మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని మీడియా సంస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొన్ని కులపత్రికలు, గుల పత్రికలు ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుమ్మడి కాయలు దొంగలంటే భుజాలు తడుముకున్న చందంగా… కేసీఆర్ విమర్శించింది తమనే అని “ఆంధ్రజ్యోతి” అక్షరం సాక్షిగా అంగీకరించడం గమనార్హం.
ఈ ఏడాది చివరికి తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో లోక్‌సభ, అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కంటే తెలంగాణలో ముందే ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మూడు నెలల ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రస్తావన వచ్చింది. ఇందుకు కేసీఆర్ స్పందన ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ చివరి దశలో ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తాం. ప్రభుత్వంపై విషం చిమ్మే కొన్ని పేపర్లలో పనిచేసే విలేకరులకు మాత్రం ఇళ్ల స్థలాలివ్వబోం. న్యూట్రల్‌గా ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిస్తాం. నేను గతంలో ఉద్యమం జరిగేటప్పుడే చెప్పాను.. ఈ రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలున్నాయి, కొన్ని గుల పత్రికలున్నాయి. న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదు. వ్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా?’ అని కేసీఆర్ కుండబద్దలు కొట్టిన మీడియా పక్షపాత ధోరణిని ఎండగట్టారు.
కేసీఆర్ ఘాటు కామెంట్స్‌పై ‘ఆంధ్రజ్యోతి’ఇవాళ ఏకంగా ‘అధిక ప్రసంగం’ పేరుతో సంపాదకీయం రాసింది. కుల, గుల పత్రికలని తమను ఉద్దేశించే కేసీఆర్ విమర్శించారని బహిరంగంగానే ఆ పత్రిక అంగీకరించింది. సంపాదకీయంలో ఏం రాశారంటే…
‘ఆ విచిత్ర మానసిక స్థితి నుంచే, తన పాలన మంచిచెడ్డలను చెప్పే పత్రికల మీద నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. పేరు చెప్పకున్నా, ఆయన ఉద్దేశించింది ‘ఆంధ్రజ్యోతి’ అని తెలుస్తూనే ఉన్నది’
తాను ప్రజల వైపు నిలబడి వారి క్షేమం కోసం జరిగే పత్రికా రచన ఇలాంటి బెదిరింపులకు చలిందని సంపాదకీయంలో రాసుకొచ్చారు. విమర్శ స్వీకరించి దిద్దుబాటు చేసుకుంటే పాలకులకు మంచిదని హితవు కూడా చెప్పారు. దిద్దుబాటు పాలకులకే కాదు, పత్రికా యజమానులకు అవసరమని ఆ సంస్థ యాజమాన్యం గ్రహించకపోవడం అహంకారమవుతుందనే ఇంగితం కొరవడడం గమనార్హం.
పైగా విమర్శను తొక్కిపెట్టి, అంతా బాగుందని భ్రమపడి, భ్రమ పెడితే ప్రయోజనం ఏమిటి? ప్రజలు మరీ అమాయకులు కారని ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో పేర్కొనడం విశేషం. పాఠకులు అమాయకులు కారని ఎందుకు గ్రహించడం లేదో అనే ప్రశ్న మదిలో మెదులుతుంది. తాము రాసింది చదివి ప్రజలు ప్రభుత్వానికి లేదా తాము ద్వేషించే పార్టీకి వ్యతిరేకం అవుతారని, తాము ఆరాధించే రాజకీయ పార్టీ వైపు మళ్లుతారనే భ్రమలో ఉండడం వారికే చెల్లింది.
కేసీఆర్ జర్నలిజానికి వ్యతిరేకమని చెప్పలేదు. తప్పును తప్పుగా చూపే తటస్థ మీడియా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు. తమ పేచీ కేవలం “వ్యూస్” పత్రికలతోనే అని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రజ్యోతి వ్యూస్ పత్రిక అని చెప్పేందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇటీవల సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతికి రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు నివాళి అర్పిస్తూ సంతాప ప్రకటనలు ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాప ప్రకటన అచ్చు వేయడానికి ఆంధ్రజ్యోతికి మనస్కరించలేదు. కేవలం చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటనలను మాత్రమే ప్రచురించింది.
ఇవాళ ఏపీ ఎడిషన్‌లో బ్యానర్ కథనాన్ని చూస్తే… న్యూస్ పత్రికకు, వ్యూస్ పత్రికకు తేడాను స్పష్టంగా తెలుసుకోవచ్చు. విజయవాడలో ఏపీ ఎన్జీవోల వార్షికోత్సవ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూస్ పత్రిక అయితే ఏం చేస్తుంది…. సమావేశ వార్తను ప్రముఖంగా ఇస్తుంది. ఒకవేళ వ్యతిరేక వార్త రాయాలని అనుకుంటే దాని పక్కనే మరొకటి ప్రచురించొచ్చు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం “ఉద్యోగులపై జగన్‌ది ప్రేమా..పగా?” అనే శీర్షికతో ఏపీ ఎన్జీవో సభలో సీఎం అబద్ధాల ప్రసంగం అని విషం చిమ్ముతూ కథనం రాసింది.
ఇది కదా వ్యూస్ పత్రిక అంటే. మళ్లీ వీళ్లే అధిక ప్రసంగం అంటూ సంపాదకీయాలు రాయడం దేనికి సంకేతం? తామేం చేసినా నోర్మూసుకుని చూస్తే కూచోవాలంటే ఎలా కుదురుతుంది? మొత్తానికి తమది కుల, గుల పత్రిక అని ఎడిటోరియల్ సాక్షిగా ఆంధ్రజ్యోతి ఒప్పుకోవడం చర్చనీయాంశమైంది.