Advertisement

Advertisement


Home > Movies - Reviews

Unstoppable Review: మూవీ రివ్యూ: అన్ స్టాపబుల్

Unstoppable Review: మూవీ రివ్యూ: అన్ స్టాపబుల్

చిత్రం: అన్ స్టాపబుల్
రేటింగ్: 1.5/5
తారాగణం:
విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్స ఖాన్, రాజా రవీంద్ర, పోసాని, రఘు బాబు, పృథ్వి, విక్రం ఆదిత్య, షకలక శంకర్
సంగీతం: భీంస్ సిసిరీలియో
కెమెరా: వేణు మురళీధర్
ఎడిటర్: ఉద్ధవ్
నిర్మాత: రజిత్ రావు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
విడుదల:జూన్ 9, 2023

అన్ స్టాపబుల్ అనగానే బాలకృష్ణ టాక్ షో గుర్తొస్తుంది. అది అంత ఫేమస్ అయ్యింది. కేవలం ఆ ఫేం ని క్యాష్ చేసుకోవాలన్నట్టుగా ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి మన ముందుకొచ్చారు. విడుదలకి ముందు ఈ చిత్ర కథానాయకుడు సన్నీ మాట్లాడుతూ తాను బిగ్ బాస్ షో నుంచి బయటికొచ్చాక 30 కథలు విన్నానని, డైమండ్ రత్నబాబు చెప్పిన ఈ కథ విపరీతంగా నచ్చేసి ఒప్పుకున్నానని చెప్పాడు. అసలే రత్నబాబు "సన్నాఫ్ ఇండియా" తీసిన దర్శకుడు. అందుకే సన్నీ మాటల్ని ఎంతవరకు నమ్మాలో తెలీక "పబ్లిసిటీ..ఇది సినిమాళ్ల యాక్టివిటీ" అని సరిపెట్టుకున్నారు ప్రజలు. 

ఉన్నంతలో హడావిడి చేసి విడులైన ఈ చిత్రంలో విషయమేంటో చూద్దాం.

కొహినూర్ కళ్యాణ్ (సన్నీ), జిలాని రామదాస్ (సప్తగిరి) చిన్ననాటి మిత్రులు. జూదమాడి తల్లిదండ్రుల డబ్బు పోగొడ్తారు. తమ కామన్ మిత్రుడు షకలక శంకర్ వీళ్లకి డబ్బు పంపబోతాడు. అయితే పొరపాటున అకౌంట్ నంబర్ తప్పు కొట్టడంతో ఆ డబ్బు ఖాదర్ అనే క్రిమినల్ అకౌంట్లో పడతాయి. అక్కడి నుంచి కథ మొదలయ్యి తెగిన గాలిపటంలాగ ఎటో వెళ్లి ఎక్కడో పడుతుంది.

కామెడీ సినిమాల్లో లాజిక్కులకంటే టైమింగ్ తో కూడిన యాక్షన్, డైలాగ్స్, సరదా సన్నివేశాలు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. కానీ అవేవీ లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. తను పిలిస్తే ఎవరూ రాయమన్నారో, లేక తానే సర్వ సమర్ధుడ్ని అని ఫీలయ్యాడో కానీ కథ, కథనం, సంభాషణ, దర్శకత్వం అన్నీ తానే అయిపోయాడు డైమండ్ రత్నబాబు. సన్నాఫ్ ఇండియా తర్వాత కూడా తన మీద తనకి, డబ్బు పెట్టిన నిర్మాతకి ఇంత నమ్మకం ఉండడం ఆశ్చర్యకరం.

సప్తగిరి చేసిన కొన్ని సీన్స్ నవ్వు తెప్పించినా మిగిలినదంతా నీరసం తెప్పిస్తుంది. యూట్యూబులో కనిపించే వైరల్ పోస్టులు, ట్రోల్స్ మొదలయినవన్నీ గుట్టగా పోసి దానిని కామెడీ అనుకోమన్నాడు రచయిత రత్నబాబు. పాటలైతే మరొక టార్చర్. ఈమధ్యన హిట్ పాటలందిస్తూ ముందుకొస్తున్న భీంస్ ఇంత చిరాకు పెట్టించే మ్యూజిక్ చేసాడంటే ఆ ఘనత తనదో, దర్శకవజ్రానిదో తమకే తెలియాలి.

సిల్లీ సీన్స్ కి తోడు మన హీరో సన్నీకి అస్సలు నటన రాకపోవడం మరొక హైలైట్. తనకు తాను మాస్ హీరోగా నటించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడా తనలో నటనాప్రతిభ ఉన్నట్టు కనపడలేదు. సినిమా మొత్తంలో ఒకటి రెండు ఎక్స్ప్రెషన్స్ తో లాగించేసాడు. సప్తగిరి తెలిసిన మొహం కనుక ఉన్నంతలో తన టైమింగులో తాను నటించి కాస్తైనా నవ్వించగలిగాడు. పృథ్వి, పోసాని, బిత్తిరి సత్తి, చమ్మక్ చంద్ర వగైరా నటులంతా ఏదో అలా వచ్చిపోయే సీన్లలో కనిపించారు. నక్షత్ర, అక్సా ఖాన్లు అందాల ఆరబోతకు సరిపోయారు.

టెక్నికల్ గా సంగీతం, కెమెరా, ఎడిటింగ్ అన్నీ సహనపరీక్షకు గురి చేస్తాయి.

ఏదిపడితే అది రాసేసి, తోచినట్టుగా తీసేసి నాసిరకం సరుకుని సినిమా హాళ్లల్లో వదలడం సినిమా అనే క్రాఫ్ట్ మీద రెస్పెక్ట్ లేకపోవడమే. ఎవరి శక్తి మేరకు వాళ్లు చేస్తారనన్నది నిజమే అయినా, బేసిక్ రైటింగ్ ని బట్టి ఎంతవరకు కష్టపడ్డారో, ఏ మేరకు క్రాఫ్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చారో అర్ధమవుతుంది.

"అన్ స్టాపబుల్" పేరుతో నాన్ స్టాప్ తలనొప్పి తెప్పించిన చిత్రం ఇది. థియేటర్ లో చూడడం సంగతి అటుంచి..అసలు రేపు టీవీల్లో ఫ్రీగా చూసే అవకాశం వచ్చినా చానల్ మార్చేసే రేంజులో ఉంది.

బాటం లైన్: నాన్ స్టాప్ తలనొప్పి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?