రివ్యూ: విన్నర్
రేటింగ్: 2.5/5
బ్యానర్: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
తారాగణం: సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్, జగపతిబాబు, ముఖేష్ రుషి, అనూప్ సింగ్, అలీ, పృధ్వీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, సోనియా అగర్వాల్, కళ్యాణి తదితరులు
కథ: వెలిగొండ శ్రీనివాస్
కూర్పు: గౌతరరాజు
సంగీతం: థమన్ యస్.యస్
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు
కథనం, దర్శకత్వం: గోపిచంద్ మలినేని
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2017
గుర్రపు పందాల నేపథ్యం అనేసరికి 'విన్నర్' ప్రత్యేక అనుభూతినిచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే ఎక్స్‌పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అయితే అది కేవలం బ్యాక్‌డ్రాప్‌గానే వుండిపోయింది తప్ప ఈ సినిమాకి కావాల్సిన హార్స్ పవర్ ఇవ్వలేకపోయింది. దర్శకుడు గోపిచంద్ మలినేని చిత్రాలన్నీ సగటు వాణిజ్య సినిమా తాలూకు సూత్రాలని తు.చ. తప్పకుండా పాటిస్తుంటాయి. ఈసారి కూడా గోపిచంద్ తన శైలిని వీడలేదు. కాకపోతే కథాపరంగా ఎలాంటి ఆసక్తికరమైన అంశం, ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం లేకపోయే సరికి అతను ఎంతగా ఫార్ములాకి కట్టుబడినప్పటికీ ఇది 'విన్నర్' అనిపించుకోలేకపోయింది.
ఛైల్డ్ ఎపిసోడ్ దగ్గర్నుంచి హీరో ఇంట్రడక్షన్ వరకు, హీరో ప్రొఫెషన్ దగ్గర్నుంచి అతడికి ఏర్పడే యాంబిషన్ వరకు అన్నీ ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంటాయే తప్ప ఫ్లోలో వెళ్లిపోతున్న భావన కలిగించవు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కొడుక్కి పుట్టిన కొడుకుని ద్వేషించే తాతయ్య ఆంతర్యం ఏమిటో, ఏమి సాధించాలనుకుంటున్నాడో అర్థం కాదు. పంచ్ డైలాగులు పేల్చడం కోసం రాసుకున్న బలవంతపు ఇంట్రడక్షన్ సీన్, దానిని ఫాలో అవుతూ ఒక ఐటెమ్ సాంగ్, కట్ చేస్తే… హీరో ఒక పత్రికాధిపతి! అంటే ఏదో ఫ్యాషన్ మ్యాగజైన్ నడుపుకునే బాపతు కాదు, అతను నడిపేది డెయిలీ న్యూస్ పేపరే కానీ తన ఆఫీసులో అందరూ వయసు మళ్లిన వాళ్లే వున్నారని బాధపడి పోతుంటాడు. పార్టీలో చూసిన అమ్మాయికి దగ్గరవడం కోసం తన పేపర్‌నే వాడేసుకుంటాడు. అతడిని ఒక సగటు తెలుగు సినిమా హీరోలానే చూపించాలని అనుకున్నప్పుడు అంత బాధ్యతాయుతమైన ప్రొఫెషన్‌లో వున్నట్టుగా ఎందుకు చూపించారనేది అర్థం కాదు.
హీరోకి హీరోయిన్ పెట్టే పరీక్ష కానీ, అందుకోసం ఆమె చెప్పిన కారణం కానీ రీజనబుల్ అనిపించవు. తర్వాత వచ్చే సీన్ ఏంటనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతూ వుంటే, కనీసం ఆ సీన్‌లో ఎటువంటి సర్‌ప్రైజ్ ఎలిమెంట్ కూడా లేకపోతే టైటిల్ రోల్ అయిపోవడం కోసం ఎదురు చూస్తున్న ఫీలింగ్ వస్తుందే తప్ప టైమ్‌పాస్ అవుతోన్న భావన కూడా రాదు. హీరోకి ఇంటర్వెల్ సీన్‌లో ఛాలెంజ్ విసిరినప్పుడే అతను గెలిచేస్తాడనేది సుస్పష్టం… అఫ్‌కోర్స్, 'విన్నర్' అనే టైటిల్‌ని బట్టి అతనే 'విజేత' అని మీకు తట్టి వుండకపోయినట్టయితే. ముగింపేంటి అని తెలిసిన పోటీని ఆసక్తికరంగా వీక్షించడానికి బలమైన కథనం అవసరం. అడుగడుగునా అతడి విజయాన్ని జఠిలం చేసే సమస్యలు తలెత్తడం కీలకం. అలా జరిగినప్పుడు ఊహించిన ముగింపే ఉన్నప్పటికీ అంతవరకు పెట్టిన ఉత్కంఠ ప్రేక్షకులకి ఊరటనిస్తుంది. రొటీన్ అనిపించినప్పటికీ పైసా వసూల్ అనిపిస్తుంది.
