బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. దిశను మార్చుకుని కేసీఆర్ ని బలంగా ఢీకొట్టింది.. విచిత్రం ఏంటంటే.. ఈ వాయుగుండం ప్రభావంతో కొత్త సచివాలయ నిర్మాణం లైమ్ లైట్లోకి వచ్చింది.
278 అడుగుల ఎత్తు, ఏడు ఫ్లోర్లు, మొత్తం 200 చాంబర్లతో అత్యాధునికంగా దీన్ని నిర్మించబోతున్నారు. 400 నుంచి 500 కోట్ల రూపాయల అంచనా వ్యయం. ఇంత ఖర్చు పెట్టి సచివాలయం కట్టే కంటే, డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయొచ్చు కదా అనేది ఇప్పుడు ప్రశ్న.
బాగానే సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టి.. ప్రజా ధనం వృథా చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. గతంలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు న్యాయస్థానాల్లో చేసిన పోరాటం ఫలించలేదు. దీంతో కొత్త ప్రాజెక్ట్ కి బీజం పడింది.
అయితే ఇప్పుడు అకాల వర్షాలతో హైదరాబాద్ నీట మునగడంతో.. అందరూ సచివాలయంపై పడ్డారు. కేసీఆర్ సోకుల కోసం వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం కట్టడానికి నిధులు కేటాయిస్తారు కానీ, నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడానికి ఒక్క రూపాయైనా వెచ్చించారా అని సగటు నగర జీవి ప్రశ్నిస్తున్నాడు.
ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ నీట మునగడం ఇది ఎన్నోసారి? గతంలో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు హడావిడిగా ఏం చేశారు? పోనీ అప్పడు ఆంధ్రా పాలకులు హైదరాబాద్ ని నిర్లక్ష్యం చేశారనుకుందాం.. తొలి దఫా విజయవంతంగా ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని, రెండో దఫా గద్దెనెక్కిన కేసీఆర్ సర్కారు ఏం చేసింది.
ఇంకా ఆంధ్రా పాలకులపై దుమ్మెత్తి పోయడంతోనే సరిపెడతారా? అంతా వాళ్లే చేశారు అని తమ తప్పుల్ని కప్పి పుచ్చుకుంటారా? అసలు కేసీఆర్ అర్జంట్ గా నిర్మించాల్సింది కొత్త సచివాలయాన్నా? సరికొత్త డ్రైనేజీ వ్యవస్థనా? ఇలా ఓ రేంజ్ లో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది, దాంతోపాటు.. ఆక్రమణలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది కాదనలేని సత్యం. ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, చోటా మోటా నాయకులు జేబులు నింపుకోడానికి అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇప్పించి, అధికారులను ఒప్పించి మరీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు.
అర్జంట్ గా కేసీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే.. త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. రామలింగారెడ్డి మరణం కారణంగా వచ్చిన ఈ ఉపఎన్నికల్లో సింపతీ గెలుస్తుందా లేక వర్షాల వల్ల వచ్చిన వ్యతిరేకత నిలుస్తుందా అనేది తేలిపోతుంది.
అక్కడ సింపతీయే గెలవొచ్చు కానీ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కేసీఆర్ ప్రజల్ని ఇంకా ఎక్కువకాలం మభ్యపెట్టే అవకాశం లేదు. సచివాలయం కంటే ముందు ఆయన డ్రైనేజీ వ్వవస్థపై దృష్టిపెట్టాలి. అప్పుడే గ్రేటర్ ప్రజలు కేసీఆర్ ను నమ్ముతారు.