Advertisement

Advertisement


Home > Movies - Reviews

Spy Review: మూవీ రివ్యూ: స్పై

Spy Review: మూవీ రివ్యూ: స్పై

చిత్రం: స్పై
రేటింగ్: 2/5
తారాగణం:
నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే, రానా దగ్గుబాటి తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
కథ-నిర్మాత: రాజశేఖర్ రెడ్డి
కూర్పు-దర్శకత్వం: గ్యారీ
విడుదల: 29 జూన్ 2023

కార్తికేయ-2 తర్వాత మరొక ప్యాన్ ఇండియా తరహా గూఢచారి కథతో ముందుకొచ్చాడు నిఖిల్. గూఢచారి అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అడివి శేష్. తాను ఈ టైప్ సినిమాలకి ఒక స్టాండర్డ్ సెట్ చేసాడు. కనుక ఏం తీసినా ఆపైనే ఉండాలి తప్ప సమాంతరంగానో తక్కువగానో ఉంటే ప్రేక్షకులు పెదవి విరిచేస్తారు. ఇంతకీ ఈ నిఖిల్ "స్పై" ఎలా ఉందో చూద్దాం. 

జై (నిఖిల్) ఒక రా ఏజెంట్. తన అన్న బోస్ (ఆర్యన్ రాజేష్) కూడా రా ఏజెంటే. అయితే ఒక ఆపరేషన్లో మరణిస్తాడు. పాకిస్తాన్ టెర్రరిష్ట్ అబ్దుల్ ఖాదిర్ (నితిన్ మెహ్తా) ని పట్టుకునే పని జై కి అప్పగిస్తారు. అతని పక్కన మరొక ఏజెంట్ కమల్ (అభినవ్ గోమఠం), వైష్ణవి (ఐశ్వర్య) మిషన్ లో భాగంగా ఉంటారు. 

అయితే అబ్దుల్ ఖాదిర్ వెనుక మరొక పెద్దహస్తం ఉందని తెలుసుకుంటారు జై అండ్ కో. అతనిని పట్టుకోవడం, అతను ఒక మిసైల్ తో భారతదేశానికి ముప్పు తీసుకొచ్చే పని చేస్తుంటే ఆ మిసైల్ ని నిర్వీర్యం చేసి ఆపడం జై అండ్ కో పని. ఈ ప్రధాన కథకి మధ్యలో సుభాష్ చంద్రబోస్ కథని తీసుకొచ్చి ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పి, అసలిక్కడ ఏం రాయాలో అర్ధం కాని విధంగా సినిమాని తెరకెక్కించారు. 

ముందు నుంచీ ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ కథకు సంబంధించిన అంశాలుంటాయని ప్రచారం జరిగింది. ఇక్కడ కథానాయకుడు జై అన్న పేరు సుభాష్ కావడం, అనుకోకుండా జై తన ఆపరేషన్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన అంశాలని తెలుసుకోవడం జరుగుతుంది. ఆ కథకి, ఈ కథకి ఏ వైరింగూ లేదు. అందుకే ఎక్కడా ఎమోషన్ అనే కరెంట్ పాసవ్వదు. 

పైగా ద్వితీయార్థం చివర్లో రానా దగ్గుబాటి ఎంటరయ్యి సుభాష్ చంద్రబోస్ మరణం గురించి ఏదో కాన్స్పిరెసీ థియరీ లాంటిది చెప్తాడు. చెప్పినా తప్పు లేదు. దానిని ఎమోషనల్ గా ప్రేక్షకుల నరాల్లోకి ఎక్కించకపోతే చెప్పిందంతా ఉత్తిదే అన్న భావన కలుగుతుంది. అసలు మనకి స్వాతంత్రం వచ్చింది సుభాష్ చంద్రబోస్ యొక్క హింసాత్మక మార్గం వల్లనే అట. కానీ బ్రిటీష్ వాళ్లు హింసకి తలొగ్గారంటే పరువుపోతుందని తామే స్వాతంత్రం ఇచ్చామని చెప్పి వెళ్లిపోయారట. దానివల్ల ఆ క్రెడిట్ అహింసాయుతంగా పోరాడిన గాంధి-నెహ్రూలకి దక్కిందట. ఈ సరికొత్త చరిత్రపాఠం కచ్చితంగా కొంతమందికి నచ్చవచ్చు. అయితే ఇది నిజమని నమ్మించేలా చెప్పాలంటే ఏదో ఉపకథలా కాకుండా దీనినే ప్రధానకథని చేసి ఎమోషనల్ గా చెప్పుంటే బాగుండేది. 

