రివ్యూ: సత్య 2
రేటింగ్: 1.5/5
బ్యానర్: మమ్మొత్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.
తారాగణం: శర్వానంద్, అనైకా సోటి, మహేష్ ఠాకూర్, ఆరాధనా గుప్తా, రాజ్ ప్రేమి తదితరులు
సంగీతం: అమర్ మొహిలె
కూర్పు: జెరిన్ జోస్
ఛాయాగ్రహణం: వికాష్ సరఫ్
నిర్మాత: సుమంత్ కుమార్‌రెడ్డి
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
విడుదల తేదీ: నవంబర్ 8, 2013
గత వైభవం పేరు మీద ఇంకా సినిమాలు తీస్తున్న రామ్‌గోపాల్‌వర్మ కొంతకాలంగా తన సినిమాలతో ప్రేక్షకాభిమానుల్ని ‘చిత్ర’ వధకి గురి చేస్తున్నాడు. ఒకప్పటి క్రియేటివిటీ, ఆనాటి బ్రిలియన్స్ వర్మలో మచ్చుకైనా లేవిపుడు. అయితే ఇంకా మెగాఫోన్‌పై మక్కువ పోని రామ్‌గోపాల్‌వర్మ ఆ సరదా తీర్చుకునే పనిలో తనకొచ్చిన ఐడియాలని సినిమాలుగా తెరకెక్కించేస్తున్నాడు. ఆ ఐడియాలని తెర మీదకి తెచ్చే క్రమంలో కథ రాసుకోవాలని, పాత్రల్ని తీర్చి దిద్దాలని, కథనం అంటూ ఉండాలనే విషయాలనే పూర్తిగా విస్మరించి… ‘నా ఇష్టం’ వచ్చినట్టు తీస్తా… మీకిష్టముంటే చూడండి అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఈ మైండ్‌సెట్‌తో సినిమాలు తీసినంత కాలం ఆయన ఏ పేరు పెట్టి క్యాష్ చేసుకోవాలని చూసినా కానీ ఫలితముండదు.
కథేంటి?
ఒక మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సత్య (శర్వానంద్) తన క్రిమినల్ ఐడియాస్‌తో కొందరు కోటీశ్వరులకి కావాల్సిన వాడవుతాడు. కొంతకాలం వారికోసం తన మైండ్ వాడిన సత్య తనే సొంతంగా ‘కంపెనీ’ స్టార్ట్ చేస్తాడు. ఒక మినిష్టర్‌ని, పోలీస్ అధికారిని, మీడియా బేరన్‌ని టార్గెట్ చేసి, వారిని హత్య చేసి కంపెనీ అంటే అందరికీ దడ పుట్టేలా చేస్తాడు. అనతికాలంలోనే కోట్లు గడిస్తాడు. ఈ కంపెనీ ఎవరు నడుపుతున్నారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సత్య ఎవరు, అసలు ఎందుకు క్రైమ్‌ని బిజినెస్‌గా మార్చుకున్నాడు, చివరకు ఏమవుతాడు అనేది మిగతా కథ.
కళాకారుల పనితీరు!
సినిమా మొత్తంలో ఒకటి రెండు సార్లు మినహా కనీసం స్మైల్ కూడా ఇవ్వని సీరియస్ క్యారెక్టర్‌లో శర్వానంద్ నటించాడు. దాదాపుగా సినిమా అంతా సింగిల్ ఎక్స్‌ప్రెషన్ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ అనైక క్యారెక్టర్‌ని ‘క్యూట్’గా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె తన నటనతో ప్రేక్షకులకి నరకం చూపించింది. పాటల్లో అయితే ఆమె చేసే డాన్సులు ఏమి చేస్తుందో అర్థం కాని గందరగోళానికి గురి చేస్తాయి. ఒక సాంగ్‌లో విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేయడానికి మినహా ఆమె మరెందుకూ ఉపయోగపడలేదు.
