సినిమా రివ్యూ: తుంటరి

రివ్యూ: తుంటరి రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: శ్రీ కీర్తి ఫిలింస్‌ తారాగణం: నారా రోహిత్‌, లత హెగ్డె, కబీర్‌ దుహన్‌ సింగ్‌, అలీ, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, సుదర్శన్‌, పూజిత తదితరులు సంగీతం:…

రివ్యూ: తుంటరి
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: శ్రీ కీర్తి ఫిలింస్‌
తారాగణం: నారా రోహిత్‌, లత హెగ్డె, కబీర్‌ దుహన్‌ సింగ్‌, అలీ, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, సుదర్శన్‌, పూజిత తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: ఎం.ఆర్‌. పళనికుమార్‌
నిర్మాతలు: అశోక్‌ బాబా, నాగార్జున్‌
కథ: ఏ.ఆర్‌. మురుగదాస్‌
కథనం, దర్శకత్వం: కుమార్‌ నాగేంద్ర
విడుదల తేదీ: మార్చి 11, 2016

పరభాషలో సక్సెస్‌ అయిన సినిమాని రీమేక్‌ చేయడమంటే అక్కడున్న కథ, కథనాల్ని యథాతథంగా ఫాలో అయిపోవడం కాదు. ఆ సినిమా విజయవంతం కావడానికి కారణాలేంటనేది కూడా విశ్లేషించుకోవాలి. అవన్నీ రీమేక్‌లో కూడా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. 'మాన్‌ కరాటే' చిత్రానికి రీమేక్‌ అయిన 'తుంటరి'లో ముందుగా లీడ్‌ యాక్టర్‌ని ఎంచుకోవడం దగ్గరే మిస్టేక్‌ జరిగింది. 'మాన్‌ కరాటే' కథలో అసలు కమర్షియల్‌ పాయింట్‌ ఏంటి? ఒక అండర్‌డాగ్‌.. బాక్సింగ్‌ ఛాంపియన్‌ కావడం! ఆ అండర్‌డాగ్‌ పాత్రకి శివ కార్తికేయన్‌ అతికినట్టు సరిపోయాడు. అతని పూర్వపు స్టాండ్‌అప్‌ కమెడియన్‌, టీవీ యాంకర్‌ ఇమేజ్‌కి తోడు తన ఫిజిక్‌ కూడా పాత్రకి సరిగ్గా సూట్‌ అయింది. అందుకే 'పీటర్‌' పాత్రలో అతడిని ఈజీగా రిలేట్‌ చేసుకోగలిగారు.

ఎక్కువగా యాక్షన్‌ ప్రధాన సినిమాలు చేస్తూ, మంచి కండపుష్టి ఉన్న నారా రోహిత్‌ని అండర్‌డాగ్‌గా ఒప్పుకోమంటే కనక్ట్‌ అవడం కష్టం. నెక్స్‌ట్‌ హీరోయిన్‌ ఎంపికలో కూడా బ్లండర్‌ చేశారు. 'మాన్‌ కరాటే'లో శివ కార్తికేయన్‌ సరసన హన్సికలాంటి స్టార్‌ హీరోయిన్‌గా ఊరికే పెట్టలేదు. అతనిలాంటి ఒక మామూలు వ్యక్తికి అలాంటి అమ్మాయి దొరికితే ఆమెని మిస్‌ చేసుకోకూడదని ప్రాణాలకి తెగిస్తాడన్న మాట. కనీసం హీరోయిన్‌ పరంగా అయినా రైట్‌ కాస్టింగ్‌ లేదు. లతా హెగ్డే అందగత్తె కాకపోగా, కనీసం నటన కూడా రాదు. ఇక మరో ముఖ్య అంశం అనిరుధ్‌ అందించిన మ్యూజిక్‌ 'మాన్‌ కరాటే'ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఆ చిత్రానికి అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. 'తుంటరి'లో పాటలు సినిమాకి హెల్ప్‌ అవడం మాట అటుంచి, హెల్ప్‌ కోసం చూసేట్టు చేశాయి. 

