రివ్యూ: సెల్ఫీ రాజా
రేటింగ్: 1.5/5
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి., గోపి ఆర్ట్స్
తారాగణం: అల్లరి నరేష్ (ద్విపాత్రాభినయం), కామ్నాసింగ్ రణావత్, సాక్షి చౌదరి, రవిబాబు, నాగినీడు, పృధ్వీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, జ్యోతి తదితరులు
కథ: శ్రీధర్ సీపాన
మాటలు: డైమండ్ రత్నబాబు
సంగీతం: సాయి కార్తీక్
కూర్పు: ఎం.ఆర్. వర్మ
ఛాయాగ్రహణం: ఎస్. లోకనాధన్
నిర్మాత: చలసాని రామబ్రహ్మం చౌదరి
కథనం, దర్శకత్వం: జి. ఈశ్వర్‌రెడ్డి
విడుదల తేదీ: జులై 15, 2016
ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియడానికి రెండో సీన్ వరకు వేచి చూడాల్సిన పని లేకుండా ఫస్ట్ సీన్‌లోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. 'అప్పుల అప్పారావు' ఓపెనింగ్ సీన్‌లో అప్పులకి బదులుగా సెల్ఫీలని పెట్టి స్పూఫ్‌తో మొదలైన ఈ చిత్రం ఆసాంతం పేరడీ సీన్లతోనే సాగుతుంది. ఒక దశలో ఈ చిత్రాన్ని 'సుడిగాడు' స్ఫూర్తితో చేసారేమో అనే అనుమానం కూడా వస్తుంది. నిజంగా అదే ఆలోచన ఉన్నట్టయితే కనుక పూర్తిగా స్పూఫ్ సినిమానే తీసి, 'సుడిగాడు 2' అని టైటిల్ పెట్టినట్టయితే ఖచ్చితంగా ఎంతో కొంత లాభం చేకూరేది.
కథగా చెప్పుకోవాలంటే 'సెల్ఫీ రాజా'లో ఏమీ లేదు. కేవలం రెండు గంటల సమయం గడపడానికి తోచిన సన్నివేశాలని ఏ రోజుకి ఆ రోజు అందుబాటులో ఉన్న ఆర్టిస్టులతో తీసేసారేమో అనే అనుమానం కలుగుతుంది. ఇవివి తీసిన పలు చిత్రాల్లోని పాయింట్స్‌ని తీసుకుని కథని ముందుకి నడిపించడానికి వాడుకున్నారు. కథ, కథనాలు సవ్యంగా లేకపోయినా కనీసం కామెడీ అయినా వర్కవుట్ అయినట్టయితే ఆ లోపాలని పట్టించుకోనక్కర్లేదు. కానీ రెండున్నర గంటల కామెడీ సినిమాలో నవ్వు వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
కథని ముందుకి నడిపించడానికా అన్నట్టు అల్లరి నరేష్‌తో ద్విపాత్రాభినయం కూడా చేయించారు. కనీసం ఆ యాంగిల్‌తో అయినా కథనంలో చలనం వస్తుందని ఆశిస్తే ఆ పాత్ర ఎంటరయ్యాక సెల్ఫీ రాజా మరింత కంగాళీగా తయారవుతుంది. ఎంత అస్తవ్యస్తంగా సాగినా కానీ ప్రథమార్థంలో 'నాన్నకు ప్రేమతో' ఫైట్ సీన్ స్పూఫ్‌లాంటివి నవ్వించాయి. సెకండ్ హాఫ్ మాత్రం విపరీతంగా విసిగించి సహనానికి పరీక్ష పెట్టింది. కృష్ణభగవాన్‌పై తీసిన చెవిటి కామెడీకి కాలం చెల్లిపోయి కూడా జమానా అయింది. షకలక శంకర్ పాముల ట్రాక్‌తో నవ్వుకుంటారని ఐడియా ఇచ్చిందెవరో కానీ వారి సెన్సాఫ్ హ్యూమర్‌కి సలామ్ కొట్టాలి.