మహేష్ ఠాకూర్ క్యాజువల్‌గా నటించాలని ట్రై చేసి ఓవరాక్షన్ చేశాడు. హీరోయిన్ కంటే హీరో స్నేహితుడి గాళ్‌ఫ్రెండ్‌గా నటించిన ఆరాధన కాస్త బెటర్ అనిపిస్తుంది. మిగతా వారంతా తమ పరిధుల్లో తాము చేయగలిగింది చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రంలో పాటల అవసరం లేదు. కానీ మరీ డార్క్ సినిమా కాబట్టి కాస్త కలర్ ఉండాలని, గ్లామర్‌కి స్కోప్ ఉండాలని సాంగ్స్ ఇరికించారు. పడిపోతున్న రామ్‌గోపాల్‌వర్మ మేకింగ్ స్టాండర్డ్స్‌కి ఈ చిత్రం నిలువుటద్దంలా నిలుస్తుంది. నేపథ్య సంగీతం కూడా అనేక అనేక సందర్భాల్లో రణగొణధ్వనులతో ‘శ్రవణార్తనాదం’ చేయిస్తుంది. ఎడిటింగ్ చాలా బ్యాడ్. సీన్‌కీ, సీన్‌కీ సంబంధం లేకుండా ఇష్టానికి సన్నివేశాలని పేర్చుకుంటూ పోయారు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సినిమా మూడ్‌కి తగ్గట్టుంది.
రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడో 1990లలోనే అద్భుతాలు ఆవిష్కరించేశాడు. ఇక ఆయన కొత్తగా చేయాల్సినది కూడా ఏమీ లేదు. చేయకపోయినా అడిగేవాళ్లు లేరు. భారతదేశంలో పుట్టుకొచ్చిన అతి గొప్ప ఫిలింమేకర్స్‌లో రామ్‌గోపాల్‌వర్మ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. అక్కడుండడం తనకి ఇష్టం లేదో ఏమో… ఎలాగైనా వెనక్కి వెళ్లిపోవాలని ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయన అదృష్టమో, దురదృష్టమో కానీ అప్పుడు తీసిన ఆ గొప్ప చిత్రాల గొప్పతనం వల్ల ఇప్పుడు ఆయన తీస్తున్న చెత్త చిత్రాలు వర్మ గొప్పతనాన్ని పూర్తిగా తగ్గించలేకపోతున్నాయి, ఆయనపై గౌరవం పోగొట్టలేకపోతున్నాయి. ఇప్పటికీ ఆయనలో అప్పటి మెరుపులైతే కొన్ని మిగిలున్నాయి. వాటిని అన్నిటినీ ఒక చోటకి తెచ్చే ఓపిక, తీరిక తనకుంటే… సినిమా తీసే ముందు కాస్త దానిపై మనసుపెట్టి, కొంచెం మెదడు వాడినట్టయితే ఇప్పటికీ చెప్పుకోతగ్గ సినిమాలు రావడానికి అవకాశమైతే ఉంది. కానీ ఆయనలో ఆ ఓపికేదీ?
హైలైట్స్:
- ‘సత్య 2’కి సీక్వెల్ తీస్తానని ప్రకటించడం!
డ్రాబ్యాక్స్:
- 1998లో వర్మ ‘సత్య’ తెరకెక్కించడం!
విశ్లేషణ:
‘‘చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే… ఏదైనా కొత్తగా పుట్టుకు రావాలంటే, ముందున్న పాత వాటిని అన్నిటినీ సర్వ నాశనం చేసేయాలి!’’… ‘సత్య 2’ క్లయిమాక్స్ సీన్‌లో డైలాగ్ ఇది. అసలు వర్మ ‘సత్య’కి సీక్వెల్ ఎందుకు తీశాడనే ప్రశ్న తొలిచేస్తుండగా ఈ డైలాగ్‌తో ఆన్సర్ దొరుకుతుంది. తన నుంచి ఏదైనా కొత్తగా పుట్టుకురావాలంటే, అంతకుముందు తాను తీసిన సినిమాలన్నిటినీ సర్వ నాశనం చేసేయాలని రామ్‌గోపాల్‌వర్మ ప్రయత్నిస్తున్నట్టు ఉన్నాడు.
