మూడు రాజ‌ధానులే ముద్దు…నిన‌దించిన తిరుప‌తి

 ‘ఒక రాజ‌ధాని వ‌ద్దు…మూడు రాజ‌ధానులే ముద్దు’ అని ఆధ్మాత్మిక క్షేత్రం తిరుప‌తి నిన‌దించింది. జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై ముంద‌డుగు వేస్తున్న నేప‌థ్యంలో , తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి నేతృత్వంలో భారీ…

 ‘ఒక రాజ‌ధాని వ‌ద్దు…మూడు రాజ‌ధానులే ముద్దు’ అని ఆధ్మాత్మిక క్షేత్రం తిరుప‌తి నిన‌దించింది. జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై ముంద‌డుగు వేస్తున్న నేప‌థ్యంలో , తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అమ‌రావ‌తితో పాటు ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌, రాయ‌ల‌సీమలోని క‌ర్నూల్‌లో కూడా రాజ‌ధాని కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ జ‌గ‌న్ స‌ర్కార్‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తామంటూ  ప్ర‌జ‌లు నినాదాలు చేస్తూ త‌మ ఆమోదాన్ని తెలిపారు.

న‌గ‌రంలోని కృష్ణాపురం ఠాణా నుంచి ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలోని గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. థ్యాంక్యూ జ‌గ‌నన్న‌, థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్ల‌కార్డులు చేత‌ప‌ట్టుకుని ముందుకు క‌దిలారు. కిలో మీట‌ర్‌పైన ర్యాలీతో సీఎంకు భారీ మ‌ద్ద‌తు ప‌లికి రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించింది. ర్యాలీ అనంత‌రం గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేశారు.  అనంత‌రం ఎమ్మెల్యే భూమ‌న మాట్లాడుతూ ఇటీవ‌ల అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తిరుప‌తిలో చేప‌ట్టిన యాత్ర‌కు జ‌నం నుంచి ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌న్నారు. కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో న‌ష్టాలొస్తాయ‌నే బెంగ త‌ప్ప రాజ‌ధానిపై బాబుకు ప్ర‌త్యేక ప్రేమ లేద‌ని విమ‌ర్శించారు. సీఎం జ‌గ‌న్ తీసుకునే మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి ప్ర‌జామోదం ఉంద‌న్నారు.

తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మాట్లాడుతూ జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యం అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సీఎం అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అభినందిస్తున్నార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వైసీపీ యువ‌నేత భూమ‌న అభిన‌య్‌రెడ్డి స‌మ‌న్వ‌య‌ప‌రిచారు.