ఇప్పట్లా నిన్నమొన్నటి వరకు రోజుకొక హీరోయిన్ వెండితెరపై కనిపించే వాళ్లు కాదు. పరిమితంగా హీరోలు, హీరోయిన్లు ఉండేవాళ్లు. వాళ్ల పేర్లు, అంతమైన రూపు మనసులో ముద్ర వేసుకునేలా ప్రేక్షకులను కట్టిపడేసే వారు. ముఖ్యంగా 1990 దశకంలో రమ్యకృష్ణ , రోజా, రంభ, సౌందర్య తదితర హీరోయిన్లు తమ అందచందాలతో పోటీ పడి నటిస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.
ఆ తర్వాత కాలంలో ఓ ఎన్నికల ప్రచార నిమిత్తం వెళుతున్న అందాల రాశి సౌందర్య ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాదిలో అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగిన, ఎంతో భవిష్యత్ ఉన్న సౌందర్య దుర్మరణంతో చిత్ర పరిశ్రమ ఓ పెద్ద కథానాయికను కోల్పోయినట్టైంది.
ఇదిలా ఉండగా అప్పట్లో జగపతిబాబు, సౌందర్యలది హిట్ కాంబినేషన్‌గా చెప్పుకునే వాళ్లు. జగపతిబాబు, సౌందర్య జంటగా సినిమా అంటే…ఇక అది హిట్ అని కళ్లు మూసుకుని చెప్పేవాళ్లే. అప్పట్లో వీళ్లిద్దరి ఎఫైర్ ఉన్నట్టు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.
ఈ విషయమై ఇటీవల జగపతిబాబును ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. సాందర్యతో మీ ఎఫైర్ నిజమేనా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ…‘అవును నిజమే! నాకు, సౌందర్యకు ఎఫైర్ ఉంది’ అని ఒప్పుకున్నాడు.
అంతటితో ఆగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి ఎఫైర్ ఉండేదో జగపతిబాబు వివరించాడు. ‘నా దృష్టిలో ఎఫైర్ అంటే మంచి సంబంధం అని అర్థం. సౌందర్య సోదరుడితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. దీంతో నేను సౌందర్య ఇంటికి, సౌందర్య మా ఇంటికి తరుచూ వస్తూ పోతుండేవాళ్లం. ఈ కారణంగా జనాలు మామధ్య లైంగిక సంబంధం ఉన్నట్లు భావించారు’ అని జగపతిబాబు తనదైన శైలిలో సౌందర్యతో తన అనుబంధం గురించి వివరించాడు.