నిన్న ఒక్కరోజే తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అంతా టెన్షన్ పడే లోపే, ఈరోజు మరో 6 కరోనా పాజిటివ్ కేసులు లెక్కతేలాయి. అవును.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 33కు చేరినట్టు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ లెక్క మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. తెలంగాణలో ఇంకా 97 మంది అనుమానితులు ఉన్నారు. వాళ్ల పరీక్షలు ఇంకా పూర్తవ్వలేదు.
అయితే తెలంగాణలో కరోనా కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదని స్పష్టంచేశారు ఈటల. కనీసం వెంటిలేటర్ మీద కూడా లేరని, పైపెచ్చు ఒకరు ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో 2-3 రోజుల్లో మరికొంతమందిని కూడా డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ తాము నిర్లక్ష్యంగా లేమని, అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు.
రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గాంధీ, ఫీవర్, ఛెస్ట్ హాస్పిటల్స్ లో అవుట్ పేషెంట్ సేవల్ని పూర్తిగా నిలిపివేశారు. వైద్యులతో పాటు సిబ్బంది మొత్తం కరోనా కేసుల పైనే దృష్టిపెట్టబోతున్నారు. అటు ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెందిన సిబ్బంది కూడా తమ వంతు సాయంగా ఈ హాస్పిటల్స్ లో పనిచేయడానికి ముందుకొస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా స్టేజ్-2లో ఉందని స్పష్టంచేసిన మంత్రి.. అందుకే తెలంగాణను లాక్ డౌన్ చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా బయటకొస్తే ముందుగా కౌన్సిలింగ్ ఇస్తామని, ఆ తర్వాత ఫైన్స్ వేస్తామని, అప్పటికీ వినకపోతే జైలుకు పంపిస్తామని విస్పష్టంగా ప్రకటించారు. 31వరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ హైదరాబాద్ లో ఈరోజు ఉదయం నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. చాలా కూడళ్లలో ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడ్డాయి. అయితే మధ్యాహ్నం నుంచి పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై ఉన్న ప్రజలందర్నీ ఇంటికి పంపిస్తున్నారు. రేపట్నుంచి రోడ్లపైకి ఆటోలు, క్యాబ్ లు వస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.