కేవలం అనుకరణకే పరిమితం అవుతోన్న పృధ్వీ ఇందులో ఒకే సీన్లో నాలుగైదు సినిమాల డైలాగులు కలిపి చెప్తూ నవ్వించాలని చూసాడు. వాళ్లు చేస్తున్నది కామెడీ కాదు కిచిడీ అనేది రచయితలకీ తెలిసినట్టు ఉంది. అందుకే పృధ్వీ తీరుపై చివర్లో సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు. అసలు ఈ చిత్రానికి సెల్ఫీ రాజా అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది కూడా అర్థం కాదు. టైటిల్ జస్టిఫికేషన్ కోసం మొదట్లో అల్లరి నరేష్ సెల్ఫీలు తీసుకునే సీన్లు పెట్టారు. అతను చేసే ఉద్యోగం ఏంటనేది కూడా ఎక్కడా చెప్పరు. సడన్‌గా ఒక సీన్లో అతను మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నట్టు చూపిస్తారు. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ ఎంత 'అందంగా' ఉన్నాయనే దానికి ఇదో ఉదాహరణ.
సీనియర్ కమెడియన్లు మినహా ఇప్పుడున్న కమెడియన్లందరినీ ఏదో ఒకలా కథలోకి ఇరికించారు. వారిలో చాలా మంది చేసింది స్పూఫ్ డైలాగులు చెప్పడమే. తాగుబోతు రమేష్ చేసిన 'కట్టప్ప' కామెడీకి కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. సప్తగిరి ఒక్కడే కాస్తంత ఒరిజినాలిటీ చూపించాడు. రవిబాబుని కూడా ఈ తరహా పాత్రల్లో చాలా సార్లు చూసాం. అల్లరి నరేష్‌ని కూడా స్ఫూఫ్‌లకే పరిమితం చేయడం వల్ల అతను తన టైమింగ్ చూపించే ఆస్కారం కూడా దక్కలేదు. తన సినిమాల్లో పాటలు కంపల్సరీ అనుకున్నట్టయితే అవి బాగుండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి పాటల వల్ల ఖర్చు దండగ తప్ప సినిమాకి ఒరిగేదేమీ ఉండదు. హీరోయిన్ కామ్న సింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగైదు సీన్లు అయ్యాక కానీ ఆవిడే హీరోయిన్ అనే సంగతి బోధపడదు.
లో బడ్జెట్ సినిమాల్లో కూడా ఆకర్షణీయమైన విజువల్స్ ఉంటున్నాయి. కానీ ఇంత పెద్ద తారాగణం ఉండి కూడా ఈ చిత్రం టీవీ సీరియల్ కంటే దారుణమైన నిర్మాణ విలువలతో నిరాశ పరిచింది. సాంకేతిక వర్గం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజానికి పేరడీ సీన్లతో నవ్వించడం ఈజీ. కానీ ఇటీవల వచ్చిన చెప్పుకోతగ్గ చిత్రాలన్నిటి సీన్లతో పేరడీలు చేసినా సెల్ఫీరాజా పేలవంగానే తయారైంది. ఇంత నాసి రకం ప్రోడక్ట్ చూస్తే రైటర్స్ కూడా పూర్తి స్థాయిలో మనసు పెట్టలేదేమో అనిపిస్తుంది. జబర్దస్త్ కార్యక్రమాన్ని వెండితెరపై, సినీ నటులతో తీస్తే ఎలాగుంటుందో ఈ చిత్రం అలాంటి అనుభూతినిస్తుంది. కాకపోతే జబర్దస్త్ కామెడీ కాస్తయినా నవ్విస్తుంది… సెల్ఫీ రాజా రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా హింసిస్తుంది! ఈ వేదించే వినోదాన్ని ఆస్వాదించడం అటుంచి, చివరి వరకు భరించడం కూడా కఠిన పరీక్షలానే ఉంటుంది.
బోటమ్ లైన్: అవుట్‌డేటెడ్ కామెడీ రాజా!
– గణేష్ రావూరి