ఇండియా అంటే అది పేద దేశమే, అయితే అది ధనికులతో కూడిన పేద దేశం అని దశాబ్దాలుగా చాలా మంది ఆర్థిక వేత్తలు చెబుతూ వచ్చారు. ఆ విషయం సామాన్యులకు కూడా అర్థమయ్యే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒకవైపు లాక్ డౌన్ ఫలితంగా వలస కూలీల కష్టాలు, వారు ఎంత దుర్భర అవస్థలు పడుతున్నారో దేశానికి అర్థం అవుతూ ఉంది. ఉపాధి లేక, కనీసం సొంతూళ్లకు వెళ్లడానికి వాహన సౌకర్యాలు లేక వలస కూలీలు వందల, వేల కిలోమీటర్లు నడుస్తున్న వైనం ఇండియాలో ఉన్న దుర్భర పరిస్థితులు ఏమిటో ప్రపంచానికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాయి.
బుల్లెట్ ట్రైన్లు, అంతరిక్ష పరిశోధనలు అంటూ భారత ప్రభుత్వాలు, వ్యవస్థలు మాటలు చెబుతుంటే.. వలస కూలీలు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులను కల్పించి, భారత ప్రభుత్వం, భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కూలీల మీద తన ధోరణి ఏమిటో చాటుకున్న వైనం ఆవిష్కృతం అయ్యింది. పోయే వాడి ప్రాణం పోతూ ఉంటుంది, మరోవైపు దేశం అభివృద్ధి వైపు పోతోందని అంటూ ఉంటారు. రెండూ పొంతనలేని అంశాలు!
ఆ సంగతలా ఉంటే.. లాక్ డౌన్ వేళ వలస కార్మికుల కష్టాల వార్తల మధ్యన ఇండియాలో ధనికుల వైభవం ఏమిటో చెప్పే వార్తా ఒకటి కనిపించింది. భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి ఒక కుటుంబం విమానంలో వెళ్లింది. అదేం పెద్ద విచిత్రం కాకపోవచ్చు. అయితే ఆ విమానంలో కేవలం తమ కుటుంబం మాత్రమే ప్రయాణం చేసేట్టుగా ఆ ఫ్యామిలీ విమానయాన సంస్థతో సపరేట్ ఫ్లైట్ ను బుక్ చేసుకుంది. మొత్తం 180 మంది ప్రయాణించగల ఒక విమానాన్ని కేవలం ఆ ఒక్క కుటుంబమే బుక్ చేసుకుంది. వేరే వాళ్లు ఎవరూ ఆ విమానం ఎక్కకూడదు!
కరోనా భయాల నేపథ్యంలో భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి ఆ కుటుంబం అలా ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకుని తమ వైభవం ఏపాటిదో చూపించింది. అంతజేసీ ఆ కుటుంబ సభ్యులు నలుగురేనట. నలుగురి కోసం 180 మంది కూర్చోగల విమానాన్ని బుక్ చేసుకున్నారట. కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఈ ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నట్టున్నారు. దానికి గానూ పది లక్షల రూపాయల మొత్తాన్ని వెచ్చించారట. భోపాల్ నుంచి ఢిల్లీకి నలుగురు వెళ్లడానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని వెచ్చింది ఆ శ్రీమంతులు తమ సత్తా ఏమిటో చూపించినట్టున్నారు!