cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: టాక్సీవాలా

సినిమా రివ్యూ: టాక్సీవాలా

రివ్యూ: టాక్సీవాలా
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: జిఏ 2 పిక్చర్స్‌, యువి క్రియేషన్స్‌
తారాగణం: విజయ్‌ దేవరకొండ, ప్రియాంక ఝావల్కర్‌, మాళవిక నాయర్‌, కళ్యాణి, యమున, మధునందన్‌, రవివర్మ, సిజ్జు, ఉత్తేజ్‌, చమ్మక్‌ చంద్ర, కిరీటి తదితరులు
కథనం, మాటలు: సాయికుమార్‌ రెడ్డి
సంగీతం: జేక్స్‌ బిజాయ్‌
కూర్పు: శ్రీజిత్‌ సారంగ్‌
ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌
నిర్మాత: ఎస్‌.కె.ఎన్‌.
కథ, దర్శకత్వం: రాహుల్‌ సంక్రిత్యాన్‌
విడుదల తేదీ: నవంబర్‌ 17, 2018

సక్సెస్‌ ఎంత కాన్ఫిడెన్స్‌ ఇస్తుందో అంతే ఇన్‌సెక్యూరిటీస్‌ కూడా తెచ్చి పెడుతుంది. అందుకే చాలా మంది ఆ సక్సెస్‌ వదిలిపోతుందనే భయంతో తెలియకుండానే ఒక షెల్‌లోకి వెళ్లిపోయి బందీలైపోతారు, అల్టిమేట్‌గా ఫెయిలవుతారు. విజయ్‌ దేవరకొండకి ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ లేవు. 'ఇది నాపై వర్కవుటవుతుందా', 'ఇప్పుడు నేనో స్టార్‌ని కదా' అనే డౌట్స్‌ పెట్టుకోకుండా నటుడిగా ఒక కథకి తానేమి చేయగలననేది చూస్తున్నాడు. తన పాత్ర ఎంతవరకో అంతే చేస్తున్నాడు. 'టాక్సీవాలా' పూర్తిగా డైరెక్టర్స్‌ ఫిలిం. కొత్త దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ తన హీరో చేతిలో స్టీరింగ్‌ పెట్టకుండా స్టోరీనే డ్రైవ్‌ చేయనిచ్చాడు. హారర్‌ కామెడీ అనేది ఇప్పటికి ఎన్నోసార్లు విజిట్‌ చేసేసిన జోనర్‌ అయినా కానీ 'టాక్సీవాలా'ని డీసెంట్‌ వాచ్‌ అనిపించేలా నడిపించాడు.

ఏదైనా ఉద్యోగం చేసి అన్నావదినలకి సాయపడాలని చూస్తోన్న యువకుడికి (విజయ్‌) అతని వదిన (కళ్యాణి) నగలు అమ్మి డబ్బులిస్తుంది. ఆ డబ్బుతో సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని చూస్తోన్న అతనికి ఓ పాత కాంటెస్సా కారు తారసపడుతుంది. కార్‌తో పాటే గాళ్‌ఫ్రెండ్‌ (ప్రియాంక) కూడా రావడంతో హ్యాపీగా సాగిపోతున్న అతని ప్రయాణంలో ఒక కుదుపు. ఆ కారులో ఓ రహస్యముంది. అందులో ఏదో ఆత్మ వుందనే సంగతి ఆలస్యంగా తెలుస్తుంది. ఎలాగైనా ఆ 'దెయ్యం కారు'ని వదిలించుకోవాలని చూస్తాడు. కానీ అది అతడిని వదులుతుందా? అసలు ఆ ఆత్మ ఆ కారులోకి ఎందుకొస్తుంది? ఏమి చేస్తే అది అందులోంచి వెళ్లిపోతుంది?

కారే దెయ్యం కావడం అనేది నయనతార 'డోర'ని గుర్తు చేస్తుంది. కానీ అంతకుమించి ఈ రెండు సినిమాల మధ్య పోలిక ఏమీ లేదు. హారర్‌ కామెడీకి జోనర్‌కి సంబంధించిన కొన్ని క్లీషేస్‌ (పునరుక్తి) తప్పనిసరి అయినప్పటికీ దర్శకుడు రాహుల్‌ ఈ చిత్రాన్ని ఆసక్తి సడలకుండా ముందుకి నడిపించాడు. మధునందన్‌, విష్ణు పాత్రలని హీరోతో పాటు వుంచి సమయోచిత హాస్యానికి వాడుకున్న విధానంతో పాటు అవసరం లేని జంప్‌ స్కేర్స్‌, బిల్డప్‌ షాట్స్‌ లేకుండా 'దెయ్యాన్ని' కూడా గౌరవప్రదంగా ప్రెజెంట్‌ చేసాడు.

హారర్‌ కామెడీ అనగానే చీప్‌ హ్యూమర్‌కి, చీప్‌ థ్రిల్స్‌కి లొంగిపోయి క్యాష్‌ చేసుకుంటోన్న టైమ్‌లో ఇలా కథకి కట్టుబడి సన్నివేశానుసారంగా అవసరమైనంత మేరకే అన్నిటినీ పరిమితం చేసి మెప్పిస్తాడు. సెకండ్‌ హాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌ టైమ్‌లో సీరియస్‌ టోన్‌లోకి షిఫ్ట్‌ అయిందనో ఏమో తర్వాత మార్చురీలో స్లాప్‌ స్టిక్‌ కామెడీతో ఒక్కసారి ట్రాక్‌ తప్పాడు. కమర్షియల్‌ అవసరాల కోసం ఇక్కడ కాసింత కాంప్రమైజ్‌ అయ్యాడు. విజయ్‌ దేవరకొండ మరోసారి పాత్రలో ఒదిగిపోయాడు.

