హైకోర్టులో ఏఏజీ సాహ‌సోపేత వ్యాఖ్య‌లు

హైకోర్టులో ప్ర‌భుత్వ త‌ర‌పున వాదిస్తున్న అద‌న‌పు  అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏఏజీ) పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి సాహ‌సోపేత వ్యాఖ్య‌లు చేశారు.  మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న సర్కారు నిర్ణయాన్ని సవాలు…

హైకోర్టులో ప్ర‌భుత్వ త‌ర‌పున వాదిస్తున్న అద‌న‌పు  అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏఏజీ) పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి సాహ‌సోపేత వ్యాఖ్య‌లు చేశారు.  మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న సర్కారు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం విచారణ జరుపుతోంది.  ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ నెల 11న‌ జస్టిస్‌ రాకేశ్ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రానికి సంబంధించిన ఆస్తుల‌ను ప్ర‌భుత్వం ఎలా వేలం వేస్తుంది? ఆస్తులు వేలం వేయ‌డానికి ప్ర‌భుత్వం ఏమైనా దివాలా తీసిందా?  రాష్ట్రంలో రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు కుప్ప కూలాయ‌ని ప్ర‌క‌టిస్తామ‌ని అని ఆయ‌న హెచ్చ‌రించారు.  జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని గుర్తించుకోవాలి. 

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు విశాఖ పర్యటనకు వెళ్లినపుడు పోలీసులు అడ్డుకోవ‌డంపై  మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్ దాఖ‌లు చేసిన పిటిషన్‌పై గ‌త నెల‌లో విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అప్పుడు ఆయ‌న ఏమ‌న్నారంటే  రూ.3వేల కోట్ల వ్యయంతో చేపట్టిన రాజధాని అభివృద్ధి పనుల్ని అర్ధంతరంగా ఆపివేయడం మతిలేని చర్య కాదా అని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తరఫున సీనియర్‌ కౌన్సిల్‌ ఎస్‌ఎస్‌ ప్రసాద్ జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం గురించి తెలుసుకుందాం.  ఎవ్వరూ పరిమితులు దాటరాదు, మన భాషను మనం తెలుసుకోవాల‌ని న్యాయ‌వాది ప్ర‌సాద్ హిత‌వు చెప్పారు. అంతేకాదు, రాజధానుల పిటిషన్లను విచారించే ధర్మాసనంలో మీరు (జ‌స్టిస్ రాకేశ్‌కుమార్‌) లేరు, నేను న్యాయవాదిగా లేను అని కూడా అన్నారు. అది ఇక్కడ అప్రస్తుతమ‌న్నారు. 

రాజధాని విషయం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అంశమ‌ని తేల్చి చెప్పారు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదన్నారు. న్యాయస్థానాలు కూడా విచారణ పరిధిని, తమ పాత్రలను విస్మరిస్తున్నాయని అంతే తీవ్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ప్ర‌సాద్ త‌న అభ్యంత‌రాల్ని తెలిపిన విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దు.

ఈ నేప‌థ్యంలో జ‌స్టిస్ రాకేశ్‌కుమార్‌ పక్షపాత ధోర‌ణితో వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తూ, విచారణ నుంచి   తప్పుకోవాలని కోరుతూ రెక్యూజ్‌ పిటిషన్‌ దాఖలు చేయ‌డం గ‌మ‌నార్హం. మిగిలిన వ్యాజ్యాలతో పాటు ఈ రెక్యూజ్‌ పిటిషన్‌పై కూడా ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ ….

“నేను దేనినీ లెక్క చేయ‌ను. న్యాయ వ్య‌వ‌స్థ గురించే నా ఆలోచ‌నంతా. విచార‌ణ సంద‌ర్భంగా  మ‌న‌సులోకి వ‌చ్చిన దానిని అడ‌గ‌డం నాకు అలవాటు. ప్ర‌శ్నించిన దానికి స్ప‌ష్ట‌త ఇస్తే సరిపోతుంది. కానీ అవి దృష్టిలో పెట్టుకుని విచార‌ణ నుంచి వైదొల గాల‌ని పిటిష‌న్లు వేయ‌డం స‌రికాదు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ద‌శ‌లో ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటాన‌ని అనుకోలేదు” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదే సంద‌ర్భంలో ప్ర‌భుత్వం త‌ర‌పు అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏఏజీ) పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి దీటుగా, ఘాటుగా స్పందించారు.  

“ప్రభుత్వ ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో జరుగుతున్న విచారణ నుంచి మిమ్మల్ని (జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌) తప్పుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసే పరిస్థితులు మీరే కల్పించారు. ఈ విషయాన్ని బరువెక్కిన బాధాతప్త హృదయంతో చెబుతున్నాం. 

ప్ర‌జాప్ర‌భుత్వాన్ని  న్యాయబద్ధంగా త‌న బాధ్య‌త‌లు, విధులు  నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వాన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేయడమే కాక, వాదన వినిపించకుండా గొంతు కూడా నొక్కారు” అని తీవ్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ స్పంద‌ను జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌… విచారణ సందర్భంగా ఎన్నో అంటుంటామని, సమాధానాలు రాబట్టేందుకు పలు ప్రశ్నలు అడుగుతుంటామని, వాటికి సమాధానం ఇస్తే సరిపోతుందన్నారు. కానీ అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ అప్ర‌స్తుత కామెంట్స్‌, రాజ్యాంగ విచ్ఛిన్నం గురించి ప‌దేప‌దే ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే. కానీ హైకోర్టులో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే నిన్న‌టి ప‌రిణామాల‌ను చూడొచ్చు.

ప్ర‌భుత్వ స్థ‌లాల అమ్మ‌కాలపై దాఖ‌లైన వ్యాజ్యాల‌పై విచార‌ణ నుంచి త‌ప్పుకోవాల‌ని కోరే ప‌రిస్థితులు మీరే క‌ల్పించార‌ని ఏఏజీ సుధాక‌ర్‌రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం ఒకట్రెండు విచార‌ణ‌లే, ఒక న్యాయ‌మూర్తిపై ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. 

జ‌స్టిస్ రాకేశ్‌కుమార్‌పై ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన  రెక్యూజ్‌ పిటిష‌న్‌కు ఓ నేప‌థ్యం ఉంద‌ని ఏఏజీ మాట‌ల ద్వారా అర్థం చేసుకోవ‌చ్చు. ఏది ఏమైనా జ‌స్టిస్ రాకేశ్‌కుమార్‌పై ఆ విధ‌మైన పిటిష‌న్ వేయ‌డానికి ప్ర‌భుత్వం కూడా చాలా బాధ‌తో నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది చెప్ప‌డం విశేషం. 

బీజేపీ చిల‌కొట్టుడు