సినిమా రివ్యూ: శ్రీరస్తు శుభమస్తు

రివ్యూ: శ్రీరస్తు శుభమస్తు రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌ తారాగణం: అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, అలీ, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రభాస్‌ శ్రీను, రణధీర్‌, సుమలత, ప్రగతి,…

రివ్యూ: శ్రీరస్తు శుభమస్తు
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌
తారాగణం: అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, అలీ, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రభాస్‌ శ్రీను, రణధీర్‌, సుమలత, ప్రగతి, స్వప్నిక తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: మణికండన్‌
నిర్మాత: అల్లు అరవింద్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పరశురాం
విడుదల తేదీ: ఆగస్టు 5, 2016

ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి ఫిక్స్‌ అయిపోతే, ఎలాగైనా తనని దక్కించుకోవడానికి బ్యాగ్‌ భుజాన వేసుకుని పెళ్లి ఇంట్లో చేరి ఆమెని ఎలా తన దానిని చేసుకున్నాడనే కథ 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే' రోజుల నుంచీ చూస్తున్నదే. ఇరవయ్యేళ్లయినా ఇప్పటికీ ఈ ఫార్ములా క్లిక్‌ అవుతూనే వుంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'నేను శైలజ' కూడా ఇదే ప్లాట్‌తో వచ్చింది, సూపర్‌హిట్‌ అయింది. 'సోలో' సినిమాకి ఇదే ఫార్ములాని నమ్ముకున్న దర్శకుడు పరశురాం మళ్లీ దాంతోనే 'శ్రీరస్తు శుభమస్తు' అనేసాడు.             

మధ్య తరగతి అమ్మాయిలపై, వారి కుటుంబాలపై సదభిప్రాయం లేని తండ్రికి తను ప్రేమించిన అమ్మాయి తన ఆస్తిని చూసి కాకుండా, తనని తానుగా ప్రేమిస్తుందని నిరూపించడానికి 'అడ్రస్‌ లేని వాడిగా' ఆమెకి పరిచయం అవుతాడు హీరో. అయితే తనలోనే లోకాన్ని చూస్తూ, తనే జీవితంగా బ్రతికేస్తున్న తండ్రి ఫీలింగ్స్‌కి లాక్‌ అయిపోయి ఉంటుంది హీరోయిన్‌. మరి ఈ చిక్కుముడిని విడిపించి తన ప్రేమని హీరో ఎలా గెలిపించుకుంటాడు? 'శ్రీరస్తు శుభమస్తు' కథ ఇదే. ఫార్ములాని విడిచి పెట్టకుండా, వెరైటీ కోసం చూడకుండా, చాలా మంది నడిచిన దారిలోనే నడిచాడు పరశురాం. 

కాకపోతే తన సినిమాలో సరిపడా వినోదం, కదిలించే భావోద్వేగాలు ఉండేట్టు జాగ్రత్త పడ్డాడు. సన్నివేశం సాధారణంగానే ఉన్న సందర్భంలో సంభాషణా రచయితగా తనకున్న ప్రావీణ్యంతో దాని స్థాయిని పెంచాడు. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా కేర్‌ తీసుకున్న పరశురాం కీలకమైన ప్రేమకథని మాత్రం అసహజమైన సన్నివేశాలతో నింపేసాడు. 'అనామకుడిగా' లావణ్యకి శిరీష్‌ పరిచయమై, ఆమెకి దగ్గరయ్యే సన్నివేశాలు చాలా కృతకంగా అనిపిస్తాయి. కాలేజ్‌ టాపర్‌ అయిన అమ్మాయి, ప్రేమించానని వచ్చిన అబ్బాయిలని చావ చితగ్గొట్టే అమ్మాయి అంత పేలవంగా ప్రేమలో పడిపోవడం క్యారెక్టర్‌కి తగ్గట్టు లేదు. హీరోయిన్‌కి తన ఐడెంటిటీ తెలియకుండా దాచి పెట్టి ఆమెని ఇంప్రెస్‌ చేయడమనేది హీరో లక్ష్యం అన్నప్పుడు ఇంతకంటే బెటర్‌ ఆప్షన్స్‌ చాలా ఉన్నాయి. కానీ ఎందుకో పరశురాం ఆ త్రెడ్‌ మీద దృష్టి పెట్టలేదు. దీంతో హీరోయిన్‌ ఇంట్లో హీరో తిష్ట వేసుకుని ఉండే సీన్స్‌ అన్నీ విసిగిస్తాయి. చివరకు ఆమె అతడిని ప్రేమించడానికి కూడా పెద్దగా కారణాలు లేవనిపిస్తాయి. 

