పేరుకు ప్రాచుర్యం… గమ్యం భాగ్యనగరం..!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో ఎన్ని మంచి పనులు చేశారు? ఏం సాధించారు? అనే విషయాలు అలావుంచితే, ఆయన ఎంతో కష్టపడి చేసిన పని ఏమిటంటే 'అమరావతి' అనే…

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో ఎన్ని మంచి పనులు చేశారు? ఏం సాధించారు? అనే విషయాలు అలావుంచితే, ఆయన ఎంతో కష్టపడి చేసిన పని ఏమిటంటే 'అమరావతి' అనే పేరుకు ప్రాచుర్యం కల్పించడం. హైదరాబాద్‌ అంటే తెలియనివారుండరు. అలాగే అమరావతి అంటే తెలియనివారుండరు. రాష్ట్రం విడిపోకముందు అమరావతి అంటే ప్రసిద్ధ శైవ క్షేత్రం. గుంటూరు జిల్లాలోని ఓ చిన్న ఊరు. చరిత్ర పుస్తకాల్లో దానికో ప్రత్యేకస్థానం ఉంది. బౌద్ధమతంతో, సంస్కృతితో ముడిపడి ఉంది. రాష్ట్రం విడిపోయిన తరువాత పదేళ్లు హైదరాబాదును రాజధానిగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నా, చంద్రబాబు నాయుడు ఏపీకి తరలివెళ్లిపోయారు. రాజధాని నిర్మాణానికి సంకల్పించి దానికి 'అమరావతి' అని నామకరణం చేశారు. అప్పటినుంచి ఏపీ రాజధాని అమరావతి అని పేరుబడింది.

విదేశాల్లో సైతం ఏపీ రాజధాని పేరు పాపులర్‌ అయింది. అమరావతి అనే నగరం లేకపోయినా ఉందని అనుకునేలా చేశారు చంద్రబాబు. ఇది ఆయన సాధించిన టెక్నిక్‌. ఐదేళ్లపాటు బాబుపాలన ఎలా ఉన్నా ఆయన అమరావతి నిర్మాణం గురించి చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. బాబుతో పాటు టీడీపీ అనుకూల మీడియా కూడా అమరావతి నిర్మాణంపై పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించింది. టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసింది. అమరావతి ఎలా ఉంటుందో గ్రాఫిక్స్‌ చిత్రాల్లో చూపించింది. అమరావతి నిర్మాణంపై బాబు చేసిన విన్యాసాలు, చూపించిన 'అరచేతిలో స్వర్గాలు', విదేశాల్లో ప్రచారం, వాటితో రకరకాల ఒప్పందాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. చివరకు అమరావతి కాస్త 'భ్రమరావతి' అయింది. ప్రభుత్వం నయాపైసా ఖర్చు పెట్టకుండా వేల ఎకరాల భూమి సేకరించిందని, ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగలేదంటూ మీడియా ఊదరగొట్టింది.

బాబు అతి ప్రచారం మానుకొని, దేశీయ నిర్మాణ కంపెనీలతోనే అమరావతి నిర్మాణం మొదలుపెట్టివుంటే కొంతలో కొంతైనా పురోగతి ఉండేదేమో. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి పేరు వినబడటంలేదు. నిర్మాణాలు ఆగిపోయాయి. ఇదో పెద్ద కుంభకోణమని, దీని అంతు తేలుస్తామని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ 'ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని మనకు అవసరం లేదు. అది సాధ్యం కూడా కాదు. ఓ మంచి రాజధాని ఉంటేచాలు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక రాగానే దాని సిఫార్సుల ప్రకారం నిర్మాణం చేపడతాం'.. అని చెప్పారు. అత్యుత్తమం కాకపోయినా ఓ మోస్తరు రాజధాని నగరమైనా జగన్‌ పాలనలో పూర్తవుతుందేమో చూడాలి. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులంతా పోలోమని ఆంధ్రాకు వెళ్లిపోతారని కొందరు అనుకున్నారు.

కాని ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి, సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తప్ప ఆంధ్రాలో స్థిరపడేందుకు ఎవ్వరూ వెళ్లడంలేదు. చంద్రబాబు నాయుడే ఆంధ్రాలో స్థిరపడటానికి ఇష్టపడలేదు కదా. ఆంధ్రాకు వస్తే 'స్థానికత' ఇస్తామని బాబు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదు పని అయిపోతుందని , రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అంటుందని కొందరు ఏపీ వీరాభిమానులు ఊహించారు. కాని విభజన తరువాత కూడా ఏపీ నుంచి హైదరాబాదుకు వలసలు పెరిగాయిగాని తగ్గలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇంకా పెరిగిపోయింది. రకరకాల కారణాలతో హైదరాబాదులోనే స్థిరపడటానికి ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులకు ఆంధ్రాలోని తమ ప్రాంతాలపట్ల ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ అక్కడికెళ్లి ఏం చేయాలి? అనే ప్రశ్న వేసుకుంటున్నారు.

హైదరాబాదులా సకల సౌకర్యాలతో, ఉపాధి అవకాశాలతో, విద్యా కేంద్రాలతో, అత్యాధునిక ఆస్పత్రులు వగైరా సౌకర్యాలతో ఉన్న నగరం ఆంధ్రాలో లేదు. అసలు రాజధానే లేదు. కొన్నితరాల కిందట హైదరాబాదులో, తెలంగాణ జిల్లాల్లో స్థిరపడినవారిలో చాలామంది ఆంధ్రాలో ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నారు. ఎప్పుడో వచ్చి స్థిరపడిన పెద్దవారికి సొంత రాష్ట్రంపై మమకారం ఉన్నా హైదరాబాదులోనే పుట్టి పెరిగి, ఇక్కడే చదవుకొని, ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ఆంధ్రా మీద అసలు మోజు ఉండే అవకాశం లేదు.

ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వెళ్లారు. కాని ప్రయివేటు కంపెనీల్లో పనిచేసేవారికి, వ్యాపారులకు ఆంధ్రాకు వెళ్లి స్థిరపడాల్సిన అవసరం ఏముంటుంది? దేశం విడిపోయినప్పుడు సెంటిమెంట్‌ పనిచేసింది. కాని ఇప్పుడు ఉపాధి ఎక్కడ ఉంటే అదే మన సొంత రాష్ట్రమనే భావన ఉంది. మెరుగైన జీవితమే ఇప్పటి ప్రజల లక్ష్యం. అమరావతి పేరుకు ప్రాచుర్యం వచ్చిందిగాని, ఏపీ ప్రజల గమ్యం భాగ్యనగరమే..!

జగన్‌ ఐఏఎస్‌ మీటింగులో 'రిసీట్‌' అనే బదులు 'రిసీప్ట్‌' అన్నాడు..