టైటిల్: వరుడు కావలెను
రేటింగ్: 2.75/5
తారాగణం: నాగ శౌర్య, రీతూ వర్మ, మురళీ శర్మ, నదియా, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, హిమజ, సప్తగిరి,
కెమెరా: పచ్చిపులుసు వంశి, విష్ణు శర్మ
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
విడుదల తేదీ: 29 అక్టోబర్ 2021
ఎప్పుడో మొదలైన ఈ సినిమా కరోనా కెరటాలని దాటి ఇప్పుడు తీరం చేరింది. “దిగు దిగు నాగ” పాట వివాదాస్పదం కావడంతో జనం దృష్టి మొదటిసారి ఈ చిత్రంపై పడింది.
కలర్ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తలెత్తి చూడగలిగే పోస్టర్సు తో, భావోద్వేగాలతో కూడిన లవ్ స్టోరీ అనే అంచనాలను ఏర్పరిచిన ట్రైలరుతోటీ పబ్లిసిటీ జరుపుకున్న ఈ చిత్రం ఎలా ఉందంటే…
11 ఏళ్ల క్రితం వచ్చిన “ప్రవరాఖ్యుడు” కథని తిరగరాసి 19 ఏళ్ల క్రితం విదుదలైన “మన్మధుడు” స్ఫూర్తితో తీసినట్టుంది.
ఇందులో హీరోయిన్ సీరియస్ క్యారెక్టరైజేషన్ కూడా మన్మధుడు నాగార్జున స్టైల్లోనే ఉంది. సెకండాఫులో సప్తగిరి హడావిడి కామెడీ కూడా అదే చిత్రంలోని సునీల్ క్యారెక్టర్ ని గుర్తు చేస్తుంది.
కాఫీ షాపులో పెళ్లి చూపులేంటని ఆశ్చర్యపోయే పాత్రలున్నాయంటే ఇది పాతకాలపు ఆలోచనలతో రాసుకున్నదే అనిపిస్తుంది. ఈ కాలంలో చాలామంది పేరెంట్స్ ఇన్-ఫార్మల్ గా అమ్మాయి లేకుండా కాఫీషాపుల్లోనూ, రెస్టారెంట్స్ లోనే ముందుగా పెళ్లికొడుకుల్ని కలుస్తున్నారు.
మొత్తం కథలో సగభాగం అతడు ఆమెకి దగ్గరయ్యే ప్రయత్నం, ఇంకో సగభాగం ఆమె అతనికి దగ్గరవ్వాలనుకునే విధం..ఇంతకు మించి కథనం ఎటూ వెళ్లదు.
ఫస్టాఫ్ ఎక్కడుందో సెకండాఫు కూడా అక్కడే ఉన్నట్టనిపించిందంటే ఎంత 'ల్యాగ్' ఉందో అర్థమౌతుంది. “ల్యాగ్” మీద కామెడీ ట్రాక్ నడిపించే యావలో అసలు కథలో ఎంత ల్యాగ్ ఉందో గమనించినట్టు లేరు.
ఈ టైప్ సీన్లు గత పదేళ్లుగా టీవీ సీరియల్సులో కనిపిస్తూనే ఉన్నాయి. అందుకేనేమో ఈ చిత్రం మొదటి పాటలోని ఒక లైనులో శాస్త్రిగారు ఇలా రాసారు- “అయ్యబాబోయ్ ఏం చెప్పను బ్రదరు- సీరియల్లా సోది గురు”. ఆ లైన్ క్లియర్ గా వినిపించుకుంటే తక్కిన సినిమా చూడడానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వొచ్చు.
పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా ప్రిపెర్ అయి ఉన్నారా అనే విషయంలో కొడుకుకి ఇచ్చే స్వేచ్ఛ కూతుళ్లకెందుకివ్వరు అనే పాయింటుని చర్చించాలనుకునే ఆలోచన బాగుంది. దానికి తగ్గ ట్రెండీ కథని, కథనాన్ని తీర్చిదిద్దుకోవడంలో మాత్రం కథాశాఖ ఫెయిలయ్యింది.