అందుకే ‘శివ’కి సీక్వెల్‌గా ‘శివ 2006’ తీసాడు, ఇప్పుడు ‘సత్య’కి సీక్వెల్ అంటూ ‘సత్య 2’ని వదిలాడు. అప్పట్లో గొప్ప సినిమాలు తీయడం వల్ల తననుంచి అంతా అంతే రేంజ్ సినిమాలు ఆశిస్తున్నారు కాబట్టి, వాటి ఆనవాళ్లు లేకుండా నాశనం చేసేసినట్టయితే, తను తీసే ఈ సినిమాల్ని ఇక వేటితోను పోల్చకుండా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాడో ఏమో? లేదంటే ఆ ‘క్లాసిక్’ సత్యకీ, దీనికీ సంబంధం ఏమిటి? దీనికి ‘సత్య 2’ అనే టైటిల్ పెట్టి, ఆ సినిమా బ్రాండ్ వేల్యూ తగ్గించాల్సిన అగత్యం దేనికి? క్రైమ్‌ని బిజినెస్‌గా మార్చుకున్న యువకుడు ఏమి చేశాడనేది ఈ సినిమా బేసిక్ పాయింట్. ఈ పాయింట్ తన శిష్యుడు పూరి జగన్నాథ్‌కి చెప్తే అతను ‘బిజినెస్‌మేన్’ అనే కమర్షియల్ సినిమా తీశాడు. కానీ తానయితే దీనిని రియలిస్టిక్‌గా డీల్ చేస్తానని అనుకున్నాడో ఏమో… ఆ పాయింట్‌తో తనేమి చేయగలడో చూపించే ప్రయత్నం చేశాడు.
బేసిక్ ఐడియా ఉండడం వేరు… దాంతో సినిమా తీయడం వేరు. కానీ వర్మ కొంతకాలంగా చిన్న చిన్న ఐడియాలనే రెండు గంటల సినిమాలుగా మలిచేస్తున్నాడు. దీని వల్ల సినిమాలో విషయం లేక ప్రేక్షకులకి నరకం కనిపిస్తోంది. ‘సత్య 2’ కథ అయోమయంగా మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు హీరో కంపెనీ ఓపెన్ చేసే వరకు ఇష్టానికి తిరుగుతుంది. ఏ సన్నివేశాల్లోను లాజిక్ వెతికే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఎంతటి వారినైనా మంచి నీళ్లు తాగినంత ఈజీగా హీరో చంపేస్తుంటాడు. ఇంటర్వెల్ ముందు పది, పదిహేను నిముషాల పాటు జరిగే తంతులో లాజిక్ లేకపోయినా కానీ టెంపో అయితే బాగానే బిల్డ్ అయి, సెకండాఫ్‌పై హోప్స్ పెరుగుతాయి.
అయితే ఆ తర్వాత కథని ఎలా నడిపించాలో, సత్యతో ఏమి చేయించాలో, కంపెనీ కార్యకలాపాలు ఏమిటో… అసలీ కథకి ముగింపు ఎలా ఇవ్వాలో ఏమీ తెలియక రామ్‌గోపాల్‌వర్మ కాసేపు ఇన్వెస్టిగేషన్ డ్రామాతో కాలక్షేపం చేశాడు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌లా చూపించిన హీరోగారు వదిలేసే లూజ్ ఎండ్స్‌ని బట్టే సత్య క్యారెక్టర్‌పై ఎలాంటి ఎఫెక్షన్ కానీ, అడ్మిరేషన్ కానీ కలగదు. అప్పట్లో జెడి చక్రవర్తితో తీసిన ‘సత్య’ సినిమాలో వర్మలో ఏముందో, ఇప్పుడు ఏమి లేదో ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక క్రిమినల్‌తో కూడా ఎమోషనల్‌గా ఎటాచ్ అయి, అతడు మరణిస్తే బాధ పడే రీతిన అద్భుతంగా క్యారెక్టర్స్‌ని తీర్చిదిద్దిన వర్మ ఇప్పుడు వెన్నెముక లేని పాత్రల్ని, రక్తమాంసాలు లేని కార్డ్‌బోర్డ్ క్యారెక్టర్స్‌ని సృష్టించి క్రైమ్ డ్రామాని రక్తి కట్టించాలని చూస్తున్నాడు.
సినిమా విడుదలకి ముందు రిలీజ్ చేసిన అయిదు నిముషాల ప్రమోషన్ వీడియోలోనే ‘సత్య 2’ కథ మొత్తం చెప్పేశాడు వర్మ. ఆ అయిదు నిముషాలకి మించి ఇందులో చూడాల్సినది ఏమీ లేదు. అది చూసినట్టయితే ‘సత్య 2’ చూసేసినట్టే. రామ్‌గోపాల్‌వర్మ సినిమా చూడాలని ఉంటే ‘సత్య’ డివిడి పెట్టుకుని చూడండి. అంతే కానీ ‘సత్య 2’ని ఎంకరేజ్ చేద్దామని అనుకుంటే వర్మపై గౌరవం సన్నగిల్లడం, అభిమానం బీటలు వారడం మినహా ఒరిగేదేమీ ఉండదు.
బోటమ్ లైన్: అప్పుడు శివ 2-006… ఇప్పుడు సత్య 2-013!