అది పక్కనపెట్టి మెయిన్ థీం లోకి వస్తే నిఖిల్ పక్కన అభినవ్ గోమఠం ఏవో పిచ్చి జోకులు వేస్తూ విదూషకుడిలా ఉంటాడు. ఎక్కడా రా ఏజెంట్ అనే సీరియస్నెస్ అతనిలో కనపడదు. హీరో పక్కన సైడ్ కిక్ అంటే కంపల్సరీగా కామెడీయే చేయాలన్న రొటీన్ ఐడియా నుంచి ఎప్పుడు బయటికొస్తారో. ఇక క్లైమాక్స్ లో దేశాన్ని నాశనం చేసే ఒక మిసైల్ ని విలన్ వదలాలనుకోవడం, దానిని హీరో గ్యాంగ్ ఆపడం ఎన్ని సార్లు చూసుంటాం? ఈ భావదారిద్రం ఇంకా ఎన్నాళ్లు?

కథగా పాతచింతకాయ అనుకుంటే కథనం అయితే ఎక్కడా నరం లేకుండా సాగుతుంటుంది. తెర మీద పాత్రలకి తప్ప అక్కడ ఏం జరుగుతోందో చాలా చోట్ల ప్రేక్షకులకి ఎమోషనల్ గా ఆర్గానిక్ గా అందని పరిస్థితి. శ్రీలంక, మయాన్మార్, జోర్దాన్, నెపాల్ ఇలా రకరకాల దేశాలు తిరిగి చివర్లో కజకిస్తాన్ బయలుదేరడంతో ముగుస్తుంది. అంటే కథగా ఇది ప్యాన్ వరల్డ్ సినిమా అన్నమాట. 

స్పై గా నిఖిల్ కొత్తగా చేసిందేమీ లేదు. ఆ సీరియస్నెస్ అతనిలో కనపడలేదు. అతని పక్కన ఉన్న అభినవ్ గురించి అల్రెడీ చెప్పుకున్నాం. కథనంలో ఉన్న కొద్దిపాటి సీరియస్నెస్ ని కూడా ఎప్పటికప్పుడు చంపేస్తూ జోకులేస్తుంటాడు. 

సాన్య ఠాకూర్, ఐశ్వర్యా మీనన్ లు ఓకే. నితిన్ మెహ్తా ట్రాక్ ఫ్లాట్ గా ఉంటే జిషు సేన్ గుప్తా పాత్ర చాలా ఔట్ డేటెడ్ గా, ప్రెడిక్టిబుల్ గా ఉంది. 

సంగీతం పరంగా పరమ వీక్. పాటలు రెండూ నీరసంగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం కొంతవరకు పర్వాలేదు. లొకేషన్స్, కెమెరా వర్క్ బాగున్నాయి. దర్శకుడే ఎడిటర్ అయితే ఒక్కోసారి ప్రమాదాలుంటాయి. తాను తీసిన ప్రతి సీన్ మీద మమకారంతో నిడివి పెంచేస్తారు. కానీ అలా కాకుండా చాలా క్రిస్ప్ గా కట్ చేసారు. ఈ విషయంలో గ్యారీని మెచ్చుకోవాలి. 

మొత్తంగా చూస్తే ఒకటి రెండు సన్నివేశాలు, నిడివి, కెమెరా వర్క్ తప్ప పాజిటివ్ గా చెప్పుకునే అంశాలేవీ లేవు. నిడివి తక్కువే అయినా కథనంలో పట్టులేక పెద్ద సినిమా చూసిన అలసట తెప్పిస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథ అనుకుని వెళ్తే నిరాశ తప్పదు. హీరో త్రివర్ణపతాకం చూపించినా, సుభాష్ చంద్రబోస్ విగ్రహం కనిపించినా ఎక్కడా నలకంత దేశభక్తి కూడా కలగదంటే ఇక అర్ధం చేసుకోవాలి ఎలా ఉందో. 

బాటం లైన్: "స్పై"స్ లేని కథనం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?