నాగ శౌర్య, రీతు వర్మ తమ తమ పాత్రల్ని కమెర్షియల్ లిమిట్స్ లో బాగానే పోషించారు. నదియా ఎప్పుడూ కనిపించే సీరియస్ పాత్రలో కాకుండా సగటు తల్లిలా కాస్త వేరియేషన్ చూపించింది.
మురళి శర్మ క్యారెక్టర్ వేస్టయ్యింది. మరీ ఒకటి రెండు సీన్లకే పరిమితం చేసారు. తండ్రి-కూతురు మధ్యన ప్యారెలల్ ట్రాక్ కూడా నడిపుంటే మరింత అర్థవంతంగా ఉండేది. ఒక డీసెంట్ ప్రోగ్రెసివ్ ఫాదర్ ని చూపించే అవకాశం వచ్చినా సరిగ్గా రాసుకోకుండా మిస్ చేసుకున్నారు.
చిన్న పాత్రే అయినా అమృతం హర్షవర్ధన్ తాను విలన్ పాత్రలకి బాగా సెట్టౌతానని నిరూపించుకున్నట్టాయ్యింది. ప్రవీణ్ మీద కామెడీ ట్రాక్ పెద్దగా పండలేదు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా పేలవంగా ఉంది.
సంభాషణలు మాత్రం కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు వంకపెట్టేలా లేవు. సంగీత పరంగా రెండు పాటలు చెవులనే కాదు మనసుని కూడా హత్తుకుంటాయి- “కోల కళ్ళే ఇలా” హాంటింగా ఉంటే, “మళ్లీ పసిపాపైపోతున్నానా..” సందర్భోచితంగా మూడ్ ని ఎలివేట్ చేస్తుంది.
కథ సన్నగా ఉన్నా, కథనం పాతగా ఉన్నా ప్రేక్షకుడికి మరీ భారం లేకుండా ఎడిటర్ కూడా తన వంతు కృషి చెసాడు.
సినిమా మొదలైన తర్వాత తొలి 40 నిమిషాలు నీరసంగా సాగుతాయి. తెర మీద కామెడీలాంటిదేదో జరుగుతున్నా, హీరోయిన్-హీరో మధ్యలో ఏవో సన్నివేశాలు నడుస్తున్నా ఎక్కడా ఎంగేజింగ్ గా అనిపించదు.
కానీ అక్కడి నుంచి సడెన్ గా ఒక 30 నిమిషాలు వాచ్ చూసుకోనివ్వకుండా కథలోకి లాక్కెళిపోతుంది కథనం. కథనం గాడిలో పడిందన్న ఫీలింగొస్తుంది. కానీ అంతలోనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవగానే ఒక్కసారిగా గ్రాఫ్ కింద పడుతుంది.
మళ్లీ ద్వితీయార్థం మధ్యలో సప్తగిరి ట్రాకుతో కాస్త లేస్తుంది. ఇలా పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ చివరికి ఒక ప్రెడిక్టిబుల్ ఎండింగ్ కి చేరుతుంది.
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉండి ఉన్నంతలో గుర్తుండే విషయం ఏదైనా ఉందా అంటే అది సెకండాఫులో కాసేపు కనిపించే బద్ధకస్తుడు-కంగారు మనిషి మధ్యన నడిచే కామెడీ ట్రాక్ మాత్రమే. దానినే ఇంకాస్త పొడిగించినా బాగుండేది. ఇలాంటి సినిమాలు ఎంత హిలారియస్ గా ఉంటే అంత బాగా జనాల్లోకి వెళ్తాయి. ఆ ఒక్క జాగ్రత్తా తీసుకుని ట్రెండ్ కి తగ్గట్టుగా మలచుకుని ఉంటే బాగుండేది.
బాటం లైన్: ఇంకాస్త కామెడీ కావలెను