ఒక చరిత్ర భూస్థాపితం, మరో చరిత్రకు శ్రీకారం

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పరిపాలన కేంద్రం. నిజాం పాలనను గుర్తుచేసే చారిత్రక కట్టడం. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేసి, పరిపాలనను పరుగులు పెట్టించిన వేదిక. అదే సచివాలయం. తెలుగు రాజకీయాలకు, ఎన్నో…

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పరిపాలన కేంద్రం. నిజాం పాలనను గుర్తుచేసే చారిత్రక కట్టడం. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేసి, పరిపాలనను పరుగులు పెట్టించిన వేదిక. అదే సచివాలయం. తెలుగు రాజకీయాలకు, ఎన్నో ప్రతిష్టాత్మక పథకాల అమలుకు, కీలక నిర్ణయాలకు సాక్షీభూతంగా నిలిచిన సెక్రటేరియట్ ఇప్పుడు చరిత్రలో కలిసిపోతోంది. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ సచివాలయం (ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం) కూల్చివేత మొదలైంది.

అర్థరాత్రి నుంచే అన్ని రకాల యంత్రాల్ని, సామగ్రిని తరలించింది ప్రభుత్వం. ఎలాంటి ఆందోళనలు జరగకుండా, ట్రాఫిక్ జామ్స్ తలెత్తకుండా కిలోమీటర్ పరిథిలో దారులన్నీ మూసేసింది. అన్నీ మరోసారి సరిచూసుకొని, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాగితాల్ని ఇంకోసారి చెక్ చేసుకొని, ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టింది. ప్రభుత్వం ఇప్పుడు కూల్చుతోంది కేవలం సచివాలయం మాత్రమే కాదు, 132 ఏళ్ళ  ఘనమైన చరిత్ర కలిగిన ఓ కట్టడాన్ని.

ఇప్పుడు కూలిపోతున్న ఈ సచివాలయం కేవలం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ మాత్రమే కాదు.. అంతకంటే ముందు పాలించిన నిజాం నవాబుల పాలన కేంద్రం కూడా ఇదే. అప్పట్లో దీన్ని సైఫాబాద్ ప్యాలెస్ అని పిలిచేవారు. 132 ఏళ్ల కిందట చిన్నగా మొదలైంది ఇక్కడ పరిపాలన కేంద్రం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జీ-బ్లాక్ అత్యంత పురాతనమైంది. ఇక్కడ్నుంచే నిజాం సెక్రటేరియట్ మొదలైంది. 1888లో ఆరవ నిజాం దీన్ని నిర్మించారు.

ఆ తర్వాత శతాబ్ద కాలంలో ఈ సెక్రటేరియట్ అంచెలంచెలుగా విస్తరించింది. ఎన్నో బ్లాకులతో సువిశాల పరిపాలన కేంద్రంగా అవతరించింది. నిజాంల తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత.. 16 మంది ముఖ్యమంత్రులు ఈ సెక్రటేరియట్ నుంచే పాలన సాగించారు. ఇప్పుడీ భవనం చరిత్రలో కలిసిపోతోంది. ఇకపై దీన్ని ఫొటోల్లో తప్ప ప్రత్యక్షంగా చూడలేం.

కొత్త సెక్రటేరియట్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భూమి పూజ చేసింది. 500 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త భవనం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన నమూనాను కూడా తాజాగా విడుదల చేసింది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాబోతున్న ఈ సచివాలయంలో.. మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శకులు, సెక్షన్ ఆఫీసర్లు ఉండేలా డిజైన్ చేశారు. పటిష్టమైన భద్రతతో పాటు.. అత్యాథునిక సౌకర్యాలతో.. మరో వందేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఈ భవనాన్ని నిర్మించబోతోంది తెలంగాణ సర్కార్.

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్