సాధారణంగా రాజకీయ పార్టీలకు తొత్తులుగా, భజన బృందాలుగా వ్యవహరించే పత్రికలు కూడా లేనిదానిని ఉన్నట్టుగా సృష్టించడం అసాధ్యం. కనీసం పుకార్లుగా అయినా కొన్ని విషయాలు ప్రచారంలో ఉంటే.. గోబెల్స్ లాగా వాటిని పదేపదే ప్రచారం చేస్తూ తాను ఆశించే ప్రయోజనాలను, తాము సాగిలపడి ఉన్న రాజకీయ పార్టీకి దక్కించేలా చేయడానికి వారు ప్రయత్నించగలరు.
కానీ.. అచ్చంగా ఊహలను, కలలో మెదలిన విషయాలను, ఏ బాత్రూంలోనో ఒంటరిగా గడుపుతున్నప్పుడు వచ్చిన చిత్రమైన ఆలోచనలను సంభావ్యతగల భవిష్య పరిణామాలుగా చిత్రించి రాయడానికి చాలా దమ్ము కావాలి. కేవలం ఊహల్ని వండి వార్చి, వాటినే ప్రజలకు వడ్డిస్తే.. తాము కోరుకుంటున్న పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తర్వాతి సంగతి.. తమ పత్రిక పరువు మాత్రం సర్వభ్రష్టత్వం చెందిపోతుందనే భయం వారికి ఉండాలి. కానీ.. ఆంధ్రజ్యోతికి అదేమీ లేదు. ప్రతి ఆదివారం ఉదయం తెలుగు ప్రజల మెదళ్లలోకి విషప్రవాహాన్ని పంప్ చేస్తూ ఉండే.. ఆర్కే చెత్తపలుకు తాజాగా అలాంటి సాహసమే చేసింది.
చంద్రబాబునాయుడును ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిగా గద్దెమీద కూర్చోబెట్టాలని, కింగ్ మేకర్ హోదాను రామోజీరావుతో పంచుకోవాలని రాధాకృష్ణకు చిరకాల కోరిక. నేను ముఖ్యమంత్రి అయిపోతానో.. మీ జీవితాల్ని ఉద్ధరించేస్తానో.. అంటూ ప్రతి సభలోనూ డప్పు కొట్టుకునే పవన్ కల్యాణ్ విషయంలో ఆయన నానా వంటకాలూ వండేశారు. పవన్ కల్యాణ్ , తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడానికి సీఎం సీటును డిమాండ్ చేస్తున్నాడని, ఎట్ లీస్ట్ రెండున్నరేళ్లు అడుగుతున్నాడని, తొలి రెండున్నరేళ్లు తమకే కావాలని జనసేన డిమాండ్ అని ఒక ప్రచారం ఉంది.
నిజానికి పవన్ కల్యాణ్ కు అదే ఆశ ఉంది. జనసైనికులందరూ వీరబీభత్సంగా ఈ ప్రతిపాదనను భుజాన మోస్తున్నారు. చంద్రబాబుకు తమ నాయకుడి పొత్తు కావాలంటే ఇలాగే చేయాలని అంటున్నారు. అయితే.. ఇదంతా వైసీపీ ముసుగువీరులు చేస్తున్న దొంగ ప్రచారం అట. వైసీపీ కావాలని, జనసేన టీడీపీ పొత్తు కుదరకుండా ఉండడానికి ఇలాంటి అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నదట. ఈ ప్రచారాన్ని నమ్మి.. పవన్ పొత్తు పెట్టుకోకుండా ఉండిపోవాలని ఆశిస్తోందంట.
అవును మరి, పవన్ కల్యాణ్ అంటే.. నోట్లో వేలు పెడితే కొరకలేని పాలు తాగే పసిపిల్లాడు.. వైసీపీ వాళ్లు ఏం ప్రచారం చేస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాడు.. అని జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబునాయుడు సీఎం సీటులో వాటా గురించి తేలిస్తే తప్ప.. పవన్ కల్యాణ్ పొత్తుల గురించి ప్రకటన చేసేది జరగదు అనేది జగద్విదితం. కానీ వైసీపీ ప్రచారం రూపంలో ఒక బూచిని చూపించి.. పవన్ ను రెచ్చగొట్టి ఆయనతో పొత్తు ప్రకటన చేయించాలనేది ఆర్కే చెత్తరాతల లేకివ్యూహం.