ఇంతకీ మురుగదాస్‌ రాసిన కథేంటంటే… ఒక స్వామీజీ ద్వారా భవిష్యత్తులో జరిగే కొన్ని విషయాలని న్యూస్‌ పేపర్‌ ద్వారా తెలుసుకుంటారు అయిదుగురు స్నేహితులు. ఒక బాక్సింగ్‌ ఛాంపియన్‌కి తామే అండదండగా నిలిచామని, తద్వారా అయిదు కోట్లు గెలుచుకున్నామని వారికి తెలియడంతో అతడిని వెతికే పనిలో పడతారు. తీరా అతనేమో బాక్సింగ్‌ గురించి ఏమీ తెలియని ఒక ఆవారా. నాలుగు నెలల్లో అతడిని ఛాంపియన్‌గా తీర్చిదిద్దాలి. వాళ్లు చెప్పింది చేయాలంటే తాను ప్రేమించిన అమ్మాయికి దగ్గర చేయాలని అతను కండిషన్‌ పెడతాడు. ఆమె ప్రేమ పొందిన తర్వాత తనని మోసం చేయడం ఇష్టం లేక ప్రాణాలకి తెగించి బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగుతాడు. 

ఫాంటసీ, కామెడీ, రొమాన్స్‌, స్పోర్ట్స్‌… ఇలా వివిధ జోనర్లని మిక్స్‌ చేస్తూ రాసిన కథలో కమర్షియల్‌ పాయింట్స్‌ కూడా బాగానే ఉన్నాయి. కథ ఆసక్తికరంగా ఉన్నా కట్టి పడేసే కథనం రాసుకోవడంలో తమిళ దర్శకుడు సైతం విఫలమయ్యాడు. కానీ పైన చెప్పుకున్న కొన్ని ప్లస్‌ పాయింట్స్‌ వల్ల అక్కడ సినిమా పాస్‌ అయిపోయింది. ఈ కథలో భవిష్యత్తు తెలిసిన స్నేహితులు హీరో ఎంత వర్త్‌లెస్‌ అనిపిస్తున్నా గెలుపు మాదే అనే ధీమాతో ఉంటారు. ఎలా తీసినా హిట్‌ సినిమానే అన్న నమ్మకంతోనో ఏమో తుంటరి తెరకెక్కించడంలో ఎలాంటి సీరియస్‌నెస్‌ చూపించలేదు. చివరకు హీరో గెలుపుని కూడా హర్షించలేనంత చప్పగా సినిమా సాగిపోతుంది. ఏ దశలోను హీరో పాత్రపై సింపతీ కానీ, అతను గెలవాలన్న ఆకాంక్ష కానీ కలగవు. కేవలం హీరోయిన్‌ గురించి విలన్‌ చేసే చీప్‌ కామెంట్స్‌తోనే మనం రగిలిపోయి హీరో గెలుపుని కోరుకోవాలన్నట్టుగా కనిపిస్తుందీ తుంటరి తీరు. 

బాక్సింగ్‌ గురించి ఓనమాలు తెలియని హీరో వచ్చీ రాని ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ చేసే కామెడీ కాసేపు నవ్వించినా కానీ ఆ తర్వాత మొదలయ్యే లవ్‌స్టోరీ పూర్తిగా డిస్‌కనక్ట్‌ చేస్తుంది. బాక్సింగ్‌ మ్యాచ్‌లని ఎలాంటి లాజిక్‌ లేకుండా చూడాలి. ఎందుకంటే ఒకవైపు కబీర్‌ నిజంగా బాక్సర్లని ఓడిస్తూ పోతుంటే, హీరో దగ్గరకి మాత్రం అంతా కామెడీ బ్యాచ్‌ వస్తుంటారు. ఇద్దరూ ఫైనల్స్‌కి చేరిపోతారు. కనీసం ఒక్క పంచ్‌ కూడా విసరని హీరో గెలవాలని జనం పూజలు, ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారనే లాజిక్స్‌ జోలికి పోతే ఇక చివరి వరకు చూడాలనిపించదు. 

రోహిత్‌ కామెడీ చేయడానికి ట్రై చేశాడు కానీ చివర్లో ఎమోషనల్‌గా మారినప్పుడు మాత్రమే తన జోన్‌లో ఉన్నట్టు అనిపించాడు. స్టార్‌ కాస్ట్‌ మొత్తంలో కబీర్‌ ఒక్కడే క్యారెక్టర్‌ తగినట్టున్నాడు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీకి మార్కులు పడతాయి. విషయమున్న కథకి కాస్త వినోదాన్నయితే జోడించారు కానీ ఆసక్తికరమైన సినిమాగా మలచలేకపోయారు. 

బోటమ్‌ లైన్‌: ట్రాక్‌ తప్పిన రీమేక్‌!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri