Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఆర్‌ఎక్స్‌ 100

సినిమా రివ్యూ: ఆర్‌ఎక్స్‌ 100

రివ్యూ: ఆర్‌ఎక్స్‌ 100
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌
తారాగణం: కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుట్‌, రావు రమేష్‌, రాంకీ తదితరులు
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
కూర్పు: కె.ఎల్‌. ప్రవీణ్‌
ఛాయాగ్రహణం: రామ్‌
నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ
రచన, దర్శకత్వం: అజయ్‌ భూపతి
విడుదల తేదీ: జులై 12, 2018

పోస్టర్స్‌, ట్రెయిలర్‌లోని బోల్డ్‌ కంటెంట్‌తో 'అర్జున్‌ రెడ్డి'ని తలపించిన 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాగా ఆకట్టుకున్నా, లేకపోయినా ఆ కంటెంట్‌ చూసి ఆకర్షితులైన యూత్‌కి, మాస్‌కి కావాల్సిన స్టఫ్‌ మాత్రం మొహమాటం లేకుండా ఇచ్చేస్తుంది. 'యాన్‌ ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే ఇది సగటు ప్రేమకథ మాత్రం కాదు. పైకి పేద, ధనిక అంతరాల నడుమ పుట్టి, చితికిపోయిన ప్రేమకథలానే అనిపించినా కానీ ఇందులో ఊహించని మలుపులుంటాయి, ముసుగులేసుకున్న పాత్రలుంటాయి.

హీరోయిన్‌ అంటే ఇలానే వుండాలి, అమ్మాయిలని పద్ధతిగానే చూపించాలనే పడికట్టు సినీ సిద్ధాంతాలకి అతీతంగా వెళ్లాడు దర్శకుడు అజయ్‌ భూపతి. అమ్మాయి అందచందాలపై మోజుపడి ఎగాదిగా చూసి ప్రేమలో పడిపోయే కుర్రాళ్లని చూపించడం సినిమాల్లో షరా మామూలే. ఫర్‌ ఏ ఛేంజ్‌... అబ్బాయి ఫిజిక్‌, సెక్సప్పీల్‌ చూసి 'మోజుపడే' అమ్మాయిని చూపించారిందులో. రొమాన్స్‌లో అబ్బాయి అడ్వాన్స్‌ అవడం రొటీనే. ఓసారి అమ్మాయే అడ్వాన్స్‌ అయితే!

పోస్టర్‌లో, ట్రెయిలర్స్‌లో సెల్లింగ్‌ పాయింట్స్‌ అనిపించిన ఈ అంశాలని దర్శకుడు అస్సలు దేనికీ వెనకాడకుండా చూపించేసాడు. తన టార్గెట్‌ ఆడియన్స్‌ ఎవరో తెలుసు కనుక మిగతా వారి స్పందనల గురించి తర్కించకుండా వీళ్లకి కావాల్సిన విందు ఇచ్చేసాడు. 'ఆర్‌ఎక్స్‌ 100'కి వున్న కమర్షియల్‌ అప్పీల్‌ సంగతి అటుంచి, ఒక సినిమాగా ప్లస్సులు, మైనస్సుల గురించి మాట్లాడుకుంటే మైనస్‌లే ఎక్కువ కనిపిస్తాయి. కానీ బోల్డ్‌ కంటెంట్‌తో, మైండ్‌ బ్లోయింగ్‌ ట్విస్ట్‌తో బలహీనతల గురించి పట్టని యూత్‌లో ఒక వర్గం నుంచి మార్కులు పడిపోతాయి.

బోల్డ్‌గా తీసారు కదా అని దీనిని 'అర్జున్‌రెడ్డి'తో పోల్చడం దానిని చిన్నబుచ్చడమే అవుతుంది. అర్జున్‌రెడ్డి అంతటి రిమార్కబుల్‌ ఫిలిం అవడానికి కారణం కేవలం అందులోని బోల్డ్‌నెస్‌ మాత్రమే కాదు. ఒక క్యారెక్టర్‌ని అంత డీప్‌గా అనలైజ్‌ చేసి డెవలప్‌ చేసిన సినిమాలు మనకి చాలా అరుదు. ఆర్‌ఎక్స్‌ 100లో కూడా లిప్‌లాక్స్‌ వుంటాయి, సెక్స్‌ వుంటుంది, రానెస్‌ వుంటుంది. అంతే..! 'అర్జున్‌రెడ్డి'తో దీనికి పోలిక అంతవరకే. ఆ సినిమాలా ఇది రిఫైన్డ్‌ ప్రోడక్ట్‌ కాదు. కంప్లీట్‌ సినిమా అంతకంటే కాదు. బోల్డ్‌ స్టఫ్‌తో కమర్షియల్‌గా సెన్సేషన్‌ కావడానికి కావాల్సిన వనరులకి మాత్రం లేదు లోటు.

ఆరంభం చాలా రఫ్‌గా వుంటుంది. గంజాయి పీలుస్తూ, కనబడిన వాళ్లని కొడుతూ అగమ్యగోచరంగా కనిపిస్తోన్న లీడ్‌ క్యారెక్టర్‌లానే స్క్రీన్‌ప్లే కూడా అడ్డదిడ్డంగా ముందుకి కదులుతుంటుంది. మూడేళ్ల క్రితం అంటూ అసలు కథలోకి వెళితే... డాడీ (రాంకీ) అనే సంరక్షకుని నీడలో పెరిగిన పల్లెటూరి కుర్రాడు శివ (కార్తికేయ). లోకల్‌గా చిన్న సినిమా థియేటర్‌ నడుపుకుంటూ అక్కడి రాజకీయ నాయకుడు విశ్వనాధం (రావురమేష్‌) వెనక వుంటాడు. సెలవులకి ఊరొచ్చిన విశ్వనాధం కూతురు ఇందు (పాయల్‌ రాజ్‌పుట్‌) షర్ట్‌ లేకుండా డాన్స్‌ చేస్తూ కనిపించిన శివని చూసి మోజు పడుతుంది. ప్రేమిస్తున్నానని ఆమె చెప్పిన మాటలకి శివ కూడా మాయలో పడిపోతాడు. అతనికి తెలియని చాలా విద్యలు నేర్పించి మరీ ఆమె అతడిని పూర్తిగా తన మత్తులో పడేస్తుంది. వీళ్ల ప్రేమ సంగతి తెలిసిన విశ్వనాధం ఆమెకి పెళ్లి చేసి పంపేస్తాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఆమె తిరిగి వస్తుంది. 'నా కోసమే వచ్చిందంటూ' శివ సంబరపడతాడు. కానీ అతనికి తెలియని నిజం ఒకటి మూడేళ్లుగా మరుగున పడి వుంది. అది తెలుసుకున్న శివ తట్టుకోగలడా?

ఈ కథలో ఆరంభం ఫస్ట్‌ గేర్‌లో టాప్‌ స్పీడ్‌లో వెళుతున్న బైక్‌లా చాలా రఫ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రేమ వ్యవహారం పూర్తిగా రా రొమాన్స్‌ మీదే ఫోకస్‌ పెడుతూ 'పోస్టర్స్‌' చూసి టికెట్‌ కొనేసిన వారి కోసం పెట్టిన స్టఫ్‌తో వెళ్లిపోతుంది. 'ఇన్‌క్రెడిబుల్‌' లవ్‌స్టోరీ అన్నారు కనుక ఆ పార్ట్‌ ఏమిటా అని చూసిన వారికి చివరి ఘట్టంలో కానీ ఆన్సర్‌ దొరకదు. ఎక్స్‌పెక్ట్‌ చేయని క్యారెక్టర్‌ ట్విస్ట్‌తో సినిమా కలరే మారిపోతుంది. ఈ పార్ట్‌లో కొన్ని సీన్స్‌కి మాస్‌, యూత్‌ నుంచి స్పందన తారాస్థాయిలో వుంటుంది. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే సంభాషణకి తోడు ప్రధాన క్యారెక్టర్స్‌లో ఒక దానికి సంబంధించిన అదర్‌ సైడ్‌ ఎక్స్‌పోజ్‌ అవుతున్న కొద్దీ ఆర్‌ఎక్స్‌ 100 జోరందుకుంటుంది. క్లయిమాక్స్‌ హింసాత్మకంగా మారి రొటీన్‌కి భిన్నమైన ముగింపుతో తమిళ ప్రేమకథలని తలపిస్తూ ముగుస్తుంది. శివ అనే వ్యక్తి తాలూకు రియల్‌ స్టోరీ ఇదని దర్శకుడు క్లెయిమ్‌ చేసాడు కనుక ఈ ముగింపు కూడా వాస్తవమే అనుకోవాలి.

కార్తికేయ తొలి చిత్రానికే ఇంత క్లిష్టమైన పాత్రనివ్వడం అతనిపై ఓవర్‌ బర్డెన్‌ పెట్టినట్టే. తనకి చేతనైంది చేయగలిగాడు కానీ ఎవరైనా పర్‌ఫార్మర్‌ అయితే శివ పాత్రని గుర్తుండిపోయేట్టు చేసేవాడు. శివ జీవితంలోని వివిధ దశలకి తగ్గట్టు కార్తికేయ తన నటనలో మార్పులు చూపించలేకపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో తన పెయిన్‌ని సరిగా కన్వే చేయలేకపోవడం ఈ చిత్రానికి బలహీనతగా మారింది. హీరో పాత్రతో సింపతైజ్‌ చేయగలిగేలా, అతని ప్రేమలోని గాఢత తెలిసేలా అభినయించేంత అనుభవం వున్న నటుడు చేయాల్సిన పాత్ర ఇది. పాయల్‌ రాజ్‌పుట్‌ క్లిష్టమైన పాత్రలో బాగానే రాణించింది కానీ ఆ పాత్రని కూడా ఇంకా స్ట్రయికింగ్‌గా, షాకింగ్‌గా పోషించే అవకాశముంది. రావు రమేష్‌ ఎప్పటిలానే చక్కని నటనతో ఈ చిత్రానికి సపోర్ట్‌ సిస్టమ్‌గా నిలిచాడు. చాలా కాలం తర్వాత కనిపించిన 'సింధూరపువ్వు' రాంకీ కూడా తన ప్రెజెన్స్‌ తెలిసేట్టు చేసాడు.

ఈ చిత్రానికి అతి పెద్ద ప్లస్‌ మాత్రం పాటలే. 'పిల్లా రా', 'మనసుని పట్టి దారం కట్టి' పాటలు అలరిస్తాయి. అయితే అవసరానికి మించిన పాటలు ఆర్‌ఎక్స్‌ 100 వేగానికి పదే పదే బ్రేకులు వేసినట్టయ్యాయి. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో చాలా బాగుంది కానీ కన్సిస్టెన్సీ కొరవడింది. సినిమాటోగ్రఫీ పరంగా రాంగోపాల్‌వర్మ మాదిరిగా భిన్నమైన యాంగిల్స్‌పై దృష్టి ఎక్కువైంది. ఎడిటింగ్‌ బాలేదు. కీలకమైన చివరి ఘట్టంలో ఎడిటింగ్‌ లోపాలు బాగా తెలుస్తాయి.

కేవలం బోల్డ్‌ రొమాన్స్‌, కథలోని ట్విస్ట్‌తో స్కోర్‌ చేసే ఈ చిత్రానికి కనుక పకడ్బందీ స్క్రీన్‌ప్లే, క్వాలిటీ మేకింగ్‌, మంచి లీడ్‌ యాక్టర్స్‌ తోడయినట్టయితే మరాఠీ 'సైరాట్‌' మాదిరిగా, తమిళ 'మన్మధన్‌' రీతిన, మన 'అర్జున్‌రెడ్డి'లా ఒక మైల్‌స్టోన్‌ మూవీ అయి వుండేది. ప్రస్తుతానికి పై పై ఎట్రాక్షన్స్‌, సోకాల్డ్‌ యూత్‌ అప్పీల్‌ వున్న ఎలిమెంట్స్‌తో బాక్సాఫీస్‌ సెన్సేషన్‌ మాత్రం కాగలుగుతుంది.

బాటమ్‌ లైన్‌: కమర్షియల్‌ మైలేజీ ఘనం!
- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?