ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీలతో సందేశాలను ఇప్పిస్తున్నారు.
ఇందులో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్‌తో తన స్వీయ అనుభవాలను ప్రజలతో పంచుకునేలా చేసి, హెల్మెట్ ఆవశ్యకతను చెప్పించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని, కష్టాన్ని మిగిల్చే అవకాశం ఉండదనే సందేశాన్ని మానవీయ కోణంలో ఇప్పించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తమ సృజనాత్మకతకు సోషల్ మీడియాను కలుపుకుని ట్రాఫిక్ రూల్స్‌పై ప్రచారం చేస్తుండడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీమ్స్ ద్వారా అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రూల్స్‌పై అరటిపండు వలిచి తినిపించినట్టుగా సులభంగా అర్థమయ్యేలా సైబరాబాద్ పోలీసులు సినీ రూట్లో ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల 'చావు కబురు చల్లగా' సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. 'హెల్మెట్ పెట్టుకోండి బాలరాజు గారు.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరమూ ఉండదు' అంటూ సైబరాబాద్ పోలీసులు క్రియేట్ చేసిన సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ పరంపరలో తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమాకు సంబంధించి సరికొత్త మీమ్‌ను సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో అందులోని హెల్మెల్ ప్రస్తావనను సందర్భోచితంగా సైబరాబాద్ పోలీసులు తెరపైకి తెచ్చారు.
జాతీయ అవార్డు దక్కించుకున్న సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతూనే… ఆ సినిమాలోని ఓ ఫొటోను షేర్ చేస్తూ అద్భుతమైన క్యాప్షన్ పెట్టారు. జెర్సీ సినిమాలో నాని బైక్ నడుపుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోవాలని సెటైర్ వేశారు.
సినిమాలో నాని కొడుకు గౌతమ్ 'నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న ' అనే డైలాగ్‌కు అదనంగా 'బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో' అనే క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.