ఆమెకి హీరోపై ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలు ఉన్నట్టయితే, అయినప్పటికీ ఆమె అతడిని కాదని తండ్రి కోసమని తన ప్రేమని అణచిపెట్టి ఉన్నట్టయితే కాన్‌ఫ్లిక్ట్‌ చాలా బలంగా ఉండేది. బహుశా కామెడీ కోసమని లవ్‌ ట్రాక్‌ ఈ విధంగా రాసుకున్నారేమో కానీ కథానుసారం, పాత్రౌచిత్యం ప్రకారం ఇది సబబు అనిపించదు. అయితే ఈ లోపాలని కప్పి పుచ్చుతూ వినోద భరిత సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల బంధం ఒకటి, రెండు సన్నివేశాల్లోనే బాగా చూపించగలిగారు. ఉదాహరణకి 'నా జీవితంలో ప్రతి పది, పదిహేనేళ్లకీ ఏదో ఒక భయంకరమైన అనుభవం ఎదురవుతున్నా నిన్ను చూసుకుని ఆనందంగా బ్రతికేస్తున్నాను' అని తండ్రి కూతురితో చెప్పినప్పుడే ఆమె ఎప్పటికీ తండ్రి హృదయం గాయపరచలేని విధంగా లాక్‌ అయిపోతుంది.

ఎమోషనల్‌ సీన్స్‌ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడంతో 'రొటీన్‌ రొమాన్స్‌' అయినప్పటికీ 'శ్రీరస్తు శుభమస్తు' రక్తి కడుతుంది. ప్రథమార్థంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథ బలహీనంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం వినోదభరితంగా సాగుతుంది. ఇక పతాక సన్నివేశాల్లో డైలాగ్‌ రైటర్‌గా పరశురాం కదం తొక్కాడు. రావు రమేష్‌ – శిరీష్‌ సీన్‌, శిరీష్‌ – ప్రకాష్‌రాజ్‌ సీన్‌ బ్రహ్మాండంగా పేలాయి. అమాంతం సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. అన్ని ప్రేమకథలూ ఇంతేనా అనే ప్రశ్న తప్పిస్తే, చూసేసిన కథనే పరశురాం మరోసారి చూడదగ్గట్టుగా ప్రెజెంట్‌ చేసాడనే చెప్పాలి. 

నటుడిగా శిరీష్‌ మెరుగయ్యాడు. ఇంకా ఇంప్రూవ్‌ అవ్వాలి కానీ రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌లాంటి హేమాహేమీలతో కాన్‌ఫ్రంటేషన్‌ సీన్లలో కాన్ఫిడెంట్‌గానే కనిపించాడు. కీలకమైన క్లయిమాక్స్‌ సీన్‌లో తేలిపోకుండా చేయగలిగాడు. లావణ్య ఎప్పటిలానే సహజ నటనతో ఆకట్టుకుంది. రావు రమేష్‌కి మరో గుర్తుండిపోయే పాత్ర దక్కింది. ఆయన నటన ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌. ప్రకాష్‌రాజ్‌ తన పాత్రని రక్తి కట్టించారు. చాలా రోజుల తర్వాత అలీకి నవ్వించే అవకాశం దక్కింది. సుబ్బరాజు, ప్రభాస్‌ శ్రీను కామెడీ కూడా మాస్‌ని అలరిస్తుంది. చాలా రోజుల తర్వాత తెరపై కనిపించిన సుమలత ఆ పాత్రకి రైట్‌ ఛాయిస్‌ అనిపించలేదు. 

టైటిల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగా కుదిరింది. ఛాయాగ్రహణంతో పాటు ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా బాగుంది. దర్శకుడిగా ఎమోషనల్‌ సీన్స్‌ని బ్రహ్మాండంగా హ్యాండిల్‌ చేస్తోన్న పరశురాం సంభాషణా రచయితగా మరోసారి టాప్‌ ర్యాంకర్‌ అనిపించుకున్నాడు. ఫార్ములా బౌండరీస్‌కి కట్టుబడి సేఫ్‌ గేమ్‌ ఆడే గీతా ఆర్ట్స్‌ మరోసారి ఆ 'గీత'లకి లోబడి సేఫ్టీ మెజర్స్‌తో ఫ్యామిలీస్‌ని టార్గెట్‌ చేసింది. ఫస్ట్‌ హాఫ్‌లో ప్రేమకథ ఆకట్టుకోలేకపోవడం, కొత్తదనం లేదనే కంప్లయింట్‌ మినహా 'శ్రీరస్తు శుభమస్తు' బలమైన భావోద్వేగాలతో, గిలిగింతలు పెట్టే వినోదంతో ఓవరాల్‌గా మెప్పిస్తుంది. 

బోటమ్‌ లైన్‌: పాత ఫార్ములానే కానీ పని చేసింది!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri