మణిరత్నం తనదైన శైలిలో చూపించారు. మోడ్రన్‌ లవ్‌స్టోరీస్‌ తెరకెక్కించడమెలా అనేది నేటి తరం దర్శకులకి ఈ సినిమా ద్వారా దిశానిర్దేశం చేసారు. 

ప్రేమకథల్ని ఇష్టపడే వారికి, ప్రేమించిన వారికి, ప్రేమ అనే అనుభూతి ఏంటనేది తెలిసిన వారికీ, ప్రేమించిన అనుభవం ఉన్న వారికీ ‘ఓకే బంగారం’ తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది. ఏ ఆడియన్స్‌ని అయితే దృష్టిలో పెట్టుకుని తీసారో వారికి ఈ చిత్రం కంప్లీట్‌గా అప్పీల్‌ అవుతుంది. పూర్తిగా జోనర్‌ బేస్డ్‌ సినిమా కనుక అందరికీ నచ్చే అవకాశాల్లేవు. కానీ రొమాన్స్‌/డ్రామా జోనర్‌ని ఇష్టపడే వారికి సంతృప్తిని, ఒక ప్రేమజంట ప్రయాణాన్ని వీక్షించిన మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. లవ్‌ స్టోరీస్‌ చూడ్డం ఇష్టమైతే కనుక దీనిని అస్సలు మిస్‌ కాకండి. మణిరత్నం తీసిన అద్భుతాల అంతటి స్థాయిలో లేకపోవచ్చు కానీ ఈమధ్య వస్తున్న ప్రేమకథల మధ్య ఇది ఖచ్చితంగా టాప్‌ క్లాస్‌ అనిపించుకుంటుంది. 

బోటమ్‌ లైన్‌: సూపర్‌ బంగారం!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×