Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు

సినిమా రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు

రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నాగచైతన్య, అను ఎమాన్యుయేల్‌, రమ్యకృష్ణ, నరేష్‌, మురళి శర్మ, వెన్నెల కిషోర్‌, పృధ్వీ, రఘుబాబు తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: నిజర్‌ షఫి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, పి.డి.వి. ప్రసాద్‌
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2018

హీరో క్యారెక్టర్‌కి చిన్న డిజార్డర్‌ పెట్టి దాంతోనే వినోదం పండించే నేర్పు వున్న మారుతి ఈసారి ఫార్ములా సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన 'పొగరుబోతు అత్త - అల్లరి అల్లుడు' కాన్సెప్ట్‌ తీసుకుని తనదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇద్దామనే ప్రయత్నంలో దారుణంగా విఫలమయ్యాడు. 'ఈగో' అనే ఎలిమెంట్‌ చుట్టూ నడిపించి ఎంటర్‌టైన్‌మెంట్‌తో బండి లాగించేయాలనే ప్రయత్నం బెడిసికొట్టడంతో 'శైలజారెడ్డి అల్లుడు' మెషీన్‌లో పడ్డ చెరుకైపోయిండు.

పాయింట్‌గా చెప్పుకోవడానికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి చాలా స్కోప్‌ వున్నదే అయినా మారుతి రచయితగా తన మార్కు అసలు ప్రదర్శించలేకపోవడంతో ఈ చిత్రం అనూహ్యంగా గాడి తప్పింది. మారుతి క్యారెక్టర్‌ కాన్‌ఫ్లిక్ట్స్‌ అయితే క్రియేట్‌ చేయగలిగాడు కానీ వాటిని ఎంటర్‌టైనింగ్‌గా ప్రెజెంట్‌ చేయడంలోనే సమస్య ఎదురైంది. ఈగో నరనరాన నింపుకున్న హీరో తండ్రిని పరిచయం చేసే సన్నివేశంలోనే అతని స్వభావాన్ని బాగా ఎలివేట్‌ చేసిన మారుతి ఆ ఈగోనే బేస్‌ చేసుకున్న హీరోయిన్‌, అత్త క్యారెక్టర్ల విషయంలో అలాంటి ఎఫెక్టివ్‌ సీన్లు క్రియేట్‌ చేయలేకపోయాడు.

స్టోరీని డ్రైవ్‌ చేయాల్సిన ఈగో ఫ్యాక్టర్‌ తేలిపోవడంతో ఇటు హీరో-హీరోయిన్‌ సన్నివేశాలు కానీ అటు 'అత్త-అల్లుడు' కాన్‌ఫ్లిక్ట్‌ కానీ వర్కవుట్‌ కాలేదు. సాధారణంగా క్యారెక్టరైజేషన్‌ని వాడుకుని సన్నివేశాలని అలరించేలా తీర్చిదిద్దడం మారుతికున్న అతి పెద్ద బలం. కానీ ఈసారి ప్రతి సీన్‌లోను మారుతి కలం మిస్‌ఫైర్‌ అవుతూ రైటింగ్‌ టేబుల్‌ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకుని, తగినంత సమయం కేటాయించలేదనే సంగతిని స్పష్టం చేసింది. కథాపరంగా ఎలాంటి ఎక్సయిటింగ్‌ పాయింట్‌ లేని ఈ తరహా చిత్రాన్ని నడిపించడానికి సన్నివేశ బలమే ప్రధానం. హాస్యంతో బలహీనతలు కవర్‌ చేసుకుని ప్రేక్షకులకి కావాల్సినంత కాలక్షేపాన్ని ఇచ్చే మారుతి ఈసారి కామెడీ విషయంలో కూడా తన ప్రతిభ చూపించలేకపోయాడు.

హీరో పక్కనే వెన్నంటి వుండే వెన్నెల కిషోర్‌ అనర్గళంగా మాట్లాడుతూ వున్నా కానీ అందులో పేలిన జోకులని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఈగోయిస్టిక్‌ అమ్మాయిని ప్రేమలో దించడానికి హీరో వేసే ఎత్తులు కూడా ఎన్నో సినిమాల్లో చూసేసిన అవుట్‌డేటెడ్‌ టెక్నిక్స్‌ కావడంతో ఆ సన్నివేశాల కోసం కేటాయించిన సమయం అంతా వృధా అయిపోయింది. ఫస్ట్‌ హాఫ్‌ ఎంత పాసివ్‌గా సాగిపోతున్నా కానీ ఇంకా కథలోకి ఎంటర్‌ కాని 'శైలజారెడ్డి' క్యారెక్టర్‌ లైఫ్‌లైన్‌లా కనిపిస్తుంది. అయితే అంత ఆలస్యం చేసి, ఇంట్రడక్షన్‌కి ముందు అంత బిల్డప్‌ ఇచ్చి పరిచయం చేసిన శైలజారెడ్డి ఫస్ట్‌ సీన్‌లోనే తేలిపోతుంది.

'ఈగో' ఎక్కువ అంటూ చెప్పుకొచ్చిన క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌లోనే ఆ లక్షణాలేం కనిపించకపోగా, ఆడవాళ్ల సమస్యల కోసం పోరాడే ఫెమినిస్టు మాత్రమే కనిపిస్తుంది. 'ఇలాంటి అహంభావిని ఎలా డీల్‌ చేస్తాడోననే' పాయింట్‌లో పడాల్సిన ఇంటర్వెల్‌ కాస్తా లేడీ పెదరాయుడు తరహాలో కనిపించిన శైలజారెడ్డి ఎంట్రీ తర్వాత పడడంతో సెకండ్‌ హాఫ్‌పై అప్పటికే ఆశలు సన్నగిల్లుతాయి. భయపడ్డట్టుగానే ద్వితియార్థంలో మొదటి రెండు సీన్లకే శైలజారెడ్డి బండారం బయటపడిపోతుంది. అత్త, అమ్మాయిల ఈగోయిస్టిక్‌ క్యారెక్టర్ల మధ్య నలిగిపోయి హాస్యం పుట్టిస్తాడనిపించిన శైలజారెడ్డి అల్లుడు... చిన్న మాట పట్టింపు మీద అయిదేళ్లుగా మాట్లాడుకోకుండా వున్న తల్లీకూతుళ్లని కలపడమే పనిగా పెట్టుకుంటాడు.

