ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ రాజకీయ వేడి చూస్తే మాత్రం రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగా ఉంది. పవన్ కల్యాణ్ సభలు కానీ, చంద్రబాబు ప్రెస్ మీట్లు కానీ, బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలు కానీ.. ఎన్నికల టైమ్ ముంచుకొచ్చిందేమో అనిపించేలా చేస్తున్నాయి.
విశేషం ఏంటంటే.. రెండేళ్ల ముందుగానే రాజకీయ పార్టీలన్నీ తమ అజెండాలను ఫిక్స్ చేసుకున్నాయి. ఏ విషయంలో పోరాటం చేయాలో కూడా డిసైడ్ అయ్యాయి.
కాపు రిజర్వేష్ పై బీజేపీ..
ఇటీవల జీవీఎల్ వంటి వారి వ్యాఖ్యలతో ఏపీలో బీజేపీ అజెండా ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. కాపు ఓట్లపై ఆ పార్టీ భారీగా నమ్మకం పెట్టుకుంది. అందుకే కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తోంది. వరుసగా కాపు లీడర్లతో సమావేశాలు పెడుతోంది. విచిత్రం ఏంటంటే.. ముద్రగడ పద్మనాభం వంటి నాయకులకు ఈ సమావేశాల్లో చోటు లేదు, కాపు సంఘాల నాయకులకు కూడా చోటు లేదు.
కేవలం బీజేపీలోని కాపులను, మరో వర్గాన్ని మాత్రమే తీసుకుని సమావేశాలు పెడుతున్నారు. దీంతో కాపులు కూడా బీజేపీపై మండిపడుతున్నారు. కాపుల్ని విభజించి పాలించాలంటే కుదరదని అంటున్నారు.
రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన విధానం ఉండాలంటున్నారు. అయితే ఒకరకంగా కాపులకు బీసీ రిజర్వేషన్లు అనే అంశంపై బీజేపీ ఎంతోకొంత ప్రయత్నిస్తోందనే విషయం జనాల్లోకి వెళ్లేలా ఉంది. మరి రెండేళ్ల తర్వాత కూడా బీజేపీకి ఇదే ప్రధాన అజెండా అవుతుందో లేదో చూడాలి.
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్..
ఆ మధ్య రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తగానే.. ప్రత్యేక హోదా విషయం కూడా తెరపైకి వచ్చింది. విభజన విషయంలో కాంగ్రెస్ ని విలన్ గా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే, హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు. ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ కి అధికారం వస్తే కచ్చితంగా హోదా ఇప్పిస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు.
అయితే ఇది కేవలం పగటి కలగానే మిగిలిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ సపోర్ట్ తో ప్రభుత్వం ఏర్పడినా, రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి కోలుకోవడం అసాధ్యం. కానీ 2024 ఎన్నికలకు కాంగ్రెస్ కి ఓ అజెండా పాయింట్ మాత్రం ఇంకా సజీవంగానే ఉంది అనే విషయం ఇప్పుడు రుజువవుతోంది.
జగన్ పాలనపైనే టీడీపీ గురి..
టీడీపీ 2-3 అంశాలను ప్రధానంగా లేవనెత్తుతున్నా.. జగన్ పాలనపైనే దృష్టిపెడుతోంది. ఎప్పటికప్పుడు పార్టీ మీటింగ్ లు పెడుతూ చంద్రబాబు నాయకుల్లో చురుకు పుట్టించడానికి చూస్తున్నారు. ఇప్పటికీ కదలని నాయకుల్ని ఇక పార్టీ మోయలేదని వార్నింగ్ లు ఇస్తున్నారు. టీడీపీ మైనస్ పాయింట్ ఏంటంటే.. ఇప్పటి వరకూ స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ ఏమీ చేయలేకపోవడం. దీంతో పార్టీ పరిస్థితిపై నాయకులు, కార్యకర్తలే నైరాశ్యంలో ఉన్నారు. రెండేళ్లలో అది తొలగిపోవాలనుకుంటున్నారు.
టీడీపీ ప్రధాన అజెండా జగన్ పాలన, చేస్తున్న అప్పులు. సంక్షేమం బాగున్నా, అభివృద్ధి పనుల్లో నత్తనడక.. వీటిని హైలెట్ చేస్తూ చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. 2024లో కొత్తగా సంక్షేమ పథకాలను ప్రకటించే దమ్ము చంద్రబాబుకి లేదు, ఆ అవకాశం కూడా ఆయనకు ఇవ్వడంలేదు జగన్. అందుకే జగన్ పాలనలో లోపాలంటూ బాబు జనంలోకి రాబోతున్నారు.
బాబుతో పాటే పవన్ కల్యాణ్ కూడా అదే అజెండాని పట్టుకున్నారు. వివిధ వర్గాలకు అన్యాయం జరిగిందంటూ.. ఆయన అందరితో సమావేశాలు పెడుతూ జగన్ ని తిడుతూ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
వైసీపీ – నవరత్నాలు, 3 రాజధానులు
వైసీపీ మాత్రం ముఖ్యంగా నవరత్నాలను కొనసాగించేందుకు మరోసారి తమ పాలనే రావాలని జనం వద్దకు వెళ్లేందుకు రెడీగా ఉంది. రెండేళ్ల తర్వాతయినా జగన్ ఇదే అజెండాతో ముందుకెళ్తారు. గత ఎన్నికల్లో నవరత్నాలను ప్రవేశ పెడతానన్నారు, ఈ ఎన్నికల్లో వాటిని కొనసాగించాలంటే తనకే సాధ్యమని చెప్పబోతున్నారు. ఇక మూడు రాజధానుల అంశం కూడా జగన్ కి బాగా కలిసొచ్చేలా ఉంది.
గతంలో మండలిలో బలం లేక వెనకబడిపోయామని, మరోసారి పూర్తి మెజార్టీ ఇస్తే.. మూడు రాజధానులను అభివృద్ధి చేసి తీరతామని చెప్పబోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే అభివృద్ధి మెరుగవుతుందని, సంక్షేమంతో పాటు, అప్పుడు సమానంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని జగన్ చెప్పబోతున్నారు.
ప్రస్తుతానికైతే ప్రధాన పార్టీల అజెండాలు ఇవే.. 2024 నాటికి ఏ పార్టీ ఎజెండా ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏదైనా సాధ్యమే.