ఈ చెత్తపలుకులో మరో చెత్తకోణం.. చిత్రకోణం.. పుకార్లు పుట్టించే వారి బుర్రకు కూడా తట్టని మరో పాయింటు కూడా ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి, పవన్ కల్యాణ్ తో తాను పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నాడట. తెలుగుదేశంతో మైత్రి ఆలోచన వదిలేసి, బిజెపితో బంధాన్ని వదిలించుకుని భారాసతో చేతులు కలిపితే వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని కేసీఆర్ తన దూతలను పవన్ వద్దకు పంపారట. అలా జరిగి తాము సంకీర్ణాల్లో అధికారంలోకి రాగలిగితే.. అక్కడ పవన్ ను సీఎంను చేస్తానని కూడా హామీ ఇచ్చారట. అందులో ఇంకా అలాంటి అనేక చెత్త విషయాలు ఉన్నాయి.
పవన్ కల్యాణ్ పార్టీ ఆర్థిక మూలాల్ని కూలగొట్టి తోట చంద్రశేఖర్ వంటి నాయకుల్ని తనతో కలుపుకున్న కేసీఆర్.. మళ్లీ పవన్ తో పొత్తు పెట్టుకుని ఏపీ ఎన్నికల్లో దిగాలని ఎలా అనుకుంటారు? ఇన్నాళ్లూ బిజెపి చంక ఎక్కి కూచుని, ఇప్పుడు హఠాత్తుగా బిజెపిని తీవ్రంగా నిందించే కేసీఆర్ భుజంమీద సవారీ చేయడానికి సిద్ధపడితే జనం అసహ్యించుకుంటారనే భయం పవన్ కల్యాణ్ కు లేకుండా ఉంటుందా? వంటి అనేక సమీకరణలను ఆర్కే చాలా కన్వీనియెంట్ గా మర్చిపోయారు.
ఇంకా ఆర్కే కలల్లో మెదలుతున్న ఊహలు ఎలాంటివంటే.. తెలంగాణలో తెలుగుదేశం, బిజెపి పొత్తు పెట్టుకోవాలట, అలా జరిగితే ఇక్కడి కమ్మ ఓట్లు ఎటూ తనకు పడవు గనుక.. తాను పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుని కాపు ఓట్లన్నీ గంపగుత్తగా తనకు పడేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారట. ఏపీలో కూడా కాపు ఓట్ల మీద ఫోకస్ పెడుతున్నారట. ఇంత నీచంగా ఊహల రాతలను వండి వార్చడం బహుశా ఎవ్వరికీ సాద్యం కాదేమో అన్నట్టుగా ఆర్కే చెత్త పలుకు సాగిపోయింది. కాకపోతే మధ్యలో ఈ వ్యాసానికి పాతివ్రత్యం పులమడం కోసం ఒక మంత్రి చెప్పారు, ఒక నాయకుడు అన్నారు, ఒక సీనియర్ మంత్రి తెలిపారు.. అంటూ పదబంధాలు కూడా వాడారు. జనానికి చీదర పుట్టించే కథనం ఇచ్చారు.
సదరు వేమూరి రాధాకృష్ణ బాబా.. పొద్దున్నే సత్యం బోధించే ఒక సందేశం ఇచ్చారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే అని సెలవిచ్చారు. ఈ జీవిత సత్యం మీడియా వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. కుప్పకూలిపోయిన మీడియా సామ్రాజ్యాలను ఈ సీనియర్ జర్నలిస్టు వ్యాపారవేత్త ఒకసారి వెనక్కితిరిగి చూసుకుంటే బాగుంటుంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక చేతులుమారి, ఆయన బారిన పడేముందు ఎందుకు కుప్పకూలిపోయిందో.. శూలశోధన, పరిశోధనాత్మక జర్నలిజంలో మహానుభావుడు అయిన ఆయనకు తెలియందేమీ కాదు.
తనకు సంపదను పెంచే ఇతరత్రా వ్యాపారాలకు కవచంలాగా ఉపయోగపడుతున్న ఈ మీడియా ముసుగు పటాపంచలై కుప్పకూలిపోకుండా ఉండాలంటే.. రాధాకృష్ణ చెత్తపలుకు శీర్షికకింద మహా చెత్త రాతలు రాయడం మానుకోవాలి.