అమరావతిలోనే ఏకైక రాజధాని ఉండాలంటూ నిన్న తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పదేపదే కుల ప్రస్తావన వచ్చింది. అది కూడా అమరావతి కమ్మ సామాజిక వర్గానిదే అని జగన్ ప్రభుత్వం, వైసీపీ కుల ముద్ర వేసిందని నేతల ప్రసంగాల్లో ఆవేదన కనిపించింది. అమరావతిపై ఏపీ ప్రభుత్వ కుల ముద్ర వేయడం గురించి ఎంత మందికి తెలుసో తెలియదు. కానీ, వీళ్లు మాత్రం పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించడం ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ అమరావతిపై కుల (కమ్మ) ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మందికి ఎందుకంత కుళ్లు అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను తన కోసం కట్టుకున్నానా? అని ప్రశ్నించారు. అక్కడ తాను చేసిన అభివృద్ధిని చూసే ఏపీలో అధికారం కట్టబెట్టారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని చంద్రబాబు అభివృద్ధి చేయడం వెనుక ‘రియల్’ వాస్తవాలన్నీ జనానికి బాగా తెలుసు అనే సంగతిని చంద్రబాబు విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినీ నటుడు మురళీమోహన్‌తో పాటు చంద్రబాబు సామాజిక వర్గానికి అక్కడే భూములు ఎందుకు ఎక్కువ ఉన్నాయో ఓ పరిశోధక విద్యార్థిని సవివరంగా లోకానికి చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక తిరుపతి సభ విషయానికి వస్తే…వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ వెటకారంగానైనా చౌదరీల గురించి ప్రస్తావించారు. ‘సోదర,సోదరీమణులు అంటూ సంబోధించినా చౌదరీ, చౌదరీమణులుగానే మా వైసీపీ నేతలకు వినిపిస్తోంది’ అని వ్యంగ్యంగా అన్నారు. రఘురామ వెటకరిస్తూ మాట్లాడినా…వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగా అమరావతి కమ్మ సామాజిక వర్గానిదే అని మరింత బలంగా చెప్పినట్టైంది. పచ్చ కామెర్లున్న వ్యక్తులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా…రఘురామ పరిస్థితి తయారైంది. జగన్ ప్రభుత్వం ఏం చేసినా రఘురామకు వ్యతిరేకంగానే కనిపిస్తుంది. ఎందుకంటే సార్ తలకిందులుగా వేలాడుతున్నారని ఆయన పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
ఇలా నిన్నటి సభలో ప్రతి ఒక్కరూ అమరావతిపై కుల ముద్ర అంటూ పదేపదే తమకు తాముగానే ఆ ప్రాంతం కమ్మ సామాజిక వర్గానికి చెందిందంటూ ప్రచారం చేయడం గమనార్హం. వైసీపీ, ఏపీ ప్రభుత్వం అమరావతిపై కుల ముద్ర వేసినా, దాన్నే పట్టుకుని ప్రత్యర్థులు ప్రచారం చేయడం….అధికార పార్టీ పనిని సులువు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.