ఈటెల రాజేందర్ కు పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను సద్దుమణిగేలా చేయడానికి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నట్లుగా భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అది నిజమే కావొచ్చు. కానీ తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి, తనతో సారూప్యత గల ఇతర రాష్ట్రాల కమల నాయకులతో భేటీ అయి, వారి మార్గదర్శనాన్ని కూడా ఈటెల ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారు పార్టీలో ఎదిగిన క్రమంలో అదే రూట్ మ్యాప్ లో తాను కూడా ముందుకు సాగాలని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నాయకుడు. 2015లో కాంగ్రెస్ నుంచి కమలదళం లో చేరిన హేమంత్ బిశ్వాశర్మకు తొలుత పార్టీలో ద్వితీయ ప్రాధాన్యమే దక్కింది. అక్కడ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మనుగా ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆ ఎన్నికలలో హేమంత బిశ్వ శర్మ చాలా చురుకుగా కష్టనష్టాలకు వెరవకుండా చిత్తశుద్ధితో పనిచేశారు.
వలస నాయకుడిగా హేమంత్ బిశ్వశర్మ ఎన్నికల రణసారథ్యం పట్ల పార్టీలోనే కొందరిలో అసంతృప్తి ఉన్నప్పటికీ వారితో స్వచ్ఛంగానే మెలుగుతూ పార్టీని ఎన్నికల రణరంగంలో ఆయన ముందుకు తీసుకువెళ్లారు. పార్టీ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి అనూహ్యంగా వరించింది. పార్టీలోకి వలస వచ్చిన నాయకుడే అయినప్పటికీ, భారతీయ జనతా పార్టీలో సాంప్రదాయాలకు భిన్నంగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన హేమంత బిశ్వశర్మకు సీఎం పదవిని అధిష్టానం కట్టబెట్టింది.
ఇప్పుడు మక్కికి మక్కీగా ఇదే ఎన్నికల సమీకరణం తెలంగాణ విషయంలో కూడా రిపీట్ కాబోతున్నదా అనే అభిప్రాయం పలువురిలో ఏర్పడుతోంది. ప్రస్తుతానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీలోకి వలస వచ్చే నాయకుల కోసం చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్ కు త్వరలోనే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మనుగా కొత్త, కీలక బాధ్యతలు పార్టీ అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ కొత్త బాధ్యతల అప్పగింత కోసం మాట్లాడేందుకే ఈటలను ప్రత్యేకంగా పిలిపించినట్లుగా కూడా సమాచారం. కొన్నాళ్లుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్ వర్గానికి, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ వర్గానికి మధ్య విభేదాలు పొడచూపుతున్నట్లుగా పుకార్లు ఉన్నాయి. ఈటల పక్కదారులు చూస్తున్నారనే పుకార్లు కూడా పుట్టాయి. వీటికి చరమగీతం పాడేందుకు ఈటలను పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించింది.
ఈ ఢిల్లీ యాత్రలో ఈటల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో కూడా భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో ముందు ఎన్నికల నిర్వహణ కమిటీ సారధ్యాన్ని చేపట్టి పార్టీని గెలువు బాటలో నడిపించి అప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఆశించవచ్చనే ఆలోచనతోనే ఈటల కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.