పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ జనసేనాని మీద వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ గట్టిగానే సౌండ్ చేశారు. పవన్ కి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా పార్టనర్ రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అయ్యాయని దుయ్యబెట్టారు.
అందుకే అర్జంటుగా స్టీల్ ప్లాంట్ పేరిట దీక్ష చేశారని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదు, రాజకీయాలే ముఖ్యమనుకునే విధంగా పవన్ దీక్ష ఉందని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఎవరి చేతుల్లో ఉందో కూడా పవన్ కి తెలియకపోవడం విడ్డూరమని గుడివాడ అన్నారు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా ఆయన ఎంతసేపూ జగన్ మీదనే విమర్శలు చేయడం ద్వారా పార్టనర్ రాజకీయ ప్రయోజనాలే కాపాడాలని చూశారని నిందించారు.
విశాఖ అభివృద్ధి తో పాటు ఏపీ అభివృద్ధి జగన్ చేస్తున్న కృషి పవన్ కి కనిపించకపోవడంలో వింత లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రాకు ద్రోహం చేసే విధంగా పవన్ రాజకీయం ఉందని కూడా గుడివాడ అన్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ దీక్షపైన విశాఖ వైసీపీ ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. మరో వైపు స్టీల్ ప్లాంట్ కార్మిక లోకం కూడా ఉద్యమాలలో రాజకీయాలను మిక్స్ చేస్తే ఆశించిన ఫలితం స్టీల్ ప్లాంట్ కి దక్కదని ఆవేదన చేస్తోంది.