టైటిల్: స్టాండప్ రాహుల్
రేటింగ్: 1.75/5
తారాగణం: రాజ్ తరుణ్, వర్ష బొళ్ళమ్మ, ఇంద్రజ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
కెమెరా: శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటింగ్: రవితేజ జి
సంగీతం: స్వీకర్ అగస్తి
నిర్మాత: నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
రచన- దర్శకత్వం: శాంటో
విడుదల: 18 మార్చ్ 2022
2021లో “అనుభవించు రాజా” తర్వాత మళ్లీ రాజ్ తరుణ్ ఈ సినిమాతో పలకరించాడు. పబ్లిసిటీ పీక్స్ లో లేకపోయినా రాజ్ తరుణ్ మీద నమ్మకమున్న ఆడియన్స్ కి ఈ సినిమా వస్తున్నట్టైతే సమాచారముంది.
పాటలు హిట్ కాకపోవడం, ట్రైలర్ ఓకే ఓకే గా ఉండడం మొదలైన కారణాల వల్ల విడుదలవ్వగానే పరుగెత్తుకెళ్లి చూడాలనే వాతావరణం క్రియేట్ కాలేదు.
అయితే ఎటువంటి సినిమాకైనా మార్ణింగ్ షో టాక్ బాగుంటే టార్గెట్ ఆడియన్స్ కచ్చితంగా బాక్సాఫీసుకి ఊపిరందిస్తారని చాలా సార్లు ప్రూవ్ అయింది. మరి ఈ సినిమాకి ఆ పరిస్థితి ఉందా అనేది చూద్దాం.
ఏ సినిమాకైనా కథుంటుంది..ఆ కథకొక పాయింటుంటుంది.
స్థలముంది కదాని పునాదులు తీయకుండా ఇల్లు కట్టేసుకుంటే ఏమౌతుందో పాయింటుంది కదాని కథ అనే పునాది తీయకుండా సినిమా నిర్మాణం చేసేస్తే అదే అవుతుంది.
ప్రేమ మధ్యలోకి పెళ్ళొస్తే ఎడబాటొచ్చే అవకాశాలెక్కువ కనుక పెళ్ళికంటే లివిన్ రిలేషన్ షిప్ బెటరని ఇందులో చెప్పదలచుకున్న పాయింట్. అలాగే ప్యాషన్ పేరుతో ప్రొఫెషన్ వదులుకోనక్కర్లేదనేది మరొక పాయింట్.
కానీ ఆ పాయింట్స్ ని కథగా మలచడంలో కన్విక్షన్ లోపించింది. సన్నివేశ కల్పన, సంభాషణ, భావోద్వేగం ఇలా వేటిల్లోనూ మార్కులేయించుకోని చిత్రమిది.
టెక్నికల్ గా పాటలు చాలా పేలవంగా ఉన్నాయి. కొత్తదనం లేకపోవడం వల్ల సంగీతం, సాహిత్యం ఏవీ మనసుని హత్తుకోవు. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రమే.
కెమెరా, ఎడిటింగ్ విభాగాలు ఇబ్బంది పెట్టలేదు.
రాజ్ తరుణ్ సాఫ్ట్ లవర్ బాయ్ గా తేలిపోయాడు. అతనికి హైపర్ రోల్సే సెట్టవుతాయి. వర్ష బొళ్ళమ్మ ఓకే.
ఉన్నంతలో మురళీ శర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్ లు బాగా తెలిసిన ట్యాలెంటెడ్ ఆర్టిస్టులైనా కూడా సీన్, డయలాగ్ పెద్దగా కలిసిరాక వారు కూడా తమ ఉనికిని చాటుకోలేకపోయారు.
స్టాండప్ కామెడీ పేరుతో చాలా పేలవమైన ట్రాక్స్ రాసుకున్నారు. ఫస్టాఫ్ లో ఆడ-మగ తేడాలు చెబుతూ రాజ్ తరుణ్ చేసే ఒకానొక స్టాండప్ స్పీచ్ మాత్రమే కాస్త బాగుందనిపిస్తుంది. తక్కినవన్నీ తేలిపోయాయి.
జోక్ అనేది ఫ్లోలో రావాలి తప్ప జోకేస్తున్నానని చెప్పి వేస్తే నవ్వురావడం మాట అటుంచి చిరాకొస్తుంది. ఈ స్టాండప్ కామెడీలో ఉన్న ఇబ్బందే అది. చాలా బలమైన స్క్రిప్ట్ రాసుకుంటే తప్ప కష్టం. బాత్రూం సీన్స్, డయలాగ్స్ వికారంగా ఉన్నాయి.
డయలాగ్స్ కూడా ఏదో ఫిల్లింగ్ లాగా ఉన్నాయి తప్ప ఆర్గానిక్ గా లేవు. “పూనే పిల్ల కదా పోహా కలుపుతాడు” లాంటి డయలాగ్స్ కామెడీ అనుకుని రాసుకున్నారు. కానీ ఆర్టిస్టు దానిని పలికి అది కామెడీ కాదని నిరూపించాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి.
ఈ సినిమాలో కాన్ ఫ్లిక్ట్ పాయింటే పరమ వీక్. హీరోయిన్ లివిన్ రిలేషన్ ప్రొపోజల్ ని ఇంటర్వల్ బ్యాంగ్ గా పెట్టుకున్నారంటే ఇక కథలోనూ, కథనంలోనూ ఎంత డెప్తుందో అర్థమవుతుంది.
అన్నట్టు ఈ సినిమా టైటిల్ కి క్యాప్షన్ కూడా ఉంది – “కూర్చున్నది చాలు” అని. చూస్తున్నంత సేపూ చాలా సార్లు “కూర్చున్నది చాలు స్టాండప్ ఆడియన్స్” అని ఎవరో చెబుతున్నట్టుగా అనిపిస్తుంటుంది.
ఒక సీరియస్ పాయింటు పట్టుకుని దానిని ఉన్నంతలో లైటర్ వీన్ లో ముగించాలని బలవంతంగా రాసుకున్న క్లైమాక్స్ రసాభాసగా ఉంది. సినిమా అంతా ఎలా ఉన్నా కనీసం “లాస్ట్ పావు గంట నిలబెట్టేసాడు” లాంటి విన్యాసమేమన్నా ఉంటుందేమోనని వేచి చూస్తే నిరాశే మిగుల్తుంది.
బాటం లైన్: కూర్చున్నది చాలు..స్టాండప్