వాళ్లిద్దరూ బడికి వెళ్లే పిల్లలు. వాళ్లకు వంద రూపాయల నోటు కనిపిస్తేనే చాలా గొప్ప. కానీ వాళ్ల బ్యాంక్ ఖాతాల్లో మాత్రం 900 కోట్ల రూపాయలున్నాయి. పాపం, ఆ విషయం ఆ చిన్నారులకు తెలియదు. తెలిసిన తర్వాత తీసుకునే వీల్లేకుండా పోయింది. బీహార్ లో జరిగింది ఈ ఘటన.
గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అప్పర్ ప్రైమరీ చదువుతున్నారు. కటిహార్ జిల్లాలోని బగౌరా పంచాయతీలోని పస్తియ గ్రామంలో ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ పిల్లల యూనిఫారమ్స్ కోసం కొంత మొత్తం విద్యార్థుల ఖాతాల్లో జమచేసింది. ఆ డబ్బు తమ ఎకౌంట్లలో పడిందో లేదో చూసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన లోకల్ ప్రాసెసింగ్ సెంటర్ కు వెళ్లారు. అప్పుడు తెలిసింది వాళ్ల ఖాతాల్లో వందల కోట్లలో డబ్బు ఉందనే విషయం.
విశ్వాస్ ఖాతాలో 60 కోట్లు, కుమార్ ఖాతాలో ఏకంగా 900 కోట్ల రూపాయల డబ్బు జమ అయి ఉంది. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, మొత్తం గ్రామం ఆశ్చర్యపోయింది. బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని విద్యార్థుల రెండు ఖాతాల్ని ఫ్రీజ్ చేశాడు. విషయాన్ని ఉన్నత అధికారులకు చేరవేశారు. కేవలం సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగినట్టు గుర్తించారు.
సరిగ్గా 2 రోజుల కిందట ఖగారియా జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ టీచర్ ఖాతాలో 5.5 లక్షలు జమ అయ్యాయి. వాటిలోంచి అతడు లక్షా 61వేల రూపాయలు ఖర్చు చేశాడు కూడా. తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందిగా బ్యాంక్ అతడికి నోటీసులిచ్చినప్పటికీ అతడు వినలేదు.
లాక్ డౌన్ వల్ల మోడీ తన ఖాతాలో ఆ మొత్తం వేశారని, తను వెనక్కి ఇవ్వనని మొండికేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.