నంద్యాల జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని టీడీపీలో ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలో కూడా తన పట్టు నిలుపుకునేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారు. నంద్యాల టీడీపీ ఇన్చార్జ్గా తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పటికీ, అక్కడ అఖిలప్రియ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
నంద్యాల గొడవను కాసేపు పక్కన పెడదాం. ఆళ్లగడ్డలో అఖిలప్రియతో అమీతుమీ తేల్చుకునేందుకు టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి రెడీ అయ్యారు. ఇటీవల లోకేశ్ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల వర్గం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అఖిలప్రియ దంపతులు జైలుపాలయ్యారు. నంద్యాలలో వుంటున్న ఏవీ సుబ్బారెడ్డి ఇంత కాలం ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోలేదు. తనపై దాడి చేయించడంతో ఇక ఏదో ఒకటి తేల్చుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు.
భూమా నాగిరెడ్డి ఆప్తుడిగా ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డికి విస్తృతమైన పరిచయాలున్నాయి. భూమాకు సంబంధించి అన్నీ చేసి పెట్టిన వ్యక్తిగా ఏవీని అక్కడి ప్రజలు గుర్తిస్తారు. గత మూడు నాలుగు రోజుల నుంచి ఆళ్లగడ్డలో ఏవీ పర్యటిస్తూ టీడీపీ గ్రామస్థాయి నాయకుల్ని కలుసుకుంటున్నారు. వారి కష్టనష్టాలను తెలుసుకుంటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తుండడం చర్చనీయాంశమైంది. ఏవీ సుబ్బారెడ్డిది ఆళ్లగడ్డ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం.
తనపై హత్యాయత్నానికి పాల్పడిన అఖిలప్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వనని ఆయన పంతం పట్టారు. తనను అంతమొందించే వరకూ వెళ్లిన అఖిలప్రియ ఎలా గెలుస్తుందో చూస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆళ్లగడ్డలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి ప్రవేశంతో మరింతగా పార్టీకి నష్టం కలుగుతుందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వుంది. మరోవైపు వైసీపీ వెళ్లలేని, టీడీపీలో కొనసాగలేని నేతలు, కార్యకర్తలు బీజేపీ ఇన్చార్జ్ భూమా కిషోర్‌రెడ్డి నీడలో ఉండేందుకు వెళుతున్నారు.