టీడీపీ కాపు వ్య‌తిరేకి …సాక్ష్యం ఇదిగో!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కులాల వారీగా రాజ‌కీయాల్లో చీలిక వ‌చ్చింది. రాయ‌ల‌సీమ‌లో కాపులు మొద‌టి నుంచి టీడీపీకి కాపు కాస్తున్నారు. కోస్తాలో మాత్రం వంగ‌వీటి మోహ‌న్‌రంగా హ‌త్యానంత‌రం భిన్న‌మైన ప‌రిస్థితులు నెల‌కున్నాయి. కానీ 2014లో మాత్రం జ‌న‌సేనాని…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కులాల వారీగా రాజ‌కీయాల్లో చీలిక వ‌చ్చింది. రాయ‌ల‌సీమ‌లో కాపులు మొద‌టి నుంచి టీడీపీకి కాపు కాస్తున్నారు. కోస్తాలో మాత్రం వంగ‌వీటి మోహ‌న్‌రంగా హ‌త్యానంత‌రం భిన్న‌మైన ప‌రిస్థితులు నెల‌కున్నాయి. కానీ 2014లో మాత్రం జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో … కాపులు గంప‌గుత్త‌గా ఆ కూట‌మికే మ‌ద్ద‌తుగా నిలిచారు. 2019 ఎన్నికలు వ‌చ్చే స‌రికి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

టీడీపీ, బీజేపీ, వైసీపీ ఒంట‌రిగానూ, వామ‌ప‌క్షాల‌తో పాటు బీఎస్పీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకుని ఎన్నిక‌ల బ‌రిలో దిగింది.  ఈ నేప‌థ్యంలో కాపు ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వంగ‌వీటి రాధాను చంద్ర‌బాబు త‌న పార్టీలో  చేర్చుకున్నారు.

ఇటీవ‌ల అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌కు వంగ‌వీటి రాధా సంఘీభావం కూడా తెలిపారు. అయితే కాపుల విష‌యంలో టీడీపీ ఆ ప్రేమ మాత్రం చూప‌డం లేదు. వంగ‌వీటి మోహ‌న్‌రంగా వ‌ర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా కాపులు డిసెంబ‌ర్ 26న అంటే నిన్న జ‌రుపుకున్నారు. క‌నీసం ఆయ‌న కుమారుడు త‌న పార్టీలో ఉన్నార‌నే స్పృహ కూడా చంద్ర‌బాబుకు లేక‌పోయింది. వంగ‌వీటికి టీడీపీ నివాళి అనే ఊసే ఎత్తలేదు.

ఇదే ప‌రిటాల ర‌వి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని  జ‌న‌వ‌రి 24న , అలాగే కోడెల శివ‌ప్ర‌సాద్ వ‌ర్ధంతిని సెప్టెంబ‌ర్ 16న పుర‌స్క‌రిం చుకుని చంద్ర‌బాబు ఏ విధంగా వారి గొప్ప‌ద‌నాన్ని కొనియాడారో అంద‌రికీ తెలుసు. ప‌రిటాల వ‌ర్ధంతినాడు బాబు అన్న‌మాట ల‌ను ఒక‌సారి గుర్తు చేసుకుందాం. “ఫ్యూడల్ పాలనపై పోరాటమే పరిటాల రవికి అందించే నివాళి . ఉదాత్త ఆశయాల కోసం జీవితాంతం పోరాడాడు. పరిటాల స్ఫూర్తితో వైసీపీ హత్యా రాజకీయాలపై రాజీలేని పోరాటం చేయాలి” అని బాబు అన్నారు.

అలాగే కోడెల శివ‌ప్ర‌సాద్ వ‌ర్ధంతి నాడు బాబు ,ఆయ‌న కుమారుడు లోకేశ్ ట్వీట్ల‌ను ప‌రిశీలిద్దాం.

“కోడెల డాక్టర్ గా పల్నాటి బిడ్డ .. రాజకీయ నాయకుడిగా పల్నాటి పులి. ఎవరేమి చేసినా ప్రజల మనసుల్లో కోడెల చిరస్మరణీయంగా ఉంటారు. ఆయ‌న జ్ఞాప‌కాల‌ను ఎవరూ చెరిపి వేయలేరు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్పీకర్ గా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయం” అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

లోకేశ్ స్పందిస్తూ …”డాక్టర్ గా పేదలకు సేవ చేయడంతోపాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్స చేసి శాంతిని ,అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటీషియన్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాద్ రావు.  మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల మంత్రి వర్గంలో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారు” అని కొన‌యాడారు.

వీళ్లిద్ద‌రూ చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. వ్య‌క్తుల గొప్ప‌ద‌నాలు కులం ప్రాతిప‌దికన ఉంటాయా? లేక వారి త్యాగాల ఆధారంగానా? అనేది టీడీపీ నేత‌లు చెప్పాల్సి ఉంది. వంగ‌వీటి రాధాను పార్టీలో చేర్చుకుని ఆయ‌న తండ్రి ప‌లుకుబ‌డిని సొమ్ము చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ఎత్తులు వేశారు.

రాజ‌కీయ నాయ‌కుడైన చంద్ర‌బాబు అలా చేయ‌డంలో ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టారు. అయితే త‌న‌యుడు త‌న పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ, రంగా వ‌ర్ధంతిని విస్మ‌రించ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని కాపులు ప్ర‌శ్నిస్తున్నారు.  

ఇదే రంగా వ‌ర్ధంతిని వైసీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌తో పాటు కాపు సంఘాల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ న‌గ‌రంలోని కేఎల్ రావు న‌గ‌ర్ కుండ‌ల మార్కెట్ వీధి ఎదురుగా ఉన్న వైసీపీ కార్యాల‌యంలో శ‌నివారం వంగ‌వీటి మోహ‌న్‌రంగా వ‌ర్ధంతికి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు హాజ‌ర‌య్యారు. 

అలాగే ప‌లుచోట్ల వైసీపీ నేతల ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం, ర‌క్త‌దానం, పండ్లు త‌దిత‌ర పంపిణీ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.  అలాగే విజ‌య‌వాడ‌లో రాయ‌ల్ హోట‌ల్ వ‌ద్ద రంగా విగ్ర‌హానికి జ‌న‌సేన రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పోతిన వెంక‌ట మ‌హేశ్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. రంగా పేరును ఏదైనా జిల్లాకు పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

కానీ రాష్ట్రంలో క‌నీసం ఒక్క‌చోటైనా టీడీపీ రంగా వ‌ర్ధంతిని జ‌ర‌ప‌క‌పోవ‌డంతో, ఆయ‌న్ను ఆ పార్టీనే అంత‌మొందించింద‌నే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు టీడీపీ కాపుల వ్య‌తిరేకి అని రంగా వ‌ర్ధంతే నిరూపిస్తోంద‌ని ఆ సామాజిక వ‌ర్గ నాయ‌కులు చెబుతున్నారు. 

టీడీపీకి కేవ‌లం ఓట్ల వ‌ర‌కే కాపులు గుర్తుకొస్తార‌ని, ఆ సామాజిక‌వ‌ర్గం దేవుడిగా ఆరాధించే వంగ‌వీటి మోహ‌న్‌రంగాను నాయకుడిగా గుర్తించ‌డానికి కూడా నిరాక‌రిస్తోంద‌ని చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని కాపులు చెబుతున్నారు. సాక్ష్యాల‌తో స‌హా చెబుతుంటే కాద‌న‌డానికి మ‌న‌మెవ‌రం?

జ‌గ‌న్ రికార్డ్ సృష్టించిన‌ట్లేనా..!