వీళ్లకు సిగ్గు, వాళ్లకు మానం లేవనే సామెత ఏపీ బీజేపీ నేతలకు సరిపోతుందనే విమర్శ వెల్లువెత్తుతోంది. పచ్చి రాజకీయ అవకాశవాదంతో టీడీపీ నుంచి వచ్చిన నేతలను చేర్చుకుని, ఏపీలో బలపడాలని బీజేపీ ఎలా అనుకుంటున్నదో అర్థం కాదు. చంద్రబాబునాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం తహతహలాడే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎంపీ సుజనాచౌదరి తదితర నేతలంతా తెల్లారి లేచినప్పటి నుంచి టీడీపీ సేవలో తరిస్తుంటారు.
వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి, అలాగే కర్నూలులో టీజీ కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకుంటే మంచిది. సీఎం రమేశ్ అన్న సీఎం సురేష్‌నాయుడు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. లోకేశ్ పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత అన్న నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్. పాదయాత్రలో లోకేశ్ సమక్షంలో ఆదినారాయణరెడ్డిని భూపేష్ పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
ఇక కర్నూలులో టీడీపీ, బీజేపీ కార్యక్రమాలన్నీ టీజీ వెంకటేశ్ కార్యాలయం కేంద్రంగా జరుగుతుంటాయి. టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ కర్నూలు సిటీ టీడీపీ ఇన్‌చార్జ్. ఇలాంటి వాళ్లంతా ఏపీలో టీడీపీతో పొత్తు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని బలి పెడుతున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో వుండడంతో, ఆ పార్టీ నుంచి ప్రయోజనాలు పొందేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా తన మనుషులను పంపి డ్రామాలు ఆడుతోందని అందరికీ తెలుసు. కానీ టీడీపీ ప్రయోజనాల కోసం ఏపీ బీజేపీలోని కొందరు నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా, చూసీచూడనట్టు అధిష్టానం వెళుతోంది. అందుకే ఏపీ బీజేపీ నేతల్ని చూసి… వీళ్లకు సిగ్గు లేదు, వాళ్లకు మానం లేదని జనం ఛీత్కరించుకుంటున్నారు.