అంతకుముందు చేసిన ప్రభావితమైన పాత్రల ఛాయలు కనిపించకుండా చేసి, ఈ పాత్రకి అలవాటు పడేట్టు చేయడం, దీనిని వేరు చేసి చూసేలా చేయడం సమర్ధుడైన నటుడి లక్షణం. అది విజయ్‌లో పుష్కలం. కారులో దెయ్యముందని తెలుసుకున్నప్పుడు భయపడడంలో కానీ, ఆ తర్వాత రాజీ పడిపోయి ఫ్రెండ్స్‌తో దాని గురించి చెబుతున్నపుడు కానీ సదరు పరిస్థితిలో చిక్కుకున్న సగటు క్యాబ్‌ డ్రైవరే కనిపిస్తాడు. మాళవిక నాయర్‌ పర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంటుంది. తన పెయిన్‌ తెలిసేట్టు ఎమోషన్‌తో కనక్ట్‌ అయ్యేట్టు ఆమె చేయగలిగింది.

విజయ్‌ తోడుగా వుండే పాత్రల్లో మధునందన్‌, విష్ణు తమ సిట్యువేషనల్‌ హ్యూమర్‌తో అలరించారు. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన సినిమా అయినా కానీ విజువల్‌గా క్వాలిటీ మెయింటైన్‌ చేయడంలో సినిమాటోగ్రాఫర్‌ పనితనం హైలైట్‌ అవుతుంది. అలాగే చక్కని నేపథ్య సంగీతానికి తోడు, 'మాటే వినదుగా' అనే వీనుల విందయిన పాటని సమకూర్చిన జేక్స్‌ బిజాయ్‌ సామర్ధ్యం కూడా హెల్ప్‌ అయింది. నిర్మాతగా ఎస్‌.కె.ఎన్‌. కథని నమ్ముకుని అవసరం మేరకు ఖర్చు చేసాడు. కథనం, మాటలు రాసిన సాయికుమార్‌ మెప్పిస్తాడు.

అసలు ప్లాట్‌ డీటెయిల్స్‌లోకి వెళితే విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్పాయిల్‌ అవుతుంది కనుక వాటి జోలికి పోవడం లేదు కానీ ఆ కాన్సెప్ట్‌ అన్ని సెక్షన్స్‌ ఆడియన్స్‌ రిలేట్‌ చేసుకుని, యాక్సెప్ట్‌ చేసేట్టు లేదు. హారర్‌ కామెడీ ప్రధానంగా మాస్‌ని ఆకట్టుకునేది అయినా ఈ చిత్రం క్లాస్‌ అప్పీల్‌కి ఆ కాన్సెప్ట్‌ ప్లస్‌ ఎమోషన్స్‌ కారణమయ్యాయి. సాఫీగా, థ్రిల్లింగ్‌గా సాగిపోయిన ప్రథమార్ధం తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ కోసం బ్రేక్‌ తీసుకోక తప్పలేదు. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ఎమోషన్స్‌ వర్కవుట్‌ అయినా కానీ లెంగ్త్‌ ఎక్కువై నెరేషన్‌ స్లో అవుతుంది.

ఫ్లాష్‌బ్యాక్‌ తర్వాత సన్నివేశాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫోర్స్‌డ్‌ హ్యూమర్‌ లేకుండా వుండాల్సింది. క్లయిమాక్స్‌ కూడా కాన్సెప్ట్‌కి కట్టుబడడం బాగుంది. విజయ్‌ ఇప్పుడు స్టార్‌ అయ్యాడు కదా అని దాని కోసం ఎలాంటి ఎడిషన్స్‌ చేయకపోవడం ప్రత్యేకంచి మెచ్చుకోతగినది. రెగ్యులర్‌ ఫైట్‌ అండ్‌ సాంగ్‌ టెంప్లేట్‌ సినిమాల మధ్య ఉపశమనమిచ్చే ఫ్రెష్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే ఈ చిత్రానికి లిమిటెడ్‌ అప్పీల్‌ వున్నా, రిపీట్‌ వేల్యూ లేకున్నా కానీ తక్కువ బడ్జెట్‌లో రూపొందడం, క్రౌడ్‌ పుల్‌ చేసే స్టార్‌ లీడ్‌గా వుండడం వల్ల బాక్సాఫీస్‌ రిటర్న్స్‌ ఘనంగానే వుంటాయి.

ఎంగేజింగ్‌ స్టోరీ, కనువిందైన విజువల్స్‌, చక్కని మ్యూజిక్‌, ఎంటర్‌టైనింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌, విజయ్‌ దేవరకొండ పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రాన్ని చూడదగ్గ చిత్రంగా నిలిపాయి. వీకెండ్‌కి ఈ టాక్సీ హైర్‌ చేసుకుంటే ఈజీగా రెండు గంటల పాటు కాలక్షేపమైపోతుంది.

బాటమ్‌ లైన్‌: సాఫీ ప్రయాణమే!
- గణేష్‌ రావూరి