ఈగోల కథ అంటూ మొదలు పెట్టిన సినిమా కాస్తా ఈ గోల ఏంటి అనుకునేలా మారిపోయి శుభం కార్డు కోసం మొహం వాచేలా ఎదురుచూసేట్టు చేస్తుంది. ప్రథమార్ధంలో అయినా ఒకటీ అరా సన్నివేశాలు అలరిస్తాయేమో కానీ ద్వితియార్థం టోటల్‌గా దారీ తెన్నూ లేకుండా సాగిపోతూ నవ్వించడానికి నానా యాతనా పడుతుంది, పెడుతుంది. అలరించే స్టఫ్‌ లేకపోవడంతో నవ్వించడం కోసం పృధ్వీ-వెన్నెల కిషోర్‌తో చేసిన సీన్లు టైమ్‌ వేస్ట్‌ చేయడానికి మినహా మరెందుకూ దోహదపడలేకపోయాయి. అత్త మనసు గెలుచుకోవడానికి అత్యంత దయనీయంగా ఒక ఫైట్‌ సీన్‌తో ముగించేయడానికి స్క్రీన్‌ప్లే విషయంలో మినిమమ్‌ థాట్‌ పెట్టలేదనే సంగతిని తెలియజేస్తుంది.

అటు హీరోయిన్‌ని గెలుచుకోవడానికో ఫైట్‌ (అక్కినేని ఫాన్స్‌కి 'హలో బ్రదర్‌' బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కిక్‌ ఇస్తుంది), మళ్లీ అత్తని గెలుచుకోవడానికి ఇంకో ఫైట్‌... ఇంత నాసిరకం సన్నివేశాలు 'అల్లరి అల్లుడు', 'అత్తకు యముడు' టైమ్‌లో కూడా లేవేమో అనిపిస్తాయి. నాగచైతన్య స్టయిలింగ్‌ చాలా బాగుంది. నటుడిగా చాలా పరిణితి సాధించాడు. అయితే తన పాత్రని మరీ పాసివ్‌గా మార్చేయడం వల్ల మిగతా పాత్రలు డామినేట్‌ చేసాయి. రమ్యకృష్ణ ఇంకా 'శివగామి' హేంగోవర్‌లోనే వుంది. ఆమె పాత్రకి టైటిల్‌లో ఇచ్చిన వెయిట్‌ కథలో ఇవ్వలేకపోవడంతో రమ్యకృష్ణ కూడా చేయడానికేం లేకపోయింది.

అను ఎమాన్యుయేల్‌ తన పాత్రని రక్తి కట్టించలేకపోయింది. మురళి శర్మ పాత్రని బలంగా పరిచయం చేసి తర్వాత తేల్చేయడం వల్ల వేస్ట్‌ అయిపోయింది. వెన్నెల కిషోర్‌, పృధ్వీలకి ఎంత స్క్రీన్‌ టైమ్‌ ఇచ్చినా వారికి రాసిన సన్నివేశాలు, సంభాషణలు అలరించలేకపోయాయి. నరేష్‌ క్యారెక్టర్‌ బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమైంది. విజువల్‌గా రిచ్‌గా వున్న ఈ చిత్రానికి నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కలర్‌ఫుల్‌ ఫ్రేమ్స్‌తో సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది.

గోపిసుందర్‌ 'గీత గోవిందం' తరహా మ్యాజిక్‌ చేయలేకపోయినా రెండు, మూడు మంచి బాణీలనయితే అందించాడు. మారుతి సంభాషణల రచయితగా కూడా ఫెయిలయ్యాడు. అటు హాస్య సంభాషణలతో పాటు ఇటు ఎమోషనల్‌ సీన్స్‌లోను తన మార్కు చూపించలేకపోయాడు. ఇలాంటి ఫార్ములా కథలని రచయిత అలరించేలా మలచగలిగితేనే దర్శకుడు ఏమైనా చేయగలడు. రైటర్‌గా ఫెయిలైన మారుతి తనలోని డైరెక్టర్‌ చేతుల్ని కూడా స్వయంగా కట్టేసాడు.

ఈతరం ప్రేక్షకులకి నచ్చేలా ఎయిటీస్‌, నైంటీస్‌ ఫార్ములాని తీర్చిదిద్ది వుంటారనే నమ్మకాన్ని నిలువునా వమ్ము చేసిన ఈ చిత్రం ఇపుడు పూర్తిగా ప్రీ రిలీజ్‌ హైప్‌, స్టార్‌ కాస్ట్‌, ఇతరత్రా హంగుల మీదే ఆధార పడి బాక్సాఫీస్‌ వద్ద ఉనికి నిలుపుకోవాల్సి వుంటుంది. కమర్షియల్‌ మైలేజ్‌కి పైపై మెరుగులు కాస్త దోహదపడవచ్చునేమో కానీ సినిమాగా మాత్రం ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరుస్తుంది.

బాటమ్‌ లైన్‌: ఫార్ములా ఫెయిలైంది అల్లుడూ!
-గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?