హైకోర్టులో ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాలు చెప్పిన ఏఏజీ పొన్న‌వోలు

విశాఖ‌లో  ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించి ‘గీతం’ విద్యాసంస్థ‌లు చేప‌ట్టిన నిర్మాణాల‌ను తొల‌గించ‌డంపై మ‌రోసారి హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. గీతంలో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై ఆ విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యం సంతృప్తి…

విశాఖ‌లో  ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించి ‘గీతం’ విద్యాసంస్థ‌లు చేప‌ట్టిన నిర్మాణాల‌ను తొల‌గించ‌డంపై మ‌రోసారి హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. గీతంలో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై ఆ విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యం సంతృప్తి చెంద‌లేదు. 

దీంతో సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఆదేశాలు త‌మ‌కు సంతృప్తినివ్వ‌లేదంటూ గీతం యాజ‌మాన్యం హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఇక మీద‌ట కూల్చివేత‌లు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వానికి, అలాగే కొత్త నిర్మాణాలు చేయొద్ద‌ని గీతం విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యాన్ని సింగిల్ జ‌డ్జి ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు.

అయితే తాజాగా హైకోర్టులో గీతం వేసిన అప్పీల్ పిటిష‌న్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కూల్చివేత‌కు ముందున్న ప‌రిస్థితిని కొన‌సాగించేలా సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేద‌ని, అలాగే త‌దుప‌రి కూల్చివేత‌లు చేప‌ట్టవ‌ద్ద‌ని మాత్ర‌మే ఆదేశాలు ఇచ్చారంటూ  ‘గీతం’ కార్యదర్శి బీవీ మోహనరావు   అప్పీల్‌ దాఖలు చేశారు. అంటే ఆక్ర‌మ‌ణ‌ల భూమిని తిరిగి త‌మ‌కే అప్ప‌గించేలా హైకోర్టు ఆదేశించాల‌ని ఆ పిటిష‌న్‌లో ప‌రోక్షంగా గీతం యాజ‌మాన్యం కోరుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌రంగా వాద‌న‌లు జ‌రిగాయి. ప్ర‌భుత్వ త‌ర‌పు అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వాదిస్తూ సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ప్పుడు ఒప్పుకుని, ఇప్పుడు త‌మ‌కు స‌మ్మ‌తం కాదని అప్పీల్ దాఖ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు.  

ఈ సంద‌ర్భంగా పొన్న‌వోలు ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఆక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌పై ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, రెండురోజుల్లో హైకోర్టు నుంచి అనుకూలంగా ఉత్త‌ర్వులు తెచ్చుకుంటామ‌ని స‌ద‌రు గీతం విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ శ్రీ‌భ‌రత్ ప్ర‌చారం చేస్తున్నార‌ని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని పొన్న‌వోలు ప్ర‌శ్నించి ఆశ్చ‌ర్య ప‌రిచారు. 

అంతేకాదు, హైకోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం  తమకు అప్పీల్‌ కాగితాలు అందించ‌కుండా నంబర్‌ కేటాయించడానికి వీల్లేదని, గీతం విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

దీంతో ధ‌ర్మాస‌నం కూడా స్పందించ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి తలెత్తింది. ఒక‌వేళ స‌మాధానం చెప్ప‌క‌పోతే ధ‌ర్మాస‌నంపై నెగెటివ్ ప్ర‌చారం జ‌రిగే అవ‌కాశం ఉండ‌డంతో, దానికి అడ్డుకట్ట వేసేందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘హైకోర్టులో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ప్రతివాదుల వైపు న్యాయవాదులకు కాగితాలు ఇవ్వకుండా అప్పీల్‌కు నంబర్‌ అయిందంటే, అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించింది. 

ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా, ఆ భూమిని ఇచ్చేయాలని గీతం కోరుతోందని, ఇదెక్కడి న్యాయమని పొన్న‌వోలు ప్రశ్నించారు.  గీతం తరఫు న్యాయవాది సీవీఆర్‌ రుద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలను కూల్చేశారని  చెప్పారు.

పవన్ సినిమా పోలిటిక్స్