తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో విచారణ కొనసాగేకొద్దీ షాకింగ్ వాస్తవాలు బయటకొస్తున్నాయి. అప్సరను చంపేసిన పూజారి సాయికృష్ణ, ఆమె మృతదేహాన్ని రోజంతా తన కారులోనే ఉంచిన విషయం తెలుసుకొని పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
శంషాబాద్ లో అప్సరను హత్య చేసిన తర్వాత పూజారి సాయికృష్ణకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఆ మృతదేహంతోనే తిరిగి తన ఇంటికి వచ్చాడు. రాత్రంతా కారులోనే మృతదేహాన్ని ఉంచారు. మరుసటి రోజు సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో మృతదేహాన్ని పడేశాడు.
దీనికి సంబంధించి మరో ట్విస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన తర్వాత, సాయికృష్ణపై అనుమానంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వెంటనే అతడు బయటకొచ్చాడు. ఓ మంత్రి పీఏ అతడ్ని తన సొంత పూచీకత్తుపై బయటకు తీసుకొచ్చాడు.
అలా బయటకొచ్చిన సాయికృష్ణ, ప్రధాన అర్చకుడిగా ఓ ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. పూజలు కూడా నిర్వహించాడు. ఆ తర్వాత 8వ తేదీన పోలీసులకు లొంగిపోయాడు. 9వ తేదీన అప్సర మృతదేహం బయటపడింది.
ఈరోజు పోస్టుమార్టం
అప్సరను ఎన్ని రోజుల కిందట హత్య చేశాడు.. ఎలా హత్య చేశాడు లాంటి విషయాలు ఈరోజు వెలుగులోకి రానున్నాయి. అప్సర మృతదేహానికి ఈరోజు పోస్టుమార్టం నిర్వహిస్తారు. అంతేకాకుండా.. చనిపోయే టైమ్ కు అప్సర గర్భవతి అవునా కాదా అనే అంశంపై కూడా ఈరోజు తేల్చనున్నారు.
తను గర్భం దాల్చానని పెళ్లి చేసుకోవాలని అప్సర బలవంతం పెట్టినట్టు సాయికృష్ణ చెబుతున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు ఈరోజు నిర్థారించబోతున్నారు. అటు అప్సర-సాయికృష్ణ చాలా సన్నిహితంగా ఉండేవారని, అర్థరాత్రిళ్లు కూడా బైక్ పై బయటకు వెళ్లేవారని అప్సర చుట్టుపక్కల నివశించేవారు నిర్థారించారు.
మేనకోడలు కాదు.. భక్తురాలు మాత్రమే
ముందుగా అప్సరను సాయికృష్ణ మేనకోడలు అని భావించారు పోలీసులు. అప్సర తల్లి కూడా సాయికృష్ణను తన తమ్ముడిగా పోలీసులకు చెప్పడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఆ తర్వాత లోతుగా విచారణ సాగిస్తే.. సాయికృష్ణకు, అప్సరకు ఎలాంటి బంధుత్వ లేదని తేలింది. గుడిలో పూజలు చేసే సాయికృష్ణకు, ఓ భక్తురాలిగా మాత్రమే అప్సర పరిచయమైందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్ట్ బయటకొచ్చిన తర్వాత ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.