మూడు నెలలుగా థియేటర్లు మూసేశారు. బుల్లితెర, వెండితెర షూటింగ్‌లు అటకెక్కాయి. సినీ సెలబ్రిటీలు ఇళ్లకు పరిమితమ య్యారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చట్లు చెప్పుకుంటూ….వినోదం పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ఓ సినిమా ఏకంగా ద్విశతదినోత్సవాలు జరుపుకుంటుండం విశేషం. ఆ సినిమా పేరు అమరావతి. కరోనా మహమ్మారి విజృంభిస్తూ మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నా…రాజధాని సినిమా మాత్రం నిరాటంకంగా ఆడింది.
ఆ సినిమా ఈనాడు, ఆంధ్రజ్యోతి అనే తెరలపై ఆడించారు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమంటే…నటులు తప్ప ప్రేక్షకులు లేకపోవడం. ఈ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా OTTలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తమను తాము మలుచుకోవడం కరోనా తీసుకొచ్చిన అతి పెద్ద, గొప్ప మార్పుగా సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనాడులో ‘సమరావతి’ శీర్షికతో, ఆంధ్రజ్యోతిలో ‘కలలకు సమాధి’ శీర్షికతో సమీక్షలు రాసుకున్నాయి. అయితే రేటింగ్ మాత్రం అడగ వద్దండోయ్. సమరావతి…ఎవరు ఎవరితో సమరం, కలలెవరివి? సమాధి కట్టిందెవరు?
ఈనాడులో నేడు రాసిన అమరావతి సినిమా సమీక్ష చదివితే రాజధానిలోని డొల్లతనాన్ని అర్థం చేసుకోవచ్చు.
‘పచ్చదనం పరుచుకున్న నేల ప్రతిష్ఠాత్మక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న వేళ వారంతా సంబరపడ్డారు. తమ త్యాగాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని గుర్తించారు. ఇంతలోనే వారి ఆశలపై మబ్బులు కమ్మాయి’
అసలు త్యాగమంటే అర్థమేంటి? త‌్యగానికి బ్రహ్మకుమారీలు ఇచ్చిన నిర్వచనం ఏంటో ముందుగా తెలుసుకుందాం.
‘నిజానికి త్యాగమనేది ఎంతో లోతైనది, విలువైనది. ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవ డమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యజించాలి. ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి? అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు. త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం’…ఇది నిజమైన త్యాగానికి అర్థం, పరమార్థం.
మరి రాజధాని అమరావతి కోసం 29,881 మంది రైతులు 34,500 ఎకరాలు త్యాగం చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి గగ్గోలు పెట్టడం ఎవరి కోసం? ఎందుకోసం? అలాగే టీడీపీ, మరికొన్ని ఇతర పార్టీల నేతల త్యాగ మాటలు ఎవరి ప్రయోజనాల కోసం? రాజధాని కోసం వేలాది ఎకరాలు త్యజించామని ఒకవైపు గొప్పలు చెబుతూ…మరోవైపు తామేదో పోగొట్టుకున్నామనే ఏడుపులెందుకు? ఇందులో ఏది నిజం? త‌్యాగమా? స‌్వార్థమా?
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో అమరావతిపై రాసిన కథనాల్ని చదివితే ఎంత సేపూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినిందనే ఏడుపు తప్ప…సామాన్యుల గురించి ఒక్క మాటైనా ఉందా?
త్యాగం గురించి భూమి బద్దలయ్యేలా , ఆకాశం విరిగి పడేలా రాస్తున్నారే, ఏడుస్తున్నారే…మరి అంత గొప్ప పవిత్ర స్థలంలో పేదోళ్ల నివాసానికి జానెడు స్థలం పొందడానికి అర్హులు కారా? జగన్ ప్రభుత్వం విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలివ్వాలన్న ప్రతిపాదిస్తే ఎందుకు అడ్డుకున్నారో చెబుతారా? ఇదేనా అమరావతి రైతుల త్యాగం?
ఈ పరిస్థితుల్లో రాజధానికి ఉద్యమానికి రాష్ట్ర ప్రజల నుంచి ఎందుకు మద్దతు లభిస్తుంది? ‘అంతా మా కోసమే బతకాలి…మేము మాత్రం మా కోసమే’ అనే రీతిలో రాజధాని రైతులు వ్యవహరిస్తే ఎవరికి నష్టం? అందుకే రాజధాని సినిమా అట్టర్ ప్లాప్ అయింది. కాకపోతే ప్రచార, ప్రసార సాధనా సంపత్తి ఉండడం వల్ల ఆడని సినిమాకు ద్విశతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రజలతో సంబంధం లేని ఏ పనీ సక్సెస్ సాధించలేదనే సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అందరూ కలిసి రావాల్సి ఉంది.
-సొదుం