'విన్నర్' కథనం రాసుకున్న తీరు చూస్తే, ఎలాగో హీరోనే గెలుస్తాడనేది చూసేవాళ్లకి తెలుసు కాబట్టి ఇక ఆ ప్రాసెస్‌ని ఇంట్రెస్టింగ్‌గా మార్చే ప్రయాస దేనికి అన్నట్టుంది. ఇంటర్వెల్ సీన్‌కే క్లయిమాక్స్ ఏంటనేది తెలిసిపోయిన కథలో సెకండ్ హాఫ్ ఎంత పకడ్బందీ వుండాలి? ద్వితీయార్ధం కేవలం లాస్ట్ రేస్ కోసం కాలక్షేపం చేస్తున్నట్టుగా సాగుతుంది తప్ప కట్టి పడేయడానికి కనీస ప్రయత్నం కనిపించదు. ఇక ఫైనల్ రేస్‌కి వచ్చేసరికి హీరోని కింద పడేస్తారు. వెనకబడిపోయిన హీరో లేచి వెళ్లి అందరినీ దాటేసి విజయాన్ని అందుకుంటాడు. ఏ కాలం సీన్ ఇది? దీనికంటే విలన్ ఫెయిర్‌గా పోటీలో పాల్గొన్నట్టు చూపిస్తే అయినా కొత్తగా అనిపించేది!
గుర్రపు పందాలకి ఇచ్చిన బిల్డప్ అంతా చూస్తే లాస్ట్ పంచ్ కిక్ ఇస్తుందనే ఫీలింగ్ వస్తుంది. కానీ పతాక సన్నివేశమే పేలవంగా తయారైతే, దానిని ఇంకాస్త ఇబ్బందికరంగా మారుస్తూ జగపతిబాబు సెంటిమెంట్ సీన్ కితకితలు పెడుతుంది. 'కొట్టరా వాడిని' అంటూ అప్పటికే అన్నీ పోగొట్టుకున్న విలన్ మీదకి హీరోని ఉసిగొలిపితే 'చచ్చిన పాముని ఇంకా ఎందుండీ కొట్టడం' అని విలన్ పైనే జాలి కలుగుతుంది. కమర్షియల్ సినిమా అంటే పాట, ఫైటు, కామెడీ సీన్ అన్నట్టుగా పేర్చుకుంటూ వెళ్లిపోవడమే అన్న రీతిన సాగిన 'విన్నర్' చూసి బయటకి వచ్చేసరికి రెండు గంటల బ్లాంక్‌నెస్ తప్ప సినిమా చూసొచ్చిన అనుభూతి లేదనిపిస్తే అది మీ తప్పు కాదులెండి.
సాయిధరమ్‌తేజ్ ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా పర్‌ఫార్మ్ చేసాడు. ఇంతకుముందు కనిపించిన లుక్ కంటే భిన్నమైన లుక్ ట్రై చేసాడు, బాగున్నాడు. ఈ కథకి ఇంతకంటే ఏ హీరో అయినా చేసేదేమీ వుండదు. జగపతిబాబు మరోసారి డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నది గ్లామర్ కోసమే. ముఖేష్ రుషి, అనూప్ సింగ్ మరీ రాజనాల కాలాన్ని తలపించే విలనీతో విసిగించారు. కామెడీ త్రయం పృధ్వీ, అలీ, వెన్నెల కిషోర్‌ల హాస్యం కొన్ని చోట్ల బాగా పేలింది. థమన్ సంగీతం ఈ కథంత రొటీన్‌గా సాగింది. అబ్బూరి రవి సంభాషణలు ఈ కథనమంత చప్పగా వున్నాయి. చోటా కెమెరా పనితనం మాత్రం ఈ సినిమా నిర్మాణ విలువలంత గ్రాండ్‌గా వుంది. 'నా బి,సి సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్లో టెంట్ వేస్తానే…' అంటూ పాట పాడుకున్న విన్నర్ ఏ సెంటర్లలో టెంట్ వేసుకోవడం అనుమానమే కానీ బి,సి సెంటర్లలో అయినా కొన్ని రోజుల పాటు స్టూల్ వేసుకుంటాడో లేదో చూడాలి.
బాటమ్ లైన్: రొటీన్ యార్!
గణేష్ రావూరి