మహారాష్ట్రలో.. మళ్లీ ఎన్నికలే దిక్కా?

శివసేనకు ఝలక్ ఇచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. తమకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ శివసేన ప్రకటించుకోగా, ఆ సంగతి తమకు తెలియదని ఎన్సీపీ అధినేత ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో…

శివసేనకు ఝలక్ ఇచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. తమకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ శివసేన ప్రకటించుకోగా, ఆ సంగతి తమకు తెలియదని ఎన్సీపీ అధినేత ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాల నేపథ్యంలో.. కథకు ట్విస్ట్ ను ఇచ్చారు  పవార్. శివసేనకు తమ మద్ద ఉంటుందో లేదో ఆయన ప్రకటించలేదు. అంతకు ముందే ఆయన సోనియాతో సమావేశం అయ్యారు.  

శివసేనతో జత కడితే వచ్చే నష్టాల గురించి వారు ఒక అంచనాకు వచ్చారో ఏమో, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా బీజేపీ దాన్ని కూల దోస్తుందని భయపడ్డారో ఏమో, సేనతో చేతులు కలపడం కన్నా ప్రస్తుతానికి కామ్ ఉండటమే మేలనుకున్నారో ఏమో.. మొత్తానికి శరద్ పవార్ కొత్త ట్విస్టు అయితే ఇచ్చారు.

ఇప్పుడు శివసేన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడినట్టే. ఎన్సీపీ ఈ దశలో వెనుకడుగు వేస్తే శివసేన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడీనే అవుతుందనడంలో సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ పై ఇప్పటికే శివసేన విమర్శలు చేసింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్టుగా ప్రకటించింది. 

ఇప్పటికీ బీజేపీ మీద శివసేన విమర్శలు చేస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో..ఇప్పటికిప్పుడు మళ్లీ కమలం పార్టీతోనూ సేన చేతులు కలపలేదు. ఈ పరిస్థితుల్లో.. మహారాష్ట్రలో మరి కొంతకాలం రాష్ట్రపతి పాలన కొనసాగక తప్పేట్టుగా లేదు. శివసేనను మరింత ఇరకాటంలోకి నెట్టడానికి అయినా బీజేపీ అక్కడ మళ్లీ ఎన్నికలు తీసుకు వస